Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్: అయిదేళ్లుగా అంగన్‌వాడీలకు బిల్లులు చెల్లించడం లేదు, కొత్తగా వేతనాలలో జాప్యం... ఎందుకిలా?

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (16:12 IST)
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ శాఖల ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో ఆలస్యమవుతోంది. ఒకటో తేదీన జీతాలు తీసుకునే అవకాశం తగ్గిపోయింది. నెలలో మొదటి పది రోజుల్లో ఏదో తేదీన జీతాలు జమ అవుతున్నాయి. ప్రస్తుతం మే నెల వేతనాలు కూడా అత్యధికులకు ఆలస్యమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి కూడా వేతనాలు చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఒకటి, రెండు నెలల జీతాలు పెండింగులో ఉంటున్నాయి. వీటికి తోడు అంగన్ వాడీ కార్యకర్తలకు చెల్లించాల్సిన ప్రయాణ భత్యం వంటివి కూడా ఏళ్ల తరబడి చెల్లించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

 
అంగన్‌వాడీలకు ఎంత చెల్లించాలి?
గ్రామీణ ప్రాంతాలతో పాటుగా పట్టణాల్లోని మురికివాడల్లో గర్భిణులు, కిశోర బాలికల ఆరోగ్య పరిరక్షణతో పాటుగా ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సమగ్ర శిశు అభివృద్ధిపథకం (ఐసీడీఎస్) పేరుతో 1975లో ఈ పథకం మొదలయ్యింది. క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వాటిలో అంగన్ వాడీ కార్యకర్తతో పాటుగా సహాయకురాలు కూడా ఉంటారు. సుమారుగా లక్ష మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

 
అంగన్‌వాడీ కార్యకర్తకు ఏపీలో రూ. 11,500, సహాయకురాలికి రూ. 7,500 చొప్పున గౌరవ వేతనంగా అందిస్తున్నారు. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక్కో కార్యకర్తకు నెలకు రూ.6,000 చొప్పున అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంత జోడించి అందిస్తుంటాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో అంగన్‌వాడీల గౌరవ వేతనాల విషయంలో వ్యత్యాసం ఉంటుంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో రూ.2 వేలు తక్కువగా అంగన్ వాడీ కార్యకర్తలకు దక్కుతోంది.

 
వీరికి నెలకొకసారి ప్రాజెక్టు కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా అంగన్‌వాడీ సెంటర్ నుంచి ప్రతీ కార్యకర్త ప్రాజెక్టు ఆఫీసుకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకు ప్రయాణ, దినసరి భత్యాలు చెల్లిస్తారు. టీఏలను ప్రాజెక్టు ఆఫీసు నుంచి సెంటర్‌కి ఉండే దూరాన్ని బట్టి నిర్ణయిస్తారు. దాంతో, కనీసంగా నెలకు టీఏ, డీపీ కలిపి ఒక్కో కార్యకర్తకి రూ. 300 నుంచి సుమారు రూ. 600 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. అయితే అయిదేళ్లుగా ఈ చెల్లింపులు లేవు. టీఏ, డీఏలలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది.

 
పేరుకుపోతున్న పెండింగ్ బిల్లులు
ఐసీడీఎస్ అనేది కేంద్రం ఆధ్వర్యంలో నడిచే వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ పథకానికి అవసరమైన నిధుల్లో కేంద్రంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. ఏపీలో అంగన్ వాడీ కార్యకర్తలకు 2017 నుంచి బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. 2017 ఫిబ్రవరి నుంచి వాటిని విడుదల చేయడం లేదు.

 
దాంతో ఈ ఐదేళ్లలో ఒక్కో కార్యకర్తకి సగటును రూ.17వేల వరకూ బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఈ బిల్లుల విడుదల కోసం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్సర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో పలుమార్లు నిరసనలు తెలిపినా ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆ సంఘం నాయకురాలు జి.బేబీరాణి అంటున్నారు.

 
"గతంలో ఎన్నడూ ఇలాంటి దుస్థితి లేదు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాటు బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేసింది. అన్ని రకాలుగా ఒత్తిడి చేసినా సాకులు చెబుతూ సరి పెట్టేసింది. జగన్ తాను అధికారంలోకి వస్తే అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలు తీరుస్తానని చెప్పారు. కానీ మాకు కొత్త సమస్యలు తీసుకొచ్చారు. ఉన్న సమస్యలను పరిష్కరించకుండా నాన్చుతున్నారు" అని బేబీరాణి బీబీసీతో అన్నారు.

 
"గతంలో నాలుగైదు నెలల పాటు బిల్లులు రాకపోయినా సర్దుకుపోయేవాళ్లం. కానీ ఐదేళ్ల పాటు బిల్లులు ఇవ్వకపోతే ఎలా గడుస్తుంది? అసలే అంతంతమాత్రపు జీతాలు. వాటిని కూడా సకాలంలో చెల్లించడం లేదు. మార్చి నెల జీతాలు మే 18న పడ్డాయి. ఏప్రిల్ నెల జీతం బకాయి ఉంది. ఎప్పుడిస్తారో తెలియదు. జీతాలు సకాలంలో రాక, బిల్లులు పెండింగులో పెట్టి అంగన్ వాడీలను అప్పుల పాలుజేస్తున్నారు. బాలింతలు, పసిబిడ్డల ఆరోగ్యం కోసం పాటుపడే వారితో ఆటలు ఆడుకోవద్దు" అని కోనసీమ జిల్లా మండపేట ప్రాజెక్టుకి చెందిన కె.కృష్ణవేణి బీబీసీతో అన్నారు. ప్రభుత్వం బకాయి బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని ఆమె కోరుతున్నారు.

 
సమస్యలు పేరుకుపోతున్నాయని, దీర్ఘకాలంగా బిల్లులు పెండింగులో ఉన్నాయని, ఇప్పుడు జీతాలు కూడా బకాయి పెడుతున్నారని అంగన్‌వాడీల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ అంటున్నారు. "అంగన్ వాడీ సెంటర్ల నిర్వహణ మీద ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. సెంటర్ లో పిల్లలకు 15 గ్రాముల కందిప్పు, 5 గ్రాముల నూనెతో వంట వండి పౌష్టికాహారం అందించాలని చెబుతున్నారు. అది సాధ్యమేనా? మెనూ భారీగా ఉంటుంది. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉంటే ఎలా సాధ్యం'' అని ఆమె ప్రశ్నించారు. అంగన్ వాడీ కార్యకర్తలకు రేషన్ కార్డులు తొలగించడం, ఇళ్ల స్థలాల కేటాయింపులో అనర్హులుగా ప్రకటించడం వంటివి సరిదిద్దుతామని చెప్పి కూడా అమలు చేయడం లేదని ఆమె అన్నారు.

 
అంగన్‌వాడీల ఉద్యమ చరిత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అంగన్‌వాడీ కార్యకర్తలు అనేక ఉద్యమాలు నిర్వహించిన అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్ లో అంగన్ వాడీ మహిళల ఉద్యమం మీద గుర్రాలను ప్రయోగించడం, లాఠీ ఛార్జీలు చేయడం వంటి ఘటనలు పెద్ద ప్రభావం చూపించాయి. ఇటీవల కూడా రాష్ట్రవ్యాప్తగా కలెక్టరేట్ల వద్ద అంగన్‌వాడీలు పెద్ద స్థాయిలో నిరసనలు తెలిపారు. మొన్నటి మార్చి నెలలో కలెక్టరేట్లు ముట్టడించిన అంగన్ వాడీలను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేశారు. సమస్యలు పెరగడానికి కారణమవుతూ, పరిష్కరించాలని కోరుతున్న వారిపై ఇటీవల అణచివేత పెరిగిందని స్కీమ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి కాట్రగడ్డ స్వరూపరాణి అన్నారు.

 
"రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. వినతిపత్రాలకు కదలడం లేదు. నిరసనలకు పూనుకుంటే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సమస్యల మీద పనిచేస్తున్న వారిని అణచివేయాలనుకోవడం తగదు" అని స్వరూప రాణి బీబీసీతో అన్నారు. పెండింగ్ జీతాలు, బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

 
‘నిధులు కేటాయిస్తున్నాం...’
రాష్ట్రంలో అంగన్‌‌వాడీ కార్యకర్తల సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. ''అంగన్ వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వార్షిక ఆదాయం ఎక్కువగా ఉందనే పేరుతో గతంలో సంక్షేమ పథకాలకు అర్హత లేదని చెబితే దానిని మార్చాము. గ్రామాల్లో ఇంకా సమస్య ఉందని మా దృష్టికి వచ్చింది. అన్నింటినీ పరిశీలిస్తాం'' అని మంత్రి అన్నారు.

 
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణతో పాటుగా క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ పథకాల అమలులో కూడా అంగన్‌వాడీలది ప్రధాన పాత్ర. పల్స్ పోలియో వంటి కార్యక్రమాలు విజయవంతం కావడంలో వారి తోడ్పాటు ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పాటుగా పట్టణాల్లోని పేదల బస్తీల్లో బాలబాలికలను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్న వారికి ప్రభుత్వం కూడా తగిన రీతిలో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balagam Actor: బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

పోలీస్ ట్రైనీ మీనాక్షితో వెంకటేష్ ప్రేమలో పడితే ఏం జరిగింది?

Keerthy Suresh mangalsutra: మంగళసూత్రంతో కీర్తి సురేష్.. ఎరుపు రంగు దుస్తుల్లో అదిరిపోయింది...

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments