Webdunia - Bharat's app for daily news and videos

Install App

"నువ్వు లేవు.. నీ పాట ఉంది" ఆ పాటకు నేడే జన్మదినం...!!

Webdunia
FILE
" నువ్వు లేవు నీ పాట ఉంది
ఇంటి ముందు జూకామల్లె తీగల్లో అల్లుకుని
లాంతరు సన్నని వెలుతురులో క్రమ్ముకుని
నా గుండెల్లో చుట్టుకుని
గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో
దాక్కుని నీరసంగా, నిజంగా ఉంది
జాలిగా హాయిగా వినపడుతూ వుంది
శిశిర వసంతాల మధ్య వచ్చే మార్పుని గుర్తుకి తెస్తోంది"

( దేవరకొండ బాలగంగాధర తిలక్ వ్రాసిన "అమృతం కురిసిన రాత్రి" నుండి)


నేరేడు పండులాంటి నిగనిగలాడే శరీరం, గిరజాల జుట్టు, ఇంతలేసి కళ్లతో ముద్దులొలికే ఓ చిన్నారి పిల్లవాడు ఆగస్టు 29, 1958లో ఓ నల్లజాతీయుల కుటుంబంలో ఏడవ సంతానంగా జన్మించాడు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో, గ్యారీ అనే పట్టణంలో పుట్టిన ఆ చిన్నారి అమాయకంగా వేసిన పసి అడుగులు, ముద్దు ముద్దుగా పాడిన పాటలు పాప్ సంగీత ప్రపంచానికి తొలి మెట్లు అవుతాయని ఆ తల్లిదండ్రులు ఆనాడు గ్రహించలేదు.

ఆ చిన్నారి క్లాసులో తోటి విద్యార్థుల ముందు మయూరంలా పురివిప్పి ఆడేవాడు, కోకిలలా పాడేవాడు. అలా ఐదేళ్ల పసి ప్రాయంలో అమాయకంగా పాప్ రంగంలో అడుగుపెట్టి.. అనతి కాలంలోనే పాప్ సూపర్ స్టార్‌గా మారి.. తనతోపాటే ప్రేక్షకులను ఆడించి, పాడించి, మత్తెక్కించి, ఊగించి, వెర్రెత్తించిన.. ఆ పసి బాలుడే, పాప్ సంగీత రారాజు అయ్యాడు. ఆయనే "మైఖేల్ జోసఫ్ జాక్సన్".

జాక్సన్ చిన్న వయసులో... జాక్సన్ తండ్రి తన ఐదుగురు పిల్లలతో కలిసి ఏర్పాటు చేసిన "జాక్సన్-5" బ్యాండ్ ద్వారా ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఇక మన బుజ్జి మైఖేల్ అయితే క్రిస్టమస్ ఉత్సవాలను, స్నేహితుల పుట్టిన రోజులను అస్సలు వదిలేవాడు కాదు. తన ఆటపాటలతో అందరినీ ఉత్సాహపరిచేవాడు. చుట్టుప్రక్కల ప్రాంతాలలో నల్లవారి క్లబ్బుల్లోనూ, ఉత్సవాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చేవాడు.

తొమ్మిదేళ్ల ప్రాయంలో జాక్సన్ తన ఆటపాటలతో అత్యుద్భుతమైన ప్రతిభను కనబరిచేవాడు. తన పాట వింటే పసివాడు పాడినట్లే ఉన్నా.. డాన్స్ మాత్రం మంచి అనుభవజ్ఞుడు చేసినట్లుగా ఉండేది. పైగా తన ఆటకు, పాటకు అనుగుణంగా కట్టే సొంత బాణీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి.
FILE


మిలటరీ తరహా కోటు, చలువ కళ్లద్దాలు, చేతి తొడుగు, టోపీ పెట్టుకొని మైఖేల్‌ వేదిక మీదకొచ్చాడంటే ఉరుములు... మెరుపులే...! శరీరాన్ని నాగుపాములా మెలికలు తిప్పుతూ, రబ్బరుబంతిలా చుట్టేస్తూ... ఉచ్ఛస్వరంతో పాడితే ప్రేక్షకులు ఊగిపోవాల్సిందే, వంగి వందనాలు పలకాల్సిందే. అటువంటి మైఖేల్‌ తన నలభై ఐదేళ్ల కెరీర్‌లో అద్భుతమైన ఆల్బమ్‌లు పది రూపొందించాడు. అందుకోసం అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు.

పధ్నాలుగేళ్ల ప్రాయంలో సోలో సింగర్‌గా మైఖేల్‌ తొలి ఆల్బమ్‌ను రూపొందించాడు. 1972లో చేసిన 'గాట్‌ టు బి దేర్‌'ను మోటౌన్‌ విడుదల చేసింది. అదే సంవత్సరం చేసిన 'బెన్‌' పూర్తిస్థాయి సోలో సింగర్‌గా అతను చేసిన రెండవ ఆల్బమ్‌. ఇది మిలియన్ల కొద్ది అభిమానుల ఆదరణ పొందింది. మూడవ ఆల్బమ్‌ 'మ్యూజిక్ అండ్‌ మి' (1973). కౌమారంలో ప్రకృతిసహజంగా మార్పు చెందుతోన్న స్వరంతో మైఖేల్‌ ఈ ఆల్బమ్‌ చేశాడు.

' జాక్సన్‌ 5'తో మోటౌన్‌ చేసిన చివరి ఆల్బమ్‌ 'ఫరెవర్‌, మైఖేల్‌' (1975). ఈ సోలో ఆల్బమ్‌తోనే మైఖేల్‌ పాప్‌ సంగీత ప్రధాన స్రవంతిలో కలిశాడు. అతను చేసిన ఆరవ ఆల్బమ్‌ 'థ్రిల్లర్‌' (1982). ఇది ఆల్బమ్‌ అమ్మకాలలోనే రికార్డులు సృష్టించింది. అంతేకాక మైఖేల్‌ ఒక్కసారిగా పాప్‌ సూపర్‌స్టార్‌ అయిపోయాడు. టీవీ చానళ్లలో మ్యూజిక్ వీడియోలకు తెరతీసిందీ ఈ ఆల్బమే. దీని ద్వారా అతను పరిచయం చేసిన 'మూన్‌వాక్' డాన్స్‌ను అభిమానులు ఎప్పటికీ మరువలేరు.

ఆ తర్వాత ఇదేళ్లకు 1987లో రూపొందించిన ఆల్బమ్‌ 'బ్యాడ్‌'. ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయి. 1991లో విడుదలైన 'డేంజరస్‌' ఆల్బమ్‌ ఏకంగా పాప్‌ సంగీత ప్రపంచంలోనే ఒక సంచలనం సృష్టించింది. జాతి వివక్షను దునుమాడుతూ పాడిన 'బ్లాక్ అండ్‌ వైట్‌' విన్నవారికెవరికైనా కళ్లు చెమ్మగిల్లాల్సిందే.

యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఆలపించిన 'హీల్‌ ది వరల్డ్‌' వింటే యుద్ధోన్మాదులు సైతం పునరాలోచనలో పడాల్సిందే. 1995లో 'హిస్టరీ', 2001లో 'ఇన్‌విన్సిబుల్‌' విడుదలై మిలియన్ల కొద్దీ కాపీలు అమ్ముడయ్యాయి. మొత్తంమీద ప్రపంచ వ్యాప్తంగా మైఖేల్‌ ఆల్బమ్‌లు 750 మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయని ఒక అంచనా...!

ప్రపంచంలోని టాప్ 100 పాప్ గీతాల్లో 13 పాటలు మైఖేల్ జాక్సన్‌వే. మరే సంగీతకారుడి పాటలు ఇన్ని లేవు. మైఖేల్ జాక్సన్ కెరీర్లో అమ్ముడైన అతని ఆల్బమ్‌ల సంఖ్య అక్షరాలా 75 కోట్లు. జాక్సన్ చేసిన ఘోస్ట్ అనే వీడియో ఆల్బమ్ 39.31 నిమిషాల పాటు సాగుతుంది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన వీడియో ఆల్బమ్ ఇది. దీంట్లో జాక్సన్ 5 పాత్రలు పోషించాడు.

FILE
సోలో కళాకారుడుగా మైఖేల్‌ సాధించిన ప్రపంచ ఖ్యాతి మాటలకు అందదు. అక్షరాలకు చిక్కదు. కేవలం గాయకుడిగానే కాక గీత రచయితగా, డాన్సర్‌గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారుడిగా ప్రేక్షక హృదయాలపై జాక్సన్‌ చెరగని ముద్రవేశాడు. అంతేకాదు మంచి టీమ్‌లీడర్‌ కూడా. ఇందుకు ఆయన విడుదల చేసిన వేలాది రికార్డులు, అందుకున్న అవార్డులే సాక్ష్యం.

పాటనే ఊపిరిగా, ఆటనే ఆహారంగా బ్రతికిన మైఖేల్‌ను వరించిన అవార్డులు, రివార్డులు ఎన్నో...ఎన్నెన్నో. తన జీవితకాలంలో 13 గిన్నెస్ రికార్డులు సాధించాడు. వీటిలో 8 ఒక్క 2006లోనే సాధించాడు. సంగీతరంగంలో ఆస్కార్‌గా పరిగణించే గ్రామీ అవార్డు మైఖేల్‌ను 18 సార్లు వరించింది. ఇవి కాక 22 అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 40 బిల్‌బోర్డు అవార్డులు, 13 ఎంటీవీ అవార్డులు, 12 వరల్డ్ మ్యూజిక్ అవార్డులు జాక్సన్ సొంతమయ్యాయి.

మైఖేల్‌ ఆటపాటతో మిలియన్లకొద్దీ డాలర్లను సంపాదించినప్పటికీ బాల్యంలో తను అనుభవించిన పేదరికాన్ని మాత్రం మరువలేదు. తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకోసం కేటాయించేవాడు. అనాథ పిల్లలకోసం 1992లో 'హీల్‌ ది వరల్డ్‌' ఫౌండేషన్‌ను స్థాపించాడు. హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ బాధితులకూ సాయం అందించాడు. వీధి బాలలు ఆడుకోవడానికి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను, జంతువులకోసం జూపార్క్‌ను ఏర్పాటు చేశాడు.

" పిల్లలకోసం ఏదో ఒకటి చేయాలన్న తపన నన్ను ఎప్పుడూ నిలవనీయలేదు... ఎన్నో చేశా... ఎంతో మందికి సహాయం చేశా... వేలు, లక్షలు... కేన్సర్‌ బారినపడిన పిల్లల్ని అక్కున చేర్చుకున్నా...’ అంటూ జాక్సన్ ఉద్వేగంగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. 39 ఛారిటీలకు ఆర్థిక సాయం చేసి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించటమేగాక.. ఆత్మహత్య చేసుకోబోయిన ఎంతోమందిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్న మహా మనీషి కూడా...!!

నాలుగు దశాబ్దాలపాటు అంతర్జాతీయ సంగీతరంగంలో పాప్‌ సరిగమలు పలికించి, తన ఆట, పాటతో ప్రేక్షకులను సమ్మోహితులను చేశాడు మైఖేల్ జాక్సన్. అయితే ప్రపంచాన్ని నర్తింపజేసిన ఆ పాద విన్యాసం హఠాత్తుగా ఓ రోజు ఆగిపోయింది. లక్షల గొంతుకల్ని స్వరం కలిపేలా చేసిన ఆ గానం మూగబోయింది. అభిమాన జనకోటిచేత కేకలేయించిన, గెంతులేయించిన, పరవశింపజేసిన, హృదయాల్ని పిండేసిన ఆ గుండె ఆగింది, శ్వాస ఆగింది. వెన్నెముకే లేనట్టు వంపులు తిరిగే ఆ దేహం నిస్తేజమై పోయింది.

ఎన్నో రికార్డులు.. ఎన్నో సంచలనాలు.. మరెన్నో వివాదాలు.. కోటాను కోట్ల అభిమానులు, వేల మంది విమర్శకులు.. అందరినీ.. అన్నింటినీ.. శాశ్వతంగా వదిలి మైఖేల్ జాక్సన్‌ (50)... 2009, జూన్ 25వ తేదీ అర్ధరాత్రి గుండెపోటుతో అసువులు బాసారు. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లోగల తన బెల్‌ ఎయిర్‌ భవంతిలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువుల ఫోన్‌కాల్‌తో అక్కడికి చేరుకున్న వైద్యసిబ్బంది ఛాతీపై బలంగా ఒత్తుతూ జాక్సన్‌ గుండె తిరిగి కొట్టుకునేలా చేయడానికి కృషిచేశారు.

అయినా ఫలితం లేకపోవడంతో ఆయనను రోనాల్డ్‌ రీగన్‌ యూసీఎల్‌ఏ వైద్య కేంద్రానికి తరలించారు. అయితే జాక్సన్‌ అర్ధరాత్రి దాటాక 2:56 గంటలకు మృతిచెందినట్లు లాస్‌ ఏంజెలిస్‌ కౌంటీ కరోనర్‌ కార్యాలయానికి చెందిన లెఫ్టినెంట్‌ ఫ్రెడ్‌ కోరల్‌ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన మరుక్షణం ప్రపంచవ్యాప్తంగా జాక్సన్‌ అభిమానులు ఒక్కసారిగా నిశ్ఛేష్ఠులయ్యారు. దాదాపు 40 ఏళ్లపాటు తన సంగీత, నాట్యాలతో ఓలలాడించిన తమ ఆరాధ్య గాయకుడు మరిలేరని తెలిసి కన్నీళ్ల పర్యంతమయ్యారు.

అలా ప్రపంచ పాటను, ఆటను కొత్త మలుపు తిప్పి చరిత్రను సొంతం చేసుకుని.. మరణ సమయంలోనూ ఔన్నత్యం ప్రకటించుకుంటూ.. చరిత్రను మరోసారి కోటానుకోట్ల సంగీత ప్రియులకు గుర్తు చేస్తూ.. మైఖేల్ జాక్సన్ ఫైనల్ మూన్‌వాక్ చేశాడు. ఈ అమర గాయకుడి, అద్భుత నర్తకుడి అభిమాన లోకం అతనికి ఘనంగా, ఉద్విఘ్నభరితంగా వీడ్కోలు పలికింది. చరిత్ర గుర్తుంచుకునేలా, చరిత్రలో నిలిచిపోయేలా ఆయనకు నివాళులర్పించింది.

ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా 20వేల మంది చూడగా... ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అమెరికాలోని 88 థియేటర్లలో ఆరోజు సినిమాలు ప్రదర్శించకుండా.. జాక్సన్‌ అంతిమ వీడ్కోలు కార్యక్రమాన్నే ప్రత్యక్ష ప్రసారం చేశారంటే.. సంగీతంలోనే కాదు, మరణంలో సైతం అతను "రారాజు"గా తరలివెళ్లారనడం అతిశయోక్తి కానేరద ు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

Show comments