తిరుపతి సంజయ్ ఎక్కడ...?! బాబు క్లాస్‌తో బయటకు రావడం లేదా...?!!
సంజయ్... ఈ పేరువినగానే అందరికీ గుర్తుకు వచ్చేది తమిళ నటుడు సూర్య. గజిని సినిమాలో సూర్య చేసిన పాత్ర సంజయ్. ఆ పాత్ర దేశ సినీచరిత్రలో ఎంత పేరు సంపాదించి పెట్టిందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ సంజయ్ వేరు.. ప్రస్తుతం మనం చూస్తున్న కథనంలోని సంజయ్ వేర
సంజయ్... ఈ పేరువినగానే అందరికీ గుర్తుకు వచ్చేది తమిళ నటుడు సూర్య. గజిని సినిమాలో సూర్య చేసిన పాత్ర సంజయ్. ఆ పాత్ర దేశ సినీచరిత్రలో ఎంత పేరు సంపాదించి పెట్టిందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ సంజయ్ వేరు.. ప్రస్తుతం మనం చూస్తున్న కథనంలోని సంజయ్ వేరు. ఈ సంజయ్ రాజకీయాల్లో కింగ్. తిరుపతి నుంచి చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే అల్లుడు. అల్లుడంటే అట్లా ఇట్లా కాదు. అల్లుడా.. మజాకా అంటూ అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ప్రవర్తిస్తుంటాడు ఈయన. సంజయ్‌పై ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చినా.. ప్రస్తుతం మాత్రం అందరికీ దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఎపిలోని రాజకీయ నాయకులకు సుపరిచితమైన ఈ సంజయ్ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరం దూరంగా ఉండటం చర్చకు దారితీస్తోంది.
తిరుపతి ఎమ్మెల్యేగా దివంగత నేత వెంకటరమణ ఉన్న సమయంలో ఆస్తిపాస్తుల విషయాలన్నీ దగ్గరుండి చూసుకునేవారు అల్లుడు సంజయ్. ఆయన మరణం తరువాత కూడా ఆయన సతీమణి సుగుణమ్మ గెలిస్తే ఇంటి విషయాల నుంచి ఏకంగా ప్రజల్లోకి వచ్చాడు. అది కూడా సాదాసీదాగా కాదు. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లు సంజయ్ వ్యవహరించేవాడన్న విమర్శలు లేకపోలేదు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవాలంటే ముందుగా ఎమ్మెల్యే ఇంటికి వెళితే సంజయ్‌ను కలవాలి. ఆయన అభయమిస్తేనే ఏదైనా. అల్లుడు ఒకే అంటే ఇక అత్త సైలెంట్ అయిపోవాల్సిందే. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే దగ్గరుండి సపర్యలు చేస్తారు సంజయ్. అందుకే అధిష్టానానికి సంజయ్ అంటే కొంత అభిమానం.
అలాంటి సంజయ్ ప్రస్తుతం కనిపించడం లేదు. కొన్ని నెలలుగా కనిపించకుండా తిరుగుతున్నారు. సిఎం, లోకేష్ ముఖ్య నేతలు వస్తే తప్ప, మిగిలిన ఎవరు వచ్చినా రావడం లేదు. కారణం చంద్రబాబు, లోకేష్‌ల క్లాస్.. సంజయ్ పార్టీ నాయకులను కించపరుస్తూ మాట్లాడటం, కొన్ని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాడన్న ఆరోపణలు బాబు దృష్టికి వెళ్లాయి.
ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బాబు సంజయ్‌ను విజయవాడకు పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారట. అంతేకాదు సిఎం తరువాత లోకేష్ కూడా క్లాస్ పెరికారట. పార్టీ నాయకులను కించపరిచినా, పార్టీకి నష్టం వాటిల్లేలా ఇంకోసారి ప్రవర్తిస్తే బాగుండదని తీవ్రస్థాయిలోనే క్లాస్ పెరికారట. దీంతో సంజయ్ అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారట. కార్యకర్తలు, నాయకులు గానీ ఎవరు వచ్చినా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. అసలు తనకు సన్నిహితులు వచ్చినా మళ్లీ కలుస్తానంటూ పంపించేస్తున్నారట. ఫోన్ చేస్తే తీయడం లేదట.
ప్రస్తుతం సమస్యలను చెప్పుకునేందుకు వెళుతున్న ప్రజలు నేరుగా సుగుణమ్మనే కలుస్తున్నారంట. మొత్తంమీద ఎన్నిరోజుల పాటు ఇలా సంజయ్ ఉంటారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.