Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడికి మేత్రం ఇది పనికిమాలిన పల్లెటూరు..!!

డాక్టర్ మాధురీ కృష్ణ

Webdunia
WD
" సుబ్బయ్య మావా! ఇంకా ఎందుకే ఈ వయసులో నీకీ కట్టం. కొడుకు అవిద్రాబాదులో( హైదరాబాదు) పెద్ద ఉద్దోగం సేత్తన్నాడుగా... కమ్మగా ఆడికి బోయి కాలుమీన కాలుసేకుని కమ్మగా రేయింబొగుళ్లు టీవీ సూత్తూ, కోడల పిల్ల సేతి తిండి తింటూ పేణం ఉన్నెంతె కాలం హాయిగా బతుకొచ్చుగా" అన్నాడు సూరయ్య...

సూరయ్య మాటలు విని ఎప్పటిలాగే సమాధానంగా ఓ బలహీనమైన నవ్వు నవ్వి ఇంటికొచ్చి పాత నులక మంచంపై నడుము వాల్చాడు సుబ్బయ్య. "ఏందీ ఈ పొద్దుటేల శానా నీరసంగా ఉండాది" అనుకుంటూ కళ్లు మూశాడు.

కళ్ల ముందు గతం తాలూకు జ్ఞాపకాల దొంతరలు కదిలాయి. ఈ ఊర్లోనే తను పుట్టి పెరిగింది. ఆ ఊరు నుంచే పట్నానికి మైళ్ల దూరం నడిచి బడికెళ్లి చదువుకుంది. పదవ తరగతి పక్క ఊర్లో ఉండి చదువుతానంటే నాన్న... " సదివింది సాలు.. ఈ ఊళ్లో నీకేం తక్కువా? ఇట్టమైన పని సేసుకుని దరిజాగా బతుకు" అనేవాడు. ఎప్పుడైనా కోపంలో ఊరొదిలి వెల్దామంటే... "ఎవురినైనా కన్న ఊరు, కన్నతల్లేరా కట్టాల్లో ఆదుకునేది" అంటూ గుర్తు చేసేవారు. నాన్న చెప్పినట్లే ఏ కష్టమొచ్చినా తీర్చింది ఈ ఊరే. ఈ ఊర్లోనే 50 ఏళ్ల క్రితం గుర్తుగా తమ కాంతి వెలుగు చంద్రం పుట్టింది.

ఇంకా ఆనాటి ఆ దృశ్యం కళ్ల ముందు కదులుతూనే ఉంది. అనారోగ్యంతో తన సీతామాలక్ష్మి పడిన బాధ నేటికీ గుండెను పిండుతుంది. అదేదో పెద్ద జబ్బు పట్నం వెళ్తే ఫలితం ఉండొచ్చు అంటూ నాటు వైద్యుడు చెప్పినప్పుడు సీత తన చెయ్యి పట్టుకుని తీసుకున్న ఒట్టు... ఇంకా గుర్తు ఉంది. ఆ చేతి స్పర్శ వెచ్చగా... గుర్తొస్తూనే ఉంటుంది.

" అయ్యా! నాను పెట్నమెల్లి వైద్దిగం సేయించుకన్నంత మేత్రేన బతుకుతాననే ఆశ నేదు. ఈ వైద్దిగం సంగతి దెలిత్తే మన సెంద్రం సదువు మానేసి ఆ డబ్బులతో నన్ను బతికింసుకుందామని పాకులాడతడు. ఆడి సుదువు సట్టు బండలు గాకూడదు. మనలా సదువు లేని వారిలా ఆడు ఉండకూడదు. ఈ ఊళ్లోకి ఒక్కడైనా సదువు సెప్పే మడిసి రావాలి. అది మన సెంద్రమే గావాల" అంటూ అలాగే జబ్బుతో కన్ను మూసింది.

సీత అన్నట్లే చంద్రం ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నాడు. గతంలో తన కోరిక చెపితే... "ఏంటి నాన్నా నా కలల్ని చంపుకుని నీ లాగే నన్ను ఈ ఊర్లో ఉండమనడం నీ స్వార్థం" అని తేలిగ్గా కొట్టిపడేశాడు. కావాలంటే నువ్వు నాతో రా... అంటున్నాడు.

ఆడు పిలిత్తే మేత్రం ఎట్టా ఎల్తాను. నా (నేల)తల్లిని వొదిలి. ఈడే అమ్మా, అయ్యా కూలి సేసి తనను రాజులా సాకారు. ఈడే నా సీతామాలచ్చి కట్టంలో, సుఖంలో రారాజులా సూసుకుంది. ఆడికి మేత్రం ఇది పనికిమాలిన పల్లెటూరు. కానీ నాకు తెలుసు. ఇది నా పేణం. పేణం వొదిలి నేనెట్టా ఎళ్తాను.

ఎల్లనుగాక ఎల్లను అని గట్టిగా బయటికి అంటూ... తన రిక్షా తీసుకుని బయలుదేరాడు పక్క ఊర్లోని బడి పిల్లలను తీసుకురావడానికి...

ఎందుకంటే తన ముందు తన సీతామాలక్ష్మి కల ఇంకా సజీవంగానే ఉంది. తను తన రిక్షాలో తీసుకెళ్లే పిల్లల్లో ఒక్కరైనా తన ఊరికి చదువు సెప్పే మేస్టారు కాకపోతారా... తన సీత కోరిక తీరకపోతుందా అనే ఆశతో...

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

Show comments