హఫీజ్‌పేట భూ వివాదం బ్యాక్‌డ్రాప్‌గా తెరపైకి వచ్చిన కిడ్నాప్ కేసులో అదృశ్యశక్తుల పాత్ర బలంగా పనిచేస్తోందా? మాజీ మంత్రి అఖిలప్రియ ఊబిలో ఇరుక్కుపోయారా? పైకి చెబుతున్నట్టుగా ల్యాండ్ సెటిల్మెంట్.. కిడ్నాప్‌లే కాకుండా ఇతరత్రా పాత గొడవలు ఈ కేసులో ప్రభావం చూపుతున్నాయా? రాజకీయ, పోలీసు వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
బోయినపల్లి కిడ్నాప్ కేసుపై ఆసక్తికర చర్చ!
బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు అరెస్టయింది మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఒక్కరే. ఈ కేసులో చాలా మంది పేర్లు నిందితుల జాబితాలో చేరుతున్నాయి. కీలకంగా పనిచేసిన వారి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అఖిలప్రియ భర్త భార్గవరామ్ కోసం పోలీసులు అన్వేషించని ప్రాంతం లేదంటే అతిశయోక్తికాదు. ఈ కేసు వివరాలను వెల్లడించడానికి స్వయంగా నగర సీపీ అంజనీకుమారే మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన చెబుతున్న పేర్లు FIRలో కొత్తగా చేరుతున్నాయి. ఈ సందర్భంగా సీపీ వెల్లడిస్తున్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
అవకాశం కోసం చూస్తోన్న శక్తులు తెరవెనక కీలక పాత్ర?
ఈ కేసు ఒకేసారి మొత్తానికి మొత్తం అఖిలప్రియకు ఎందుకు చుట్టుకుంది? ఆమె మాజీ మంత్రి. ఏపీలో విపక్ష పార్టీకి చెందిన నేత. రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిణామాల వల్ల ఆమె ఊబిలో ఇరుక్కుపోయారా? కిడ్నాప్ కేసులో పోలీసులు చెప్పే పక్కా ఆధారాలు.. రుజువులు.. పాత గొడవల సంగతి పక్కన పెడితే ఈ కేసులో ఇంకేమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? అవకాశం కోసం ఎదురు చూస్తోన్న శక్తులేమైనా తెరవెనక కీలక పాత్ర పోషిస్తున్నాయా?
భార్గవరామ్ గత జీవితం వెంటాడుతోందా?
భూమా నాగిరెడ్డి, శోభ దంపతులు బతికున్న సమయంలోనే అఖిలప్రియకు పెళ్లి అయింది. విడాకులు తీసుకున్నారు. అఖిలప్రియ భార్గవరామ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. అతనికి కూడా ఇది రెండో వివాహమే. ఓ పోలీస్ ఆఫీసర్ కుమార్తెను పెళ్లి చేసుకుని డైవోర్స్ ఇచ్చారు భార్గవ రామ్. ఆ తర్వాతే అఖిలప్రియతో భార్గవ్‌రామ్ పెళ్లి అయింది. ఈ కిడ్నాప్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత భార్గవ్‌రామ్ గత సంబంధాలు.. ముందు జీవితం ఇప్పుడు వెంటాడుతోందా? FIRలో కొత్త పేర్లు చేరడానికి.. భార్గవ్ గత జీవితానికి ఏదైనా సంబంధం ఉందా?
కేవలం ఒత్తిళ్లేనా.. ఇంకేమైనా ఉన్నాయా?
హాఫీజ్‌పేట ల్యాండ్ వివాదం ఎప్పటి నుంచో ఉంది. ఈ గొడవ కారణంగా వెలుగులోకి వచ్చిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఒక మాజీ మంత్రి అరెస్ట్ కావడం.. బాధితులు తెలంగాణ సీఎంకు బంధువుల కావడంతో సంచలనంగా మారింది. ఇలాంటి కేసుల్లో పోలీసులపై ఒత్తిళ్లు ఉంటాయి. అయితే అవి రాజకీయ ఒత్తిళ్లా.. లేక ఇంకేమైనా ఉన్నాయా అన్నదానిపై లోతైన చర్చే జరుగుతోందట. ఈ సందర్భంగానే అఖిలప్రియ రాజకీయ, వ్యక్తిగత జీవితం.. భార్గవ్ రామ్ గత సంబంధాలను కొందరు టచ్ చేస్తున్నారు.
కొత్త విషయాలు.. సరికొత్త చర్చ!
ఈ కేసులో మొదట్లో A1గా ఉన్న AV సుబ్బారెడ్డి తర్వాత A2 అయ్యారు. ఆయనకు నోటీసు ఇచ్చినా ఇంకా అరెస్ట్ చేయలేదు పోలీసులు. అరెస్ట్ చేస్తారో లేదో దర్యాప్తు అధికారులకే తెలియాలి. A3గా ఉన్న భార్గవ్‌రామ్ చిక్కితే కేసు మరో మలుపు తీసుకోవడం ఖాయం. అయితే ఈలోగా FIRలో వచ్చి చేరుతున్న పేర్లు... దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయని పోలీసులు చెబుతున్న అంశాలే ఉత్కంఠ కలిగిస్తున్నాయి.. చర్చకు కారణం అవుతున్నాయి. ఈ ఒత్తిళ్లే నిజమైతే కేసు కొలిక్కి వస్తుందా? కొన్నాళ్ల తర్వాత కంచికి చేరుతుందో చూడాలి.