Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్ముడి అడుగుజాడల్లో.. "స్వాతంత్య్ర భానోదయం"

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (20:58 IST)
"దెబ్బ తీయటం గొప్ప కాదు, దెబ్బను సహించటం గొప్ప. అందుకు ఎంతో ఆత్మస్థైర్యం కావాలి" అని నిరూపించిన జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడలు ప్రతి భారతీయుడికీ మార్గదర్శకాలు. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఒక స్థిరమైన ఆశయంతో వచ్చిన ఆయన వెంట జాతి యావత్తూ అడుగులేసింది. అప్పటిదాకా స్వతంత్ర భారతదేశం కోసం ఓ ప్రణాళిక అంటూ ఏదీలేక అస్తవ్యస్తంగా ఇష్టం వచ్చినట్లు నడచిన భారత ప్రజలకి ఆయన అడుగుజాడలే దిశా నిర్దేశాలుగా, ఆదర్శాలుగా మారాయి.
 
ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం.. ఆక్రోశం ఆవేశాల స్థానంలో అహింసలను ఆయుధాలుగా మలచిన మహాత్ముడి తీరు చూసి ప్రపంచదేశాలన్నీ ఆశ్చర్యచకితులయ్యాయి. అప్పటిదాకా "ఆడింది ఆటగా పాడింది పాటగా" తైతక్కలాడిన బ్రిటీష్ ప్రభుత్వానికి చక్కటి గుణపాఠం చెప్పారాయన.
 
సత్యాగ్రహం కావచ్చు, దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు... ఇలా మహాత్ముడు చేపట్టిన ఏ ఉద్యమానికయినా ప్రజలు సంపూర్ణ మద్ధతును, సహకారాన్ని అందించారు. "వందేమాతరం" అంటూ ముక్తకంఠంతో ఆయన వెంట జనప్రవాహమై సాగిపోయారు. 
 
అలా సాగిన ఆ పోరాటానికి 1947 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రిలో ప్రతిఫలం లభించింది. అంత చీకట్లో కూడా కోట్లాది భారతీయుల కళ్ళల్లో కోట్ల కాంతుల ఉషోదయం విరజిమ్మింది. ఆ ఉషోదయానికి ఇప్పుడు అరవై ఎనిమిదేళ్లు. ఈ 68 ఏళ్ల స్వాతంత్ర్య ప్రస్థానంలో ప్రతి ఏడాదినీ పుట్టినరోజులా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మరో పుట్టినరోజును నేడు జరుపుకోబోతున్నాం.
 
సాధారణంగా పుట్టినరోజును కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్యన జరుపుకుంటుంటాం. కానీ... స్వతంత్ర భారతదేశ పుట్టిన రోజును బడిలో, గుడిలో, కళాశాలల్లో, కార్ఖానాల్లో, స్వదేశంలో, విదేశంలో... ఇలా ఎక్కడయినా సరే, ముహూర్తంతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చు.
 
ఈ పుట్టినరోజు వేడుకలు ఆత్మీయుల మధ్యనేగాదు అపరిచితుల మధ్య కూడా జరుపుకోవచ్చు. దీనికి ఆహ్వానాల అవసరం లేదు, అతిథుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు. మన స్వతంత్ర భారతావని పుట్టినరోజు వేడుకకు అందరూ ఆహ్వానితులే, ముఖ్యులే...!
 
"ఇంటా, బయటా" అని పెద్దలు అంటుంటారు. దీనికి ఇంట్లోనూ, అదే ఊరిలో మరోచోట అనే అర్థాలున్నప్పటికీ... వాటి స్వరూపాన్ని బట్టి నేడు "ఇంట అంటే భారతదేశంలో ఎక్కడయినా అనీ.. బయట అంటే, భారతదేశం అవతల ఏ విదేశంలో ఉన్నా" అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సావాలను స్వదేశంలోనూ, విదేశాల్లోని నివసించే భారతీయులందరూ అత్యంత కోలాహలంగా వేడుకలు చేసుకుంటున్నారు.
 
అందుకే...
 
“ఏ దేశమేగినా ఎందుకాలిడినా 
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన 
పొగడరా నీ తల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవము”... అంటూ ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావుగారి ప్రబోధాన్ని మరోసారి మననం చేసుకుని దేశ విదేశాల్లో సైతం స్వాతంత్ర్య దినోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించుకోవడం భారతీయులుగా మనందరి కర్తవ్యం.
 
ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన వచ్చే ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇచ్చే సెలవు దినం కోసం ఎదురుచూపులు చూడటం కాకుండా, స్వాతంత్ర్య దినం కోసం ఎదురుచూడటం భారతీయులందరి కనీస ధర్మం. మరణించిన పెద్దలను ప్రతి ఏటా స్మరించుకోవటం, సంతర్పణలు లాంటివి చేస్తుంటాం.
 
మరి మనందరం స్వేచ్ఛగా బ్రతికేందుకు మరణం తప్ప మరో మార్గం లేదని తెలిసి కూడా కదనరంగంలోకి దూకి అసువులు బాసిన స్వాంతంత్ర్యోద్యమ వీరులను ఒక్కరోజైనా తలచుకోవటం మన కనీస ధర్మం కాదా..? మనం వారికి ఎలాంటి సంతర్పణలు చేయాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ఒక్కసారి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటే చాలు.
 
మన ముందు తరాలవారి త్యాగ ఫలాలను భోంచేస్తున్న మనం ఇప్పుడు కొత్తగా త్యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదుగానీ.. ప్రతియేటా ఈ పండుగను జరుపుకునేందుకు కాస్తంత తీరిక చేసుకుంటే చాలు. మన భారతీయ పండుగల్లో ఏ పండుగకూ, ఏ వేడుకకీ.. ఈ స్వాంతంత్ర్య దినోత్సవ పండుగ తీసిపోదు. దసరా, దీపావళి, హోలీ, క్రిస్‌మస్ పండుగలు వివిధ మతాలకు చెందినవైతే... అన్ని మతాలవారు చేసుకోదగ్గ అద్వితీయ పండుగ మన "స్వాంతంత్ర్య దినోత్సవం".
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

Show comments