Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి: రుయా ఆస్పత్రి ఘటనలో అప్పుడు 11 మంది చనిపోయారని చెప్పి, ఇప్పుడు 23మందికి ప్రభుత్వం ఎందుకు పరిహారం ఇస్తోంది?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (18:56 IST)
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో లోపం వల్ల ఒకేసారి పెద్ద సంఖ్యలో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మే 10న జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. 20 మందికి పైగా మరణించారని అప్పట్లో ప్రతిపక్షాలు, పలు సంస్థలు ఆరోపించాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్య తప్పని చెబుతూ వచ్చింది. 11 మంది మరణించారని, సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్ రాకపోవడంతో నిల్వలు తగ్గి తగినంత ప్రెజర్‌తో ఆక్సిజన్ సరఫరా కాకపోవడమే ఘటనకు కారణమని తేల్చింది.

 
ఇది జరిగిన 15 రోజుల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం 23 మంది మృతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు నిధులు విడుదల చేసింది. దాంతో అప్పట్లో 11 మంది అంటూ అధికారిక ప్రకటన చేసి, ప్రస్తుతం 23 కుటుంబాలకు పరిహారం అందించేందుకు ముందుకు రావడం వెనుక కారణాలను పలువురు విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టిందని ఆరోపిస్తున్నారు. అయితే ఆక్సిజన్ కొరత కారణంగా ఆ తర్వాత మరణించిన వారికి కూడా పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రుయా అధికారులు చెబుతున్నారు.

 
ఆ రోజు ఏం జరిగింది?
తిరుపతిలోని రుయా (ఎస్వీఆర్ఆర్) జనరల్ ఆస్పత్రిని జిల్లా స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా నిర్ణయించి పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధితులకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి కూడా వచ్చిన రోగులతో ఆస్పత్రి బెడ్స్ అన్నీ నిండిపోయాయి. ఆ సమయంలో మే 10న ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆస్పత్రి ఆవరణలో 11వేల లీటర్ల ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. కానీ అందులో నిల్వలు తగ్గిపోవడంతో సరఫరాలో సమస్య వచ్చినట్టుగా అధికారులు నిర్ధరించారు. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సకాలంలో చేరుకోకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైనట్లుగా ప్రకటించారు.

 
ఒక్కసారిగా ఆక్సిజన్ సరఫరాలో ఏర్పడిన సమస్య మూలంగా రోగులు విలవిల్లాడిపోయారు. ఆసుపత్రిలో బెడ్స్ మీద ఉన్న వారిలో కొందరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడారు. రాత్రి 7 గంటల సమయంలో మొదలై అరగంట పాటు ఈ సమస్య కొనసాగగా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని ప్రచారం జరిగింది.

 
అప్పట్లో ప్రభుత్వం ఏం చెప్పింది..?
ఈ ఘటన తర్వాత రోగుల బంధువులు కొందరు ఆందోళనకు దిగారు. కొందరు సిబ్బందిపై దాడికి కూడా యత్నించడంతో పోలీసులు అదుపు చేశారు. ఈ ఘటనపై అదే రోజు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారిక ప్రకటన చేశారు. ‘‘సుమారు 5 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. ఆ సమయంలో 700 మంది ఆక్సిజన్‌పై ఆధారపడి చికిత్స పొందుతున్నారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రావడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ప్రభుత్వానికి నివేదించాం’’అని ఆయన తెలిపారు.

 
ప్రభుత్వ ప్రకటనపై మానవ హక్కుల సంఘానికి మాజీ మంత్రి
కరోనా బాధితుల పరిరక్షణలో ఏపీ ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘించిందంటూ తిరుపతికి చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ఆయన ప్రకటించారు. మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తోందంటూ ఆయన ఆరోపించారు. బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి కూడా గవర్నర్‌కి లేఖ రాయడంతో పాటు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు.
 
 
ప్రభుత్వ నిర్ణయంలో అనూహ్య మార్పు
మే 11న మృతుల సంఖ్య 11 మంది అని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో అదే సంఖ్యను చెబుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం 23 మంది కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. నిధులు కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఆరుగురికి సహాయం అందించినట్టు అధికారులు వెల్లడించారు. తొలుత సంఖ్య తక్కువగా చెప్పి, తీరా పరిహారం విషయంలో ఎక్కువ మందికి అందించడానికి కారణాలపై బీబీసీ రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ని సంప్రదించింది.

 
‘‘ప్రభుత్వం అడిగిన వివరాలను అక్కడి డ్యూటీ డాక్టర్లు ఇచ్చినట్లుగానే నేను ప్రభుత్వానికి అందించాను. ఆక్సిజన్ అందకపోవడంతో పాటూ దాని తరువాత కూడా ఆ ప్రభావం వల్ల చనిపోయిన వారి జాబితా ప్రభుత్వానికి అందించాం’’ అన్నారు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి. ప్రభుత్వానికి ముందుగా 11 మందితో జాబితా అందించిన రుయా ఆసుపత్రి, ఆ తరువాత మరో 12 మంది పేర్లు అందించింది. ‘‘మొదటి 11 మంది ఆ సమయంలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారు కాగా, మిగిలిన 12 మంది ఆ ప్రభావంతో కాసేపటి తరువాత చనిపోయినవారు’’ అన్నారు వైద్యాధికారులు.

 
వీరంతా 23వ తేదీ రాత్రే చనిపోయారని.. 11 మంది ఆక్సిజన్ అందక తక్షణం చనిపోయారని, మిగిలిన 12 మంది కాసేపటి తరువాత చనిపోయినట్టు ఆసుపత్రి వర్గాలు బీబీసీతో చెప్పాయి. దీంతో ఘటన జరిగిన రోజు రాత్రే 23 మంది చనిపోయినట్టు స్పష్టం అవుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా 23 మంది అని అంగీకరించలేదు.

 
‘‘ఆ ఘటన జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నాను. అధికారులతో కూడా మాట్లాడాను. 25 మంది పైనే మరణించారు. మా నాన్నగారు కూడా అప్పుడే మరణించారు. ఆక్సిజన్ లేకపోవడం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేదు’’ అని బీబీసీతో చెప్పారు చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందిన తిరుమలేశ్. ఆయన తండ్రి డెత్ సర్టిఫికేట్‌లో రాత్రి 8 గంటల ప్రాంతంలో చనిపోయినట్టుగా ఉంది.

 
ఇది మరో ఆధారం: బీజేపీ
‘‘శ్రీపెరుంబుదూరు నుంచి 12 గంటలకు బయల్దేరాల్సిన ఆక్సిజన్ 4.30 గంటలకు బయల్దేరింది. వారు గ్రీన్ చానెల్లో ఆక్సిజన్ తెప్పిస్తే ఆ ఘటన జరిగేది కాదు. కలెక్టర్ కూడా 5 నిమిషాల ఆలస్యం వల్లే ఇది జరిగింది అన్నారు. ఆ రోజు చాలా మంది చనిపోయారు. నేను అక్కడ స్పాట్‌కి వెళ్లాను. చాలా మంది చనిపోయారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా సంఖ్య తగ్గించి చెప్పారు అధికారులు. మొదట్లో 11 మంది అన్న వారు కాస్త తరువాత మీడియాకు కూడా చెప్పకుండా ఒక ఉత్తర్వు ఇచ్చారు. అందులో మరో 12 మందికి సాయం చేస్తున్నట్టు ఉంది.

 
మరికొందరి మరణ సమయం రికార్డులలో మార్చారు. ఇంకొందరి పేర్లు నమోదు చేయలేదు. నాకు చాలామంది ఫోన్ చేసి తమ వారి పేరు లేదు అని అంటున్నారు. మేం కోరేది ఒకటే, ఆ రోజు ఐసీయూలో చనిపోయిన అందరికీ పరిహారం ఇవ్వాలి. అరగంటా, ముప్పావుగంటా కాదు.. ఎందుకంటే, ఆక్సిజన్ పెట్టాక కూడా ఆ ప్రభావంతో కొందరు చనిపోయారు. ఈ నెల 30 లోపు వారికి న్యాయం చేయకపోతే, మేం బీజేపీ తరఫున ఆందోళన చేస్తాం’’ అని అన్నారు బీజేపీ నాయకులు భానుప్రకాశ్ రెడ్డి.

 
ప్రభుత్వం వాస్తవాలు దాచిపెట్టింది: చింతామోహన్
ఈ ఘటనలో ప్రభుత్వం తీరు సక్రమంగా లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో వైఫల్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కానీ ట్యాంకర్ రావడం కొంత ఆలస్యమైందని, ఇతర కారణాలు చూపించి ఘటనను చిన్నది చేసేందుకు ప్రయత్నించారు. మృతుల విషయంలో కూడా వాస్తవాలు దాచిపెట్టారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి చేసిన ఫిర్యాదు విషయంలో విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి.

 
అప్పుడు 11 మంది అని అధికారికంగా చెప్పిన తర్వాత, ఇప్పుడు 23 మంది అని ఎలా నిర్ధరించారు. ఇదంతా ప్రభుత్వం నిజాలు దాచిపెడుతుందనే అభిప్రాయానికి రావడానికి దోహదపడుతుంది. ఇంకా కొందరు తమ వారి పేర్లు బాధితుల జాబితాలో లేవని చెబుతున్నారు. అంటే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. కాబట్టి అందరికీ న్యాయం జరగాలి’’ అన్నారాయన.

 
ముఖ్యమంత్రి వైఫల్యమే ఇది: టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైద్యం విషయంలో ప్రభుత్వ లెక్కలకు, వాస్తవానికి పొంతన లేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. కరోనా కేసులు, టెస్టులు, మృతులు, ఆసుపత్రి బెడ్స్ ఇలా ఏ విషయంలోనూ నిజాలు చెప్పడం లేదు. టీడీపీ నేతలు ప్రభుత్వాసుపత్రి పరిశీలనుకు వెళితే అడ్డుకున్నారు. చివరకు రుయా ఆస్పత్రిలో మృతుల సంఖ్యలో దోబూచులాట దారుణం. ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి. అనంతపురం, తిరుపతి సహా అనేక చోట్ల ఆక్సిజన్ సరఫరాలో సమస్యలు పదుల సంఖ్యలో రోగుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. అయినా ప్రభుత్వం నిజాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. వైఫల్యాన్ని దాచిపెట్టి , జనాలకు అర్ధ సత్యాలను చెబుతున్న ప్రభుత్వ తీరు సిగ్గుచేటు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

 
బాధితులకు పరిహారం ఇస్తే తప్పేంటి: నారాయణ స్వామి
రుయా ఘటనలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన బాధితులందరికీ న్యాయం చేయాలని ప్రయత్నించడం నేరమా అని ప్రశ్నించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ఆయన బీబీసీతో మాట్లాడుతూ తిరుపతి ఘటన బాధాకరం. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయ్యింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంది. రాష్ట్రమంతా కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఆరోజు జరిగిన ఘటనలో మృతుల సంఖ్య గురించి అధికారుల నుంచి నివేదిక వచ్చింది. ఆక్సిజన్ ఆగిన సమయంలో ప్రభావితులయిన కొందరు ఆ తర్వాత మరణించినట్టు తెలిపారు. దాంతో అందరినీ ఆదుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందుకే ఎక్కువ మందికి పరిహారం అందిస్తున్నాం. దానిని కూడా తప్పుబట్టడం విచిత్రం అని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments