గత కొంతకాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్... ఇపుడు మార్షల్ ఐలాండ్స్‌లో అడుగుపెట్టింది. ఈ దీవుల్లో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. ఖ్వజాలిన్ అటోల్ ప్రాంతంలోని యూఎస్ మిలటరీ బేస్‌లో ఇద్దరికి ఈ వైరస్ సంక్రమించింది. ఈ నెల 27న వీరిద్దరూ హవాయి ప్రాంతం నుంచి ఒకే విమానంలో వచ్చినట్టు గుర్తించారు.
అయితే, వీరి ద్వారా ఇతరులకు ఈ వైరస్ సంక్రమించలేదని స్పష్టం చేసిన అధికారులు వైరస్ కట్టడికి కొత్త నిబంధనలు అమలు చేయబోవడం లేదన్నారు. కాగా, చిన్న దేశాలైన సమోవా, టోంగా, నౌరు వంటి దీవులు అత్యంత అప్రమత్తంగా ఉండడంతో ఇప్పటివరకు ఆ దీవులను వైరస్ తాకలేకపోయింది.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1531 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,048 మంది కోలుకున్నారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,37,187కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,17,401 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,330 కి చేరింది. ప్రస్తుతం 18,456 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
వీరిలో 15,425 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 114 కేసులు నిర్ధారణ అయ్యాయి.