Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త లక్షణాలతో పెరుగుతున్న కరోనా తీవ్రత, ఈ జాగ్రత్తలు తప్పకుండా తెెలుసుకోవాల్సినవి

Webdunia
శనివారం, 15 మే 2021 (10:55 IST)
కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రెండో విడతలో ఎక్కువగా యువతపైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకినా మిగతా కుటుంబ సభ్యులందరికీ సులభంగా వ్యాపిస్తోంది. పాజిటివ్ వచ్చిన వెంటనే ఆస్పత్రులకు పరుగులు తీసుకున్నారు. అయినా చాలా మందికి వైరస్ అంటే భయం, ఆందోళను పెరిగిపోతున్నాయి. దీనికితోడు సామాజిక మాధ్యమాలలో వస్తున్న కరోనా సమాచారంతో మరింత భయాందోళనలు, అపోహలు పెరిగిపోతున్నాయి.

ముఖ్యంగా ఎలాంటి మాస్కులు ధరించాలి? టీకా తీసుకున్నప్పటికీ కరోనా వస్తుందా? కరోనా వచ్చినవారు హోం ఐసోలేషన్ లో ఉండాలా? ఆస్పత్రిలో చేరాలా? ఇలా అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వైద్య నిపుణుల సూచనలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని తెలుసుకుని కరోనాపై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
ముఖ్యంగా కరోనా మొదటి దశ కంటే రెండో దశలో దాని తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటోంది. వైరస్ లక్షణాలు కూడా గతం కంటే భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేన్నీ నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రధాన లక్షణాలుంటే మాత్రం వెంటనే పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
 
కరోనా లక్షణాలు:
* దగ్గు తీవ్రమైతే..
* తీవ్ర జ్వరం
* పొడి దగ్గు
* గొంతు నొప్పి
* ముక్కు దిబ్బడ
* రుచి కోల్పోవడం
* వాసన గ్రహించలేక పోవడం
* ఆకలి లేకపోవడం
* తలనొప్పి, పట్టేసినట్లు ఉండటం
* ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* తీవ్రమైన నీరసం
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* కాళ్లు, చేతులు, నడుము గుంజటం
* కళ్లు ఎర్రబడటం, కలక
* నాలుక గులాబీ రంగులోకి మారటం
* కడుపు నొప్పి
* వాంతులు
* విరేచనాలు
* కడుపు, కాళ్లు ఉబ్బటం
* జీర్ణకోశ సమస్యలు
* మతి మరుపు
* నిద్ర పట్టకపోవడం
* రక్తంలో ఆక్సిజన్‌ తగ్గడం
* కఫంలో రక్త చారికలు
* ప్లేట్‌లెట్లు తగ్గడం
 
ఇంట్లో ఒకరికి వస్తే..
ఇంట్లో ఒకరికి కరోనా వస్తే మిగిలిన అందరికీ కరోనా పరీక్షలు చేయాల్సిందే. అందరికీ పాజిటివ్‌ వస్తే కలిసే ఉండొచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరికే లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి. హోం ఐసోలేషన్ లో ఉండడానికి అవసరమైన సదుపాయాలు అన్నీ ఇంట్లో ఉన్నట్టయితే ఆ ఒక్క వ్యక్తిని ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఐసోలేషన్ లో ఉంచాలి. కరోనా సోకిన వ్యక్తి మాస్క్‌ పెట్టుకొని బాత్‌రూం వినియోగించాలి. దానిని తర్వాత పూర్తిగా డెటాల్‌, శానిటైజర్లు, బాత్‌రూం క్లీనర్లతో శుభ్రంగా కడగాలి. పనిమీద బయటకు వెళ్లి ఇంటికి లోపలకు వచ్చే వారు సబ్బుతో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే శానిటైజర్లు వినియోగించాలి. ఆఫీసులు, కార్యాలయాల నుంచి వచ్చేవారు స్నానం చేశాకే ఇంట్లోకి రావాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇంట్లో ఉన్నట్టయితే వారిని ప్రత్యేకంగా ఉంచాలి. హాల్‌లో కూడా అందరూ భౌతిక దూరం పాటించాలి. ఒకరికి వైరస్‌ ఉన్నా ఇంట్లో మిగిలిన వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి.
 
వైరస్ ముప్పు
కరోనా సోకిన వ్యక్తి వాడే వస్తువులు ప్రత్యేకంగా ఉండాలి. డిస్పోజబుల్‌ పేట్లు, గ్లాసులు ఉపయోగించాలి. దుస్తులు ప్రత్యేకంగా వాడాలి. లక్షణాలు లేకపోయినా రెండు, మూడు వారాల వరకు వైరస్‌ ఉంటుంది. కాబట్టి కరోనా సోకిన వ్యక్తి బయట తిరగకూడదు. ఐసోలేషన్‌ రూంను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బట్టలు సబ్బు పెట్టి ఉతుక్కోవాలి. చేతులు తరచూ శానిటైజ్‌ చేసుకోవాలి. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి భోజనం అందించే వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ధారాళంగా గాలి, వెలుతురు గదిలోకి వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉండేలా చూసుకోవాలి. కొవిడ్‌ రోగి వాడిన పదార్థాల అవశేషాలను డిస్పోజబుల్‌ బ్యాగ్‌లో ఉంచి జాగ్రత్తగా మూటగట్టి చెత్త బుట్టలో వేయాలి.
 
రివర్స్‌ ఐసొలేషన్‌లో.... వృద్ధులకు వస్తే..
ఇంట్లో వృద్ధులు, తీవ్ర జబ్బులు ఉన్నవారు ఉంటే రివర్స్‌ ఐసొలేషన్‌లో ఉంచాలి. అంటే వారికి మిగతా వారే ఎడం పాటించాలి. ఒకవేళ వారు మన వద్దకు వచ్చినా.. మనం కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలి. అదికూడా 15 నిమిషాలకు మించి వారికి ఎదురుగా ఉండకూడదు.
 
* మన దగ్గర తప్పనిసరిగా ఉండాల్సినవి..*
మాస్క్‌లు, శానిటైజరు, జింకు, విటమిన్‌ సి, డి3, పారాసిట్మాల్‌, పల్స్‌ఆక్సిమీటర్‌, డిజిటల్‌ థర్మామీటర్‌ తప్పనిసరిగా ఉంచుకోవాలి. వైద్యుల సూచనలతోనే విటమిన్లు వాడాలి. సొంతంగా వేసుకుంటే ఇతర రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. హ్యాండ్‌ శానిటైజర్లు వాడేటప్పుడు గ్లౌజు అవసరం లేదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. బయట ఎవరికి కరోనా ఉందో తెలియదు. కొన్ని రోజుల వరకు పిల్లలను బయటకు వెళ్లి ఆడుకోకుండా కట్టడి చేయాలి.
 
అందరికీ ఆసుపత్రి అవసరం లేదు
కరోనా పాజిటివ్ వచ్చిన వారందరికీ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాదు. ఇదివరకే అనారోగ్యంగా ఉండి లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. పాజిటివ్ వచ్చినా ఇలాంటి ఇబ్బంది లేనట్టయితే ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెలీమెడిసిన్ వైద్య సేవలను వినయోగించుకుంటూ ఉండొచ్చు.
 
స్వీయ నియంత్రణ అవసరం
కరోనా రెండో దశలో వ్యాప్తి అధికంగా ఉన్నందువల్ల ప్రభుత్వాలు కర్ఫ్యూ విధించి కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12వరకు మాత్రమే నిత్యావసరాల కోసం సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా మరింత బాధ్యతగా ఉంటూ.. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి. అవసరం లేకుండా బయట తిరగకూడదు. అలా చేసినట్టయితే బయట ఉన్న కరోనాను మనం స్వయంగా ఇంట్లోకి ఆహ్వానించుకున్నట్టే అవుతుంది. చాలా మంది కరోనా పాజిటివ్ వచ్చినవారు ఇలాంటి ఇబ్బంది లేకపోయినా..  ఒకవేళ సీరియస్‌ అయితే తరువాత ఆస్పత్రిలో బెడ్‌ దొరకదనే ఉద్దేశంతో ముందే ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇది సరికాదు. రక్తంలో ఆక్సిజన్‌ 93 శాతానికి తగ్గి ఆయాసం ఉంటే... విపరీతమైన దగ్గు, తీవ్ర జ్వరం (102, 103 డిగ్రీలు) వారం కంటే ఎక్కువ ఉంటే ఆసుపత్రిలో చేరాలి.  
 
మనో ధైర్యమే రక్ష..
కరోనా వచ్చిన వారు వ్యాయామం చేస్తుంటారు. రోజూ 30 నిమిషాలు మెడిటేషన్‌, ఇతర బ్రీతింగ్‌ వ్యాయామాలు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, శారీరక శ్రమ చేయడం లాంటివి వద్దు. కరోనా వచ్చినవారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఎలాంటి శారీరక శ్రమ వద్దు. అధిక వ్యాయామం వల్ల ఆయాసం ఇతర సమస్యలు పెరిగి కోలుకోవటానికి సమయం పడుతుంది. ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు విశ్రాంతిలో ఉండాలి.
 
మానసిక ప్రశాంతత కోసం
కరోనా పేషెంట్లకు మానసిక ప్రశాంతత ముఖ్యం. ఎట్టి పరిస్థితిలోనూ ధైర్యం కోల్పోకూడదు. భయం, ఆందోళన, కుంగుబాటు వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తాయి. దీంతో శరీరంపై వైరస్‌ మరింత దాడి చేస్తుంది. కరోనా పాజిటివ్‌ వచ్చినా.. మన ఆలోచనలు పాజిటివ్‌గా ఉండాలి.
 
ఆ మాస్కులతో రక్షణ తక్కువే
మూడు లేయర్లు ఉన్న సర్జికల్‌ మాస్క్‌ పెట్టుకుంటే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. చాలామంది ఇంట్లో వస్త్రాలతో మాస్క్‌లు కుట్టుకొని వాటినే వాడుతున్నారు. దీంతో పూర్తి స్థాయి రక్షణ ఉండదు. కానీ కొంతలో కొంత నయం. ఈ మాస్క్‌ పెట్టుకున్న వారిలో 35-45 శాతం మందిలో కరోనా సోకే ప్రమాదం ఉంది. అలా అని అందరూ ఎన్‌-95 మాస్క్‌ పెట్టుకోవాల్సి అవసరం కూడా లేదు. ఐసీయూలు, కొవిడ్‌ వార్డులో తిరిగే వైద్యులు, వైద్య సిబ్బందికే వీటి అవసరం ఉంటుంది. సర్జికల్‌ మాస్క్‌ పెట్టుకొని దానిపై వస్త్రంతో తయారైన మాస్క్‌ పెట్టుకుంటే పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుంది.
 
నిస్సత్తువ తగ్గాలంటే.. విటమిన్-సి ముఖ్యం
ఈ పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే సమతుల్య ఆహారం అవసరం. ముఖ్యంగా విటమిన్‌ సి, విటమిన్-బి12, విటమిన్-డి చాలా కీలకం. నిమ్మ, దానిమ్మ, కమలాలు తదితర పండ్ల ద్వారా సి విటమిన్‌ పుష్కలంగా అందుతుంది. మాంసకృత్తుల కోసం వారంలో రెండుసార్లు చికెన్‌, నిత్యం ఒక గుడ్డు తీసుకోవాలి. సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, చిరు ధాన్యాలు మన ఆహారంలో భాగం కావాలి. కరోనా సోకిన వారిలో మొదటి వారం రోజులపాటు నిస్సత్తువ ఉంటుంది. జ్వరం ఉంటే మాంసకృత్తులు జీర్ణం కావు. కాబట్టి ఆకలి వేసే వరకు రాగి, జొన్న, బియ్యంతో చేసిన జావలు, సలాడ్లు, సూప్‌లు, డ్రైఫూట్స్‌ ఇతర తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వీటివల్ల నిస్సత్తువ తగ్గుతుంది. డీహైడ్రేషన్‌ ప్రమాదం కూడా తప్పుతుంది. ఆకలి పెరిగిన తర్వాత అన్ని రకాల ఆహారాన్ని తీసుకోవచ్చు. ఫలితంగా తొందరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.
 
విచ్చలవిడిగా విటమిన్లు వద్దు
కరోనా రాకుండా విటమిన్లు, ఇతర పోషకాల కోసం చాలామంది మాత్రలు మింగుతుంటారు. వైద్యుల సూచనల మేరకు వాటిని తీసుకోవాలి. అవసరం లేకుండా విచ్చలవిడిగా విటమిన్‌ మాత్రలు వాడితే ఇతర అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.
 
గోరు వెచ్చని నీరు తాగాలి
గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల గొంతులో సమస్య ఉంటే పోతుంది. తల బరువుతోపాటు జలుబు లాంటివి ఉంటే రోజుకు కనీసం రెండుసార్లు ఆవిరి పట్టుకోవాలి. మరీ ఎక్కువ వేడి చేసిన నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. ఎక్కువ వేడి చేసిన నీటిని తాగితే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
 
మాస్కు తప్పనిసరి
వైరస్‌ సోకిందన్న అనుమానం వచ్చిన వెంటనే ఇల్లు, కార్యాలయాల్లో ఇతరులకు దూరంగా ఉండాలి. హోం ఐసొలేషన్‌లో ఉంటూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తొలుత ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్ష చేసుకుని పాజిటివ్ అని తేలితే.. అందులో అనుమానం కూడా అనుమాన ఉంటే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ యాంటిజెన్ పరీక్ష చేసుకునే సమయంలోనే వైరస్ లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే వెంటనే అప్రమత్తమవ్వాలి. ఐసోలేషన్ లోకి వెళ్లాలి. 
 
ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినట్టయితే  
రక్తంలో ఆక్సిజన్‌ కనీసం 94 శాతం ఉండాలి. అంతకంటే తగ్గిందంటే అప్రమత్తం అవ్వాలి. అలా అని మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యుల సూచనలతో ముందుకు వెళ్లాలి. ఆక్సిజన్‌తో పాటు ఇతర మందులు అందిస్తే తిరిగి కోలుకుంటారు. ఆక్సిజన్‌ 80 శాతానికి వచ్చినా.. చికిత్స తీసుకొని ఎంతోమంది ప్రాణాపాయం నుంచి బయట పడుతున్నారు. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. 
 
వ్యాక్సిన్‌ వేయించుకున్నా వస్తుందా?
కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నంతమాత్రాన మళ్లీ కరోనా రాదన్న గ్యారెంటీ లేదు. టీకా ద్వారా వంద శాతం రక్షణ లభించదు. వ్యాక్సిన్‌ తీసుకున్నా చాలామందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ రెండో డోసు పూర్తయినా కరోనా వచ్చినవారు ఉన్నారు. అయితే టీకా తీసుకున్న వారిలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు తప్ప మిగతావారు పెద్దగా ఇబ్బందులకు గురికారు. స్వల్ప లక్షణాలతో కరోనా తగ్గిపోతుంది. వ్యాక్సిన్‌ తీసుకున్నా సరే మాస్క్‌లు విధిగా ధరించాలి. ఇతర అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడే యువత నిర్లక్ష్యంగా ఉంటోంది. ప్రస్తుతం వారికి ఎక్కువగా కరోనా సోకుతోంది. ముఖ్యంగా 22-45 సంవత్సరాల మధ్య వయస్కులు చాలామంది కరోనా బారిన పడుతున్నారు. కొందరు వెంటిలేటర్‌ వరకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. కాబట్టి పెద్దలతోపాటు యువత కూడా జాగ్రత్తగా ఉండాలి. 
 
టీకా ఇచ్చాక పెయిన్‌ కిల్లర్‌ వద్దు
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి వెంటనే టెస్ట్ చేయించడం వల్ల వ్యాక్సిన్‌ వల్ల కరోనా పాజిటివ్‌ వస్తుందన్నది అపోహ మాత్రమే. టీకా తీసుకునే ముందే కొందరిలో కరోనా ఇన్‌ఫెక్షన్‌ ఉండొచ్చు. అయితే లక్షణాలు కనిపించడానికి అయిదు రోజుల నుంచి 14 రోజులు పడుతుంది. అప్పటికే ఇన్‌ఫెక్షన్‌ ఉంటే వ్యాధి బయట పడుతుంది. వ్యాక్సిన్‌తో దీనికి సంబంధం లేదు.

టీకా తీసుకునే సమయంలో భౌతిక దూరం పాటించక పోవడం, మాస్క్‌లు ధరించక పోవడం వల్ల వైరస్‌ సోకి పాజిటివ్‌ రావొచ్చు. టీకా వల్ల పాజిటివ్‌ వస్తుందనే భావనలో శాస్త్రీయత లేదు. వ్యాక్సిన్‌ తీసుకున్నా ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. అయితే ఎక్కువ సీరియస్‌ కాదు. మరణం వరకు వెళ్లడమన్నది చాలా తక్కువ. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత వచ్చే ఒళ్లునొప్పులకు పారాసిట్మాల్‌ వాడాలి. ఎట్టి పరిస్థితిలోనూ పెయిన్‌ కిల్లర్స్‌ వాడకూడదు. మధురైలో ఓ డాక్టర్‌ ఇలా వాడి రెండు గంటల్లో మృతి చెందారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనాను అరికట్టవచ్చు. 
 
నో స్మోకింగ్, డ్రింకింగ్
ధూమపానం, ఆల్కహాల్‌ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తాయి. అందువల్ల టీకా తీసుకునే వారు వీటికి దూరంగా ఉండాలి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఇలాంటి వారు టీకా తీసుకున్నప్పటికీ శరీరంలో రక్షణ కొంత తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి టీకా వేసుకునేందుకు మూడు రోజుల ముందు, టీకా వేసుకున్న తరువాత వారం వరకు మద్యం తీసుకోవద్దు. అన్ని రకాల ఆహారం తీసుకోవచ్చు. మధుమేహం, బీపీ ఉన్నవాళ్లు మందులు ఆపాల్సిన అవసరం లేదు. అయితే వాల్వ్‌ రీప్లేస్‌మెంటు అయిన వారిలో వాడే బ్లడ్‌ థిన్నర్ల విషయంలో మాత్రం సంబంధిత కార్డియాలజిస్టును సంప్రదించాలి.
 
కరోనా వచ్చిన వారు ఎన్ని రోజుల్లో టీకా తీసుకోవచ్చు?
కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నెలలకు టీకా తీసుకోవాలి. కరోనా సోకి తగ్గిన రోగుల్లో యాంటీబాడీలు పెరిగి ఉంటాయి. ఇవి వ్యక్తుల శరీరతత్వాన్ని బట్టి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉండొచ్చు. కాబట్టి ఆ తరువాతనే టీకా తీసుకోవచ్చు.
 
శానిటైజ్ చేసుకుంటూనే ఉండాలి
కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి వ్యక్తిని పాజిటివ్‌గానే అనుమానించాలి. కనీసం రెండు మూడడుగుల దూరం పాటించాలి. చేతులు కడుక్కోవటం, శానిటైజ్‌ చేసుకోవడం, టీకా తీసుకోవడం అత్యవసరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments