తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ లీడ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏమీ చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని.
తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో నందమూరి హరికృష్ణ ఫ్యామిలీతో.. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో ఎంతో సన్నిహితంగా మెలిగిన కొడాలి నాని.. ఆ తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మంత్రి పదవిని దక్కించుకున్నారు. టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చే కొడాలి నాని.. తాజాగా ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇక, టీడీపీకి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందన్న కొడాలి నాని.. ఇప్పుడు ఎవ్వరూ వచ్చినా టీడీపీని కాపాడే శక్తి లేదని, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కష్టమేనని.. ఎందుకంటే.. తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది... ఏపీలో సరైన పోటీ ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. తాను వైఎస్సార్‌సీపీలో చేరాక ప్రతిపక్షంలో కొనసాగామని.. తర్వాత పార్టీలో జగన్ తనకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు.
అంతేకాదు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారని.. తాను జీవితాంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే నడుస్తానని చెప్పారు. సీఎం కూడా అడిగిన వెంటనే గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించారన్నారు.