Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ హోస్టెస్‌: 'సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్‌షిప్ చేస్తావా అంటారు'

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (16:05 IST)
సరికొత్త రైలు తలుపుల దగ్గర ఆత్మవిశ్వాసం తొణికిసలాడేలా నిలబడ్డ ఈ యువతులు చేతులు జోడించి ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నారు. ప్రయాణికులు ఉత్సాహంగా సెల్ఫీ తీసుకోడానికి, ఫొటోలు తీసుకోడానికి వాళ్లను చుట్టుముడతారు. వాళ్ల అనుమతి తీసుకోకుండానే మొబైల్ కెమెరాను క్లిక్ చేస్తారు. ఆమె మాత్రం లోలోపలే కుంగిపోతుంది. కుంచించుకుపోతుంది.

 
తాము కోరుకోని ఆ ఆకర్షణ ఇబ్బందిగా అనిపిస్తున్నా, ఆమె ముఖంపై ఆ చిరునవ్వు చెక్కుచెదరకుండా ఉంటుంది. న్యూ దిల్లీ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం 9 దగ్గర ఈ దృశ్యం కనిపించింది. అక్కడ తేజస్ ఎక్స్‌ప్రెస్ లక్నో బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. నలుపు, పసుపు రంగులతో ఒంటికి అతుక్కుపోయినట్టున్న దుస్తులు ధరించి నిలబడిన ఈ యువతులు భారత మొదటి ప్రైవేట్ రైల్లో హోస్టెస్‌లు. ఇటీవల ప్రారంభమైన తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను భారత రైల్వేకే చెందిన ప్రైవేటు కంపెనీ ఐఆర్‌సీటీసీ నడుపుతోంది.

 
విమానంలో సేవల్లాగే
ఈ రైలు సేవలను భారత్‌లో మొదటి ప్రైవేట్ లేదా కార్పొరేట్ సేవలు అని కూడా చెప్పుకుంటున్నారు. ఐఆర్‌సీటీసీ తేజస్‌ను రైల్వే నుంచి లీజుకు తీసుకుంది. దీనిని కమర్షియల్‌గా నడుపుతోంది. ఐఆర్‌సీటీసీ అధికారులు దీనిని ప్రైవేటుకు బదులు కార్పొరేట్ ట్రైన్ అంటారు. వేగంగా వెళ్లే ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మధ్య 511 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఇది ఆరున్నర గంటల్లో పూర్తి చేస్తుంది.

 
చెప్పాలంటే ఈ ట్రైన్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ దీనిలో అన్నిటికంటే ప్రత్యేకం ట్రెయిన్ హోస్టెస్ ఉండడం. విమానాల్లో లాగే హోస్టెస్‌లను రైల్లో నియమించడం భారత్‌లో ఇదే మొదటిసారి. అందుకే ప్రయాణికుల్లో వారంటే కుతూహలం, ఆకర్షణ కనిపిస్తోంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు తినడానికి-తాగడానికి ఏవైనా ఇవ్వడం, ఇతర అవసరాలు చూడడం, వారి సౌలభ్యం, భద్రత చూసుకోవడం వారి పని.
 
యువతుల్లో ఉప్పొంగే ఉత్సాహం
లక్నో యువతి శ్వేతా సింగ్ తన ఈ కొత్త ఉద్యోగంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు. "నాకు దేశంలోని మొదటి ప్రైవేట్ ట్రైన్‌ తేజస్‌లో పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. మేం రైలులో హోస్టెస్ అయిన భారత్‌లోని మొదటి మహిళలం. నా కల నిజమైనట్టు అనిపిస్తోంది" అని ఆమె చిరునవ్వుతో చెప్పారు.

 
"మేం ప్రతిరోజూ కొత్త యాత్రికులను కలుస్తుంటాం. మాట్లాడుతుంటాం. అది చాలా బాగుంటుంది. రకరకాల మనుషులు కలుస్తుంటారు. వారికి సంతృప్తికరమైన సేవలు అందించడం మాకు అతిపెద్ద సవాలు" అన్నారు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌ 10 బోగీల్లో శ్వేత లాంటి 20 మంది కోచ్ క్రూ ఉంటారు. వీరందరూ లక్నోలోని ఒక ఏవియేషన్ హాస్పిటాలిటీ, క్లస్టర్ సర్వీస్‌లో డిప్లొమా చేశారు. వీరంతా ఐఆర్‌సీటీసీ ఉద్యోగులు కారు. కానీ మరో ప్రైవేటు కంపెనీ ద్వారా ఈ రైల్లో వీరి సేవలు వినియోగించుకుంటున్నారు.
 
 
మూడు రౌండ్ల ఎంపిక ప్రక్రియ
"మూడు రౌండ్ల ఎంపిక ప్రక్రియ తర్వాత మాకు ఈ ఉద్యోగం ఇచ్చారు. నేను తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నందుకు మా అమ్మనాన్నలు కూడా సంతోషించారు" అని శ్వేత చెప్పారు. ఉన్నావ్‌ ప్రాంతానికి చెందిన వైశాలి జైశ్వాల్ రైల్లో సర్వీస్ ట్రాలీ సర్దుతున్నారు. ఆమె కూడా శ్వేతలాగే ఎయిర్ హోస్టెస్ కావడానికి శిక్షణ తీసుకున్నారు. ఆమె తన పనిని పూర్తిగా ఎయిర్ హోస్టెస్‌ పనిలాగే భావిస్తారు.

 
"విమానంలో క్యాబిన్ క్రూ ఏం చేస్తారో మేం, కూడా అదే చేస్తున్నాం. ఎయిర్ హోస్టెస్ ఆకాశంలో పనిచేస్తుంది. మేం పట్టాలపై చేస్తాం, అంతే తేడా" అంటారు వైశాలి. "మేం ఒక నడుస్తున్న రైల్లో ఉన్నాం. ఇక్కడ కొన్నిసార్లు పరిస్థితులు సవాలుగా మారవచ్చు. వాటిని ఎదుర్కొనేలా మాకు శిక్షణ ఇచ్చారు" అన్నారు.
ఒక్కో పాఠం నేర్చుకుంటున్నాం
వేగంగా దూసుకెళ్తూ, ఊగిపోతున్న రైల్లో సర్వీస్ ట్రాలీని పట్టుకుని నిలబడ్డ అంశికా గుప్తా ఆత్మ విశ్వాసంతో కనిపించారు. ఇప్పటివరకూ భారత రైల్వేలో ఇలాంటి పనులు పురుషులు చేసేవారు.

 
"మేం ఇప్పుడే నేర్చుకుంటున్నాం. మాలాంటి యువతులను రైలు సేవల్లోకి తీసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. దీన్లో మేం నేర్చుకునే పాఠాలు ముందు ముందు ఉపయోగపడతాయి" అని అంశిక అన్నారు. ఈ రైలు క్రూ మెంబర్లలో ఎక్కువ మంది 20 ఏళ్లకు దగ్గరగా ఉంటారు. వీరంతా మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చారు. రైల్వేల ప్రైవేటీకరణ ప్రయోగం వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించింది. "ఏదో ఒక ఉద్యోగం చేస్తాలే, అని నేను మా అమ్మతో ఎప్పుడూ చెప్పేదాన్ని. ఇప్పుడు నేను ఇక్కడ పనిచేయడం చాలా సంతోషంగా ఉంది" అని అంశిక చెప్పారు.

 
మహిళా సాధికారత
మహిళా సాధికారత బ్యాడ్జ్ పెట్టుకున్న ఈ యువతులు సంప్రదాయంగా వెనకబడినవారుగా భావించే దేశంలోని సగం జనాభాకు కొత్త స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కోచ్ క్రూ బాధ్యతలు నిర్వహిస్తున్న సంధ్యా సింగ్ యాదవ్ లక్నోలో ఉంటారు. ఆమె తండ్రి ఆటో నడుపుతారు. సంధ్య ఇక్కడి వరకూ చేరడం అంత సులభంగా జరగలేదు.

 
"మా నాన్న నాకు చాలా సహకరించారు. నేను ఏది కోరుకుంటే అది చేయనిచ్చారు. కానీ అందరూ ఆయన్ని చాలా మాటలన్నారు. నేను హోస్టెస్ అవుతానని ఇంట్లో చెప్పినపుడు, చాలా మంది నాన్నతో అది అమ్మాయిలు చేసే పని కాదు, నీ కూతురికి ఏదైనా మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం శిక్షణ ఇప్పించు" అన్నారని సంధ్య చెప్పారు.
బంధువులు చాలా అన్నారు
సుంబుల్ ఫాతిమా కథ కూడా అలాంటిదే. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు. హోస్టెస్ అవడానికి ఆమె ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. కానీ బంధువులు మాత్రం ఏదేదో అనేవారు. "ఇప్పుడు అమ్మాయిలు ఎవరికీ తక్కువ కాదు. వాళ్లు అన్ని బాధ్యతలూ నిర్వహించగలరు. నేను ఎవరి మాటలూ పట్టించుకోలేదు. నేను చేస్తున్న పని సరైనదే అని నాకు తెలుసు" అన్నారు సుంబుల్.

 
శుభాంగీ శ్రీవాస్తవ్ తేజస్‌లో నియమించిన కోచ్ క్రూ మేనేజర్‌గా ఉన్నారు. ఆమెతోపాటు ఇద్దరు కెప్టెన్లు, ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు. ట్రైన్‌లో ఏర్పాట్లు, మొత్తం టీమ్‌ను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే. "ప్రస్తుతం తేజస్‌లో మగ స్టాఫ్ కూడా ఉన్నారు. కానీ ముందు ముందు ఈ రైలును పూర్తిగా మహిళా సిబ్బంది చేతికి అందించాలని అనుకుంటున్నారు" అని శుభాంగి చెప్పారు.

 
మహిళలకు అందుబాటులో
మహిళలకు ఈ రైలు ప్రయాణం సౌకర్యంగా ఉండేందుకే తన టీంలో అంత మంది మహిళలు ఉన్నారని శుభాంగి చెప్పారు. "రైల్లో మహిళా క్రూ మెంబర్స్ ఉండడం వల్ల మహిళా ప్రయాణికులకు ఒక విశ్వాసం వస్తుంది. ఒంటరిగా ప్రయాణించే మహిళలు, మేం ఉండడంతో చాలా సురక్షితంగా ఉన్నట్టు భావిస్తున్నారు" అన్నారు.
ఈ రైల్లో శానిటరీ నాప్‌కిన్లు, మహిళలకు అవసరమైన ఇతర వస్తువులు అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ రైల్లో ప్రయాణించే గర్భవతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. "చాలాసార్లు మహిళలకు హఠాత్తుగా పీరియడ్స్ వస్తుంటాయి. వారి దగ్గర శానిటరీ ప్యాడ్స్ ఉండవు. మా దగ్గర అవి అందుబాటులో ఉంటాయి" అని శుభాంగి చెప్పారు.

 
అవసరమైన సమయంలో మహిళలు హోస్టెస్‌లతో సంకోచం లేకుండా మాట్లాడవచ్చు. "చిన్న పిల్లలతో ప్రయాణించే మహిళలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతాం. అప్పుడప్పుడు వాళ్ల పిల్లల్ని కూడా ఎత్తుకుని ఆడిస్తాం" అంటారు శుభాంగి.

 
దుస్తులపై వివాదం
అక్టోబర్ 4న ఈ రైలు సేవలు ప్రారంభించినప్పుడు, మీడియా, సోషల్ మీడియాలో ఇది చర్చల్లో నిలిచింది. శరీరానికి అంటుకున్నట్లు ఉన్న కాస్ట్యూమ్స్ వేసుకుని ప్రయాణికులపై పూలు చల్లుతూ రైల్లోకి ఆహ్వానిస్తున్న హోస్టెస్‌ల ఫొటోలు ప్రచురించినపుడు సోషల్ మీడియాలో చాలా మంది వారి దుస్తులపై ప్రశ్నలు లేవనెత్తారు.

 
చాలా మంది రైల్వే మంత్రి, ప్రధాన మంత్రి ఆఫీసును ట్యాగ్ చేస్తూ హోస్టెస్‌‌లు చీరలు కట్టుకుంటే బాగుంటుందని ట్వీట్స్ చేశారు. భారతీయ రైల్వేలో పనిచేస్తున్న ఈ హోస్టెస్‌లు పాశ్చాత్య శైలిలో స్కర్ట్ వేసుకోడానికి బదులు భారత సంస్కృతికి చిహ్నమైన చీర కట్టుకుంటే బాగుంటుందని వారు భావించారు.
చీర కట్టుకోవడం సాధ్యం కాదు
సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆ వాదన సబబే అయినా, ప్రాక్టికల్‌గా అది సాధ్యం కాదని శుభాంగి చెప్పారు. "మేం మా వృత్తిపరమైన దుస్తులు వేసుకున్నాం. వాటిని మా పని అవసరాలకు తగ్గట్టు డిజైన్ చేశారు. రైల్లో స్థలం తక్కువ ఉంటుంది. ప్యాసింజర్లు ఎక్కువమంది ఉంటారు. అటూ ఇటూ కదులుతున్న రైల్లో చీర కట్టుకుని ప్రయాణికులకు సేవలు అందించడం సాధ్యం కాదు" అని శుభాంగి చెప్పారు.

 
"చీరను సర్దుకోవడమే ఒక పెద్ద పని అవుతుంది. చాలాసార్లు చీర కట్టుకుని మన పనులే చేసుకోలేం. అలాంటిది వేరే వాళ్లకు ఎలా చేయగలం? ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఈ దుస్తుల్లో ఉండడం వల్ల మాకు ప్రయాణికులను రక్షించడం సులభంగా ఉంటుంది" అన్నారు. "మా డ్రెస్ మమ్మల్ని పూర్తిగా కప్పి ఉంచుతుంది. అది మా పనికి తగ్గట్టు ఉంటుంది. చీర కట్టుకుంటే మాకు పనిచేయడం చాలా కష్టం అవుతుంది" అని శ్వేత చెప్పారు.

 
భారత సమాజంలోని ఒక వర్గం.. మహిళలపై ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుందని వైశాలీ జైశ్వాల్ భావిస్తున్నారు. "మేం ఒక వేళ చీర కట్టుకున్నా, వాళ్లు ఏదో ఒక మాట అంటారు. సమస్య మా డ్రెస్‌లో కాదు.. వారి ఆలోచనల్లో ఉంది" అంటారు వైశాలీ.

 
ప్రయాణికులు అనవసరంగా విసిగిస్తారు
తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో సీటుకు పైన ఒక కాల్ బటన్ ఉంటుంది. దాన్ని నొక్కి హోస్టెస్‌ను పిలవచ్చు. కానీ చాలాసార్లు ప్రయాణికులు అకారణంగా ఆ బటన్ నొక్కుతుంటారు. "చాలా మంది హోస్టెస్‌ను చూడ్డానికే అలా చేస్తుంటారు" అని సంధ్య చెప్పారు. "చాలాసార్లు ప్రయాణికులు అనవసరంగా కాల్ బటన్ నొక్కి మమ్మల్ని పిలుస్తారు. అక్కడికి వెళ్తే అది పనిచేస్తోందో లేదో చూశామని చెబుతారు" అని సుంబుల్ ఫాతిమా చెప్పారు.

 
"ఒక కోచ్‌లో 70 మంది ప్రయాణికులు ఉంటారు. వారికి ఇద్దరు క్రూ మెంబర్స్ ఉంటారు. అనవసరంగా బెల్ నొక్కడం వల్ల నిజంగా హోస్టెస్ అవసరం ఉన్న ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతారు" అని మేనేజర్ శివాంగి చెప్పారు. రైల్లో వచ్చే కొంతమంది ప్రయాణికులు ఇబ్బంది కలిగించేలా చూస్తుంటారు, కామెంట్ చేస్తుంటారు. అలాంటి స్థితిలో మేం సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. మేం అబ్బాయిల కంటే తక్కువ కాదని ప్రతిసారీ నిరూపించాల్సి ఉంటుంది అంటారు సంధ్య.
వీడియో తీస్తుంటే ఇబ్బంది
వీటన్నిటికంటే ట్రెయిన్ హోస్టెస్‌లను అత్యంత ఇబ్బంది పెట్టే విషయం తమను అడగకుండానే ఫొటోలు, వీడియోలు తీసుకోవడం. "కొంతమంది ప్రయాణికులు కాల్ చేసి పిలుస్తారు. ముందే కెమెరా ఆన్ చేసి ఉంటారు. మేం వాళ్లకు సర్వ్ చేస్తున్నప్పుడు వాళ్లు మా వీడియో తీస్తుంటారు. అది మాకు నచ్చదు. కానీ మేం ఏం చేయలేం" అని సుంబుల్ చెప్పారు.

 
"ఈ అమ్మాయిలకు తమను తాము నిరూపించుకోడానికి ఒక మంచి అవకాశం ఉంది. కానీ చాలా మంది ప్రయాణికుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంటుంది" అని రెండ్రోజుల ముందు క్రూతో కలిసిన సిమ్రన్ అంటారు. అడగకుండానే మా వీడియో తీస్తుంటారు. అవి వైరల్ కావచ్చు. మా కుటుంబాల ముందు మాకు అది సమస్య కావచ్చు అన్నారు.

 
సంధ్యకు అలా వీడియోలు తీసే వాళ్లంటే చాలా కోపం. "జనం ఫేస్‌బుక్‌లో లైవ్ ఇస్తుంటారు. టిక్ టాక్ వీడియో చేస్తుంటారు. మా అనుమతి లేకుండానే యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేస్తుంటారు" అన్నారు. "ఇదో కొత్త రైలు. ప్రయాణికులకు రైల్లో, మా హోస్టెస్‌లతో ఫొటోలు తీసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ అది మా హోస్టెస్‌లను ఇబ్బంది పెడుతోంది" అని శుభాంగి చెప్పారు.

 
మా కష్టం చూడాలి
"క్రూ మెంబర్ సర్వ్ చేస్తూ ఉంటుంది. జనం వీడియో తీస్తూ ఉంటారు. దాంతో ఆమెకు పని చేయడం కూడా కష్టం అవుతుంది. వారు ఇలాంటి వీడియోల్లో కనిపించడం క్రూ లోని చాలా మంది అమ్మాయిల కుటుంబ సభ్యులకు నచ్చదు. వాళ్లు తమ పని చేస్తున్నారు. వారికి కూడా ప్రైవసీ ఉంటుంది. దాన్ని అందరూ గౌరవించాలి" అంటారు శుభాంగి.

 
ఇటు సుంబుల్.. "ప్రయాణికులు మమ్మల్ని కాదు, మా కష్టం చూడాలి" అన్నారు. "చాలా మంది ప్రయాణికులకు వద్దని చెప్పినా వీడియో తీస్తూనే ఉంటారు. వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందంటే మమ్మల్ని కూడా కొనేశారేమో అన్నట్టు ఉంటుంది. మా ఫొటో తీసేముందు మమ్మల్ని అడిగితే బాగుంటుంది. క్యాబిన్ క్రూలో ఉన్నా, కాలేజీలో ఉన్నా అమ్మాయిలను గౌరవించాలి" అంటారు సంధ్య.

 
టిప్ ఇవ్వాలని ప్రయత్నిస్తారు
కొంతమంది హోస్టెస్‌లు ప్రయాణికులు తమకు టిప్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించారని, వద్దని చెప్పినా బలవంతంగా చేతిలో పెడుతున్నారని చెప్పారు. "చాలా మంది ప్రయాణికులు కాల్ బటన్ నొక్కి మమ్మల్ని పిలుస్తారు. టిప్ చేతిలో పెడతారు. మాకు టిప్ తీసుకోవడం నచ్చదు, దానికి అనుమతి కూడా లేదు" అంటారు సుంబుల్.

 
చాలాసార్లు ప్రయాణికులు తమ నంబర్ ఇచ్చి ఫ్రెండ్షిప్ చేయాలనే ప్రస్తావన కూడా తెస్తారని కొంతమంది హోస్టెస్‌లు చెప్పారు. "చాలా మంది తమ నంబర్ ఇచ్చి ఫ్రెండ్షిప్ చేయాలని అడిగే ప్రయత్నం చేస్తారు. వాళ్లు సోషల్ మీడియాలో కూడా స్టాక్ చేస్తారు. అదంతా మా పనిలో భాగం కాదనే విషయాన్ని ప్రయాణికులు అర్థం చేసుకోవాలి" అని చెప్పారు క్రూ మెంబర్ షైలా మిశ్రా.

 
"ఒక ప్రయాణికుడితో క్రూ మెంబర్‌ సంబంధం ప్రయాణించినంత వరకే ఉంటుంది. చాలాసార్లు ప్యాసింజర్లు నంబర్ అడుగుతారు. క్రూ మెంబర్‌ తమ నంబర్ ఇవ్వడానికి అనుమతి లేదు. ప్రయాణికుల మర్యాదకు భంగం కలగకుండా అలాంటి పరిస్థితులు ఎదుర్కొనేలా మేం, మా క్రూ మెంబర్లకు శిక్షణ ఇచ్చాం" అని శుభాంగి చెప్పారు.

 
ప్రైవేటీకరణ ప్రయోగం
తేజస్ ఎక్స్‌ప్రెస్ ఐఆర్‌సీటీసీ చేసిన ఒక ప్రయోగం. ఇది విజయవంతం అయితే మిగతా మార్గాల్లో కూడా దీనిని ప్రారంభించనున్నారు. ఇదే విధంగా ముంబై-అహ్మదాబాద్ మధ్య రైలు నడపడానికి సన్నాహాలు పూర్తి చేశారు. తేజస్ ప్రయాణం ఎక్కడివరకూ వెళ్తుంది అనేది కాలమే చెబుతుంది. కానీ దీని క్రూ మెంబర్స్ ఇక్కడి వరకూ రావడానికి మాత్రం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది.

 
"మేం అమ్మాయిల ఒక తరంలో ప్రేరణ నింపాలని భావిస్తున్నాం. అమ్మాయిలు మరింత మెరుగ్గా బాధ్యతలు నిర్వహించగలరని నిరూపించాలని అనుకున్నాం. మరింత మంది అమ్మాయిలు ముందుకు రావాలి. ఇది చిన్న పని కాదు, చాలా బాధ్యతాయుతమైన పని. అమ్మాయిలకు వారి కలల్ని నిజం చేసుకునే అవకాశం ఇవ్వాలి. అవకాశం లభిస్తే మాలాంటి చిన్న కుటుంబాల అమ్మాయిలు కూడా ముందుకు వెళ్లగలం" అని సంధ్యా యాదవ్ చెప్పారు.
 
 
వేతనం ఎంత?
తేజస్ రైల్లో ఈ యువతులు రోజుకు 18 గంటలు పనిచేస్తుంటారు. తర్వాత రోజు విశ్రాంతి తీసుకుంటారు. ఇప్పుడు వీళ్లందరూ ఆరు నెలల ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్నారు. ఆ తర్వాత వారికి కాంట్రాక్ట్ ఇస్తారు. మీకు ఎంత వేతనం ఇస్తున్నారు అనే ప్రశ్నకు... "మాకు ఇస్తున్న జీతం ఎక్కువేం కాకపోయినా, మా అవసరాలు తీర్చుకోడానికి అది సరిపోతుంది. మేం మా కలలను నిజం చేసుకున్నాం. మా అసలు సంపాదన అదే" అని వారు చెప్పారు.

 
కొంతమందైతే వేతనం గురించి తమకు ఏ సమాచారం ఇవ్వలేదని చెప్పారు. వారు, నెల ముగిసిన తర్వాత శాలరీ అందుకునే క్షణం కోసం వేచిచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments