తిలకరత్నే దిల్షాన్ (146 బంతుల్లో 161 నాటౌట్; 22 ఫోర్లు), సంగక్కర (76 బంతుల్లో 105 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.
బంగ్లాదేశ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ సంగక్కర, దిల్షాన్ శతకాల మోత మోగించడంతో ప్రపంచకప్‌లో గురువారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 92 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.
ఎంసీజీలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో వికెట్ నష్టానికి 332 పరుగులు చేసింది. ఇక బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. శబ్బీర్ రెహమాన్ (62 బంతుల్లో 53; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షకీబ్ (59 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫీకర్ రహీమ్ (39 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) మోస్తరుగా ఆడారు.
లంక పేసర్ల ధాటికి ఓపెనర్లతో పాటు టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. దీంతో బంగ్లా 100 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. అయితే ముష్ఫీకర్... షకీబ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 64; శబ్బీర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 44 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మలింగ 3, లక్మల్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దిల్షాన్ చెరో రెండు వికెట్లు తీశారు.