నిత్యానంద గురించి ఎవ్వరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భక్తి, ఆధ్యాత్మికత ముసుగులో మనోడు చేసిన రాసలీలలు అప్పట్లో పెను సంచలనమే రేపింది. అంతేకాదు రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. దేశ విడిచి పారిపోయిన నిత్యానంద.. ఓ ప్రత్యేక దేశం కైలాసను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కైలాస దేశానికి వస్తే శివుడిని చూడవచ్చునని ప్రకటన చేశాడు. ఆస్ట్రేలియా వరకు వెళ్తే చాలు. అక్కడి నుంచి కైలాసకు ఉచితంగానే తీసుకెళ్తారట. అందుకోసం గరుడ పేరుతో చార్టర్డ్ ఫ్లైట్ సేవలను ప్రారంభించినట్లు నిత్యానంద చెప్పాడు.
కైలాసకు వచ్చే పర్యాటకులకు మూడు రోజులు మాత్రమే అక్కడ ఉండాలి. ఉన్నన్ని రోజులూ వసతి, భోజనం కూడా ఉచితంగానే అందిస్తామని నిత్యానంద స్వామి పేర్కొన్నారు. కైలాస వీసా దరఖాస్తు కోసం ఈమెయిల్స్ పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. తమ దేశానికి వచ్చే భక్తులకు పరమ శివుడిని చూపిస్తామని వెల్లడించారు.
ఉత్తర అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలో ఓ ద్వీపాన్ని కొనుగోలుచేసి కైలాసగా పేరు పెట్టుకున్నట్లు ప్రకటించి.. సంచలనానికి తెరలేపాడు. కైలాసకు సొంతంగా పాస్‌పోర్టు ఉంది. జాతీయ జెండా, జాతీయ చిహ్నాలు ఉన్నాయి. అంతేకాదు కైలాస దేశం కోసం kailaasa.org పేరుతో వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించారు నిత్యానంద.
కైలాస.. ఈ భూమండలంపై ఉన్న గొప్ప హిందూ దేశమని నిత్యానంద వెల్లడించాడు. తమ తమ దేశాల్లో హిందూత్వాన్ని అనుసరించే హక్కును కోల్పోయిన హిందువులంతా కలిసి ఈ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు.