Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక దుమారం: కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ చుట్టూ వివాదాలు ఏంటి? క్విడ్ ప్రో కో ఆరోపణలు ఎందుకు?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (13:13 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇప్పుడు ఇసుక చుట్టూ తిరుగుతున్నాయి. గడిచిన రెండు, మూడు దశాబ్దాలుగా ఇసుక విధానం (సాండ్‌ పాలసీ ) రాజకీయాలను ప్రభావితం చేస్తూ వస్తోంది. తాజాగా ఇసుక తవ్వకం, అమ్మకాలు ప్రైవేటు పరం చేయడం క్విడ్‌ ప్రోకోలో భాగమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, తాము పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

 
వైఎస్.జగన్ నేతృత్వంలోని ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల్లోనే మూడుసార్లు ఇసుక విధానాన్ని మార్చింది. ఇది వివాదాలకు, విమర్శలకు కారణమయ్యింది. అధికార పార్టీ ఎంపీకి చెందిన కంపెనీలలో డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్న మరో సంస్థకు ఇసుక వ్యవహారం మొత్తం అప్పగించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

 
అసలేం జరిగింది...
వై.ఎస్.జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 జూన్ నుంచి ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. అప్పటి వరకూ ఉచిత ఇసుక పేరుతో గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని సవరించి, కొత్త పద్ధతిలో ఇసుక తవ్వకాలు జరుపుతామని, ఇది ప్రజల మేలు కోసమే చేస్తున్నామని సర్కారు ప్రకటించింది. అదే సంవత్సరం సెప్టెంబర్ 5న కొత్త విధానం ప్రకటించే వరకూ ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. తీవ్ర కొరత ఏర్పడింది. పలువురు ఇసుక కార్మికుల ఆత్మహత్యల చుట్టూ రాజకీయం సాగింది. ఇసుక ఖరీదు పెరగడంతో కొత్తగా అమలులోకి తెచ్చిన విధానం కూడా ప్రజలకు భారంగానే మిగిలింది.

 
అంతకు ముందు 4 యూనిట్ల లారీ రూ. 3 నుంచి 5 వేలకు కొనుగోలు చేసిన వారు కూడా కొత్త విధానంలో రూ. 10వేలకు పైనే వెచ్చించాల్సి వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన లారీలలో తరలించాలనే నిబంధన కూడా భారంగా మారింది. అన్నింటికీ మించి ఇసుకను ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలనే షరతు సామాన్యులకు ఇబ్బందిగా మారింది. ఈ ప్రక్రియ కష్టంగా ఉండటంతో మళ్లీ ఇసుక వ్యాపారుల మీద ఆధారపడక తప్పలేదు.

 
చివరకు ఆన్‌లైన్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో ఒప్పుకుంది. బుకింగ్‌లో అవినీతి, నాణ్యత లేని ఇసుక కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించింది. వాటిని సవరించి ఆఫ్‌‌లైన్‌లో కూడా ఇసుక కొనుగోలు, సొంత వాహనంలో తరలింపునకు అంగీకరిస్తూ ఇసుక విధానాన్ని మార్చింది. అంతేకాకుండా గ్రామ సచివాలయంలో అనుమతి తీసుకుని స్థానిక అవసరాలకు సామాన్యులు ఎడ్లబళ్లు, ట్రాక్టర్ల మీద ఉచితంగా ఇసుక తరలించుకోవచ్చని ప్రకటించింది.

 
ఏడాది కాలంలోనే ప్రభుత్వ విధానం సవరించినా సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలిగిన దాఖలాలు లేవనే వాదన ఉంది. ఇసుక ధరలు పెరిగి, సకాలంలో అందుబాటులో లేక, నాణ్యమైన ఇసుక లభించక నిర్మాణ రంగం ఇబ్బందులు ఎదుర్కొంది. ఇసుక మాఫియాను అడ్డుకోవడానికంటూ గతంలో ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం సమస్యను పరిష్కరించకపోగా వినియోగదారులకు కొత్త తలనొప్పిగా మారింది

 
మూడోసారి ఇసుక విధానంలో మార్పులు
రాష్ట్రంలో తొలుత ఇసుక తవ్వకాలు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో జరిగేవి. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు ఆదాయంలో వాటా దక్కేది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు ఇసుక విధానంలో తెచ్చిన మార్పులతో కొన్నాళ్లు రీచుల వారీగా వేలం జరిగింది. కొంతకాలం పాటు డ్వాక్రా గ్రూపుల ఆధ్వర్యంలో ఇసుకు అమ్మకం నడిచింది. ఆ తర్వాత ఉచిత ఇసుక అంటూ చేసిన ప్రయోగాలన్నీ ఇసుక వ్యాపారానికి దారితీశాయి. స్థానిక సంస్థలు ఆదాయం కోల్పోయాయి.

 
చివరకు ఏపీ ప్రభుత్వానికి అధికారిక లెక్కల ప్రకారం ఇసుక ద్వారా 2019-20లో రూ.161.30 కోట్లు, 2020-21లో గత నెల ఫిబ్రవరి వరకూ రూ.380 కోట్ల ఆదాయం వచ్చింది. ఇసుకను అక్రమంగా తవ్వకాలు, అమ్మకాలు చేసిన వారికి వేల కోట్ల ఆదాయం వచ్చిందనే కథనాలు కూడా వచ్చాయి. ఈ మాఫియా వెనక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పెద్దల పాత్ర ఉందని గతంలో ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడూ వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకుండానే వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మూడోసారి ఇసుక విధానంలో మార్పులు చేసింది. ఈసారి తవ్వకాలను ప్రైవేటుపరం చేసింది.

 
ఇసుక తవ్వకాలు, నిల్వతో పాటుగా రెండు సంవత్సరాల కాలానికి అమ్మకాలు చేసేందుకు జయప్రకాశ్‌ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. ఆన్‌లైన్‌లో టెండర్లు స్వీకరించి, జేపీ గ్రూప్ సంస్థను ఎంపిక చేశామని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలను 3 ప్యాకేజీలుగా విడదీసి, విడివిడిగా టెండర్లు పిలిచారు. రూ.477.5 కోట్లు, రూ.745.7 కోట్లు, రూ.305.60 కోట్లుగా టెండర్ ఖరారు చేసి రాష్ట్రంలోని మూడు ప్యాకేజీలను జేపీ కంపెనీకి కేటాయించారు.

 
అభ్యంతరాలు ఏంటి?
ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న జేపీ గ్రూపునకు చెందిన జయప్రకాశ్‌ పవర్ వెంచర్స్ సంస్థను 1995లో హిమాచల్‌ ప్రదేశ్ కేంద్రంగా రిజిస్టర్ చేశారు. కొంతకాలం పాటు విద్యుత్ ఉత్పత్తిలో ఈ సంస్థ మంచి లాభాలు గడించింది. జేపీ గ్రూపు షేర్ విలువ కూడా కొన్నేళ్ల క్రితం రూ.500 వరకూ ఉండేది. ప్రస్తుతం సోలార్ పవర్ ప్రొడక్షన్ పెరిగిన తర్వాత హైడ్రల్, థర్మల్ పవర్ కంపెనీల లాభాలు కుంచించుకుపోయాయి.

 
ఆ క్రమంలోనే ఇసుక కాంట్రాక్ట్ సంస్థ షేర్ విలువ రూ.20 లోపునకు పడిపోయింది. అంతేకాకుండా గత ఏడాది ఆడిట్ రిపోర్ట్ ప్రకారం సుమారుగా రూ. 3.5 వేల కోట్ల నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉన్న కంపెనీకి 13 జిల్లాల పరిధిలో విస్తారంగా జరిగే ఇసుక తవ్వకాలు అప్పగించడం వెనుక క్విడ్ ప్రో కో జరిగిందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది.

 
"రాంకీ గ్రూపు సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న పెద్దిభొట్ల గంగాధర శాస్త్రి ఇప్పుడు ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలో డైరెక్టర్‌గా ఉన్నారు. రాంకీ సంస్థ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిది. కాబట్టే దివాళా తీసేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీకి ఇసుక కాంట్రాక్టు అప్పగించారు. ఇసుక, స్టీల్, సిమెంట్ ఇలా అన్నీ తమ చెప్పుచేతల్లో పెట్టుకుని క్విడ్ ప్రోకో కు పాల్పడుతున్నారు’’ అని టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభి బీబీసీతో అన్నారు.

 
‘‘ఇసుక ధరను ఈ ప్రభుత్వం అమాంతంగా పెంచింది. ట్రాక్టర్ ఇసుక రెండేళ్ల క్రితం రూ.1200 ఉంటే ఇప్పుడు అది నాలుగు రెట్లు పెరిగింది. అంటే ముందుగా ధరలు పెంచి, ఇప్పుడు ప్రైవేటు పేరుతో ప్రజలను దోచుకునే కుట్ర సాగుతోంది. రాష్ట్రంలో రోజుకి 1.25 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఏడాదికి 2 కోట్ల టన్నుల ఇసుకను మాత్రమే లెక్కలు చెబుతున్నారు. మరో 2 కోట్ల టన్నుల ఇసుక బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తారా? జేపీ వెంచర్స్‌కు ఎక్కడయినా ఇసుక తవ్విన అనుభవం ఉందా? ఏపీఎండీసీ, ఎన్ఎండీసీ వంటి ప్రభుత్వ సంస్థలను కాదని ప్రైవేటుకి కట్టబెట్టడం వెనుక అవినీతి పథకం ఉందని అందరికీ అర్థమవుతోంది" అని పట్టాభి అన్నారు.

 
‘మద్యం ప్రభుత్వానికి... ఇసుక ప్రైవేటుకా’
టీడీపీతో పాటు బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ కూడా ఇసుక ప్రైవేటుపరం చేయడాన్ని తప్పుబడుతున్నాయి. బీజేపీ నేతలు తిరుపతిలో ఆందోళన చేపట్టారు. జనసేన కూడా ప్రభుత్వ తీరు పట్ల అనుమానం వ్యక్తం చేస్తోంది. "పారదర్శకంగా పాలన అందిస్తామని చెప్పిన జగన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రూ.100 కోట్లు పైబడిన టెండర్ బిడ్లు జ్యుడీషియల్ విచారణ చేయిస్తామని చెప్పారు. మరి వందల కోట్ల ఇసుక కాంట్రాక్ట్‌ని ఎందుకు చేయించలేదు. రివర్స్‌ టెండరింగ్, జ్యుడీషియల్ కమిటీ అని చెప్పిన ప్రభుత్వం వాటిని ఎందుకు విస్మరించింది." అని జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ ప్రశ్నించారు.

 
"గ్రామ సచివాలయం ద్వారా పేదలు ఉచితంగా ఇసుకను తరలించుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పి ఇప్పుడెందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటులో ఉన్న మద్యం వ్యాపారం ప్రభుత్వ పరం చేసి, ప్రజలకు సంబంధించిన ఇసుకను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎలా పెడతారు? ప్రభుత్వ వైఖరి పట్ల ప్రజల్లో అపోహలున్నాయి" అని శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు.

 
‘ప్రజలకు మెరుగైన ప్రయోజనాలు’
సామాన్య గృహ నిర్మాణదారులకు మేలు చేసే ఉద్దేశంతోనే ఇసుక విధానంలో మార్పులు తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. గతంలో రూపొందించిన ఇసుక విధానాన్ని మరింత మెరుగుపరుస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెబుతున్నారు. "అవినీతి నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, పారదర్శకత, అందుబాటులో సరిపడా ఇసుక, సరసమైన ధరే లక్ష్యంగా ఇసుక విధానంలో మార్పులు చేస్తున్నాం. కాంట్రాక్టరు ఎంపిక చరిత్రలో ఎన్నడూలేని విధంగా అత్యంత పారదర్శకంగా జరిగింది." అని ద్వివేది బీబీసీతో అన్నారు.

 
‘‘నేరుగా రీచ్‌ల వద్దకు వెళ్లి, నాణ్యతను స్వయంగా పరిశీలించి ఇసుకను కొనుక్కునే అవకాశం ఉంటుంది. తనకు నచ్చిన వాహనాన్ని తీసుకెళ్లి... డబ్బు చెల్లించి రసీదు పొంది, ఇసుక తెచ్చుకునేలా మార్పులు చేశాం. ఇకపై మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. రీచ్‌ వద్ద మెట్రిక్‌ టన్నుకు రూ.475 చెల్లిస్తే చాలు. ఎంత కావాలంటే అంత ఇసుకను తెచ్చుకోవచ్చు.'' అన్నారాయన.

 
"ఇసుక తీసుకెళ్లే వ్యక్తి వ్యాపారి అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధిక ధరకు విక్రయించే వీలు లేదు. అధిక ధరకు ఎవరైనా విక్రయిస్తే 14500 కాల్‌ సెంటర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇసుక అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పనిచేస్తోంది" అని ద్వివేది తెలిపారు.

 
రీచ్‌ దగ్గర మెట్రిక్‌ టన్నుకు కొనుగోలుదారులు రూ.475 చెల్లించగానే అందులో రూ.375 నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని, తద్వారా టన్ను రూ.475 చొప్పున ఏడాదికి 2లక్షల టన్నుల ఇసుక సరఫరా చేస్తే రూ.950 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.

 
"కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సింది రూ.765 కోట్లు. మిగిలిన సొమ్ము నిర్వహణా ఖర్చుల కింద కాంట్రాక్టు సంస్థకు వెళ్తాయి. ఇందులో రూ.2వేల కోట్ల అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఎక్కడ నుంచి వచ్చింది ? ఉచితం పేరు చెప్పి వందల కోట్ల మేర దోపిడీ చేసే అవకాశం లేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మంచి జరిగేలా కొత్త విధానం రూపకల్పన చేశాం" అని గోపాల కృష్ణ ద్వివేది అన్నారు.

 
రాంకీతో గంగాధరశాస్త్రికి సంబంధం నిజమేనా...?
ప్రస్తుతం విపక్షాల ఆరోపణలకు కేంద్ర స్థానంగా ఉన్న గంగాధర శాస్త్రి రాంకీ గ్రూపు సంస్థల్లో కూడా డైరెక్టర్‌గా ఉన్న విషయం వాస్తవమేనని బీబీసీ పరిశీలనలో తేలింది. 2008 జనవరిలో జేపీ పవర్ వెంచర్స్‌లో ఆయన డైరెక్టర్‌గా చేరారు. దాంతో పాటుగా ఆయన దాదాపు 10 సంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ ఎఫైర్స్ కేటాయించే డీఐఎన్ 01890172 తో ఉన్న ఆయన జేపీ పవర్ వెంచర్స్ నుంచి డైరెక్టర్ హోదా వదులుకున్నట్టు పేర్కొన్నారు

 
అటు అధికార పార్టీ ఎంపీకి చెందిన కంపెనీలలో కీలకంగా ఉన్న గంగాధరశాస్త్రి డైరెక్టర్‌గా ఉన్న కంపెనీకి ఇసుక కాంట్రాక్ట్ అప్పగించడమే ఈ వివాదానికి ఆజ్యం పోస్తోంది. ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ ఏపీలో మొత్తం ఇసుక వ్యవహారాలన్నీ కాంట్రాక్ట్ సంస్థ జేపీ కంపెనీకి రెండేళ్ల ఒప్పందం మేరకు అప్పగించే ప్రయత్నాల్లో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments