Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగా మరణ రహస్యం అమ్మలు గన్న అమ్మకే తెలుసు.. ఇదే వర్మ 'వంగవీటి' చిత్ర రివ్యూ

వివాదాస్పద అంశాలను తీసుకుని సినిమాలుగా తీయడం రామ్‌గోపాల్‌వర్మకే చెల్లు. అలాంటి ప్రయోగాలు పలు చేసిన ఆయన.. తాజాగా.. 'వంగవీటి' అనే పేరుతో రంగా జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ క్

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (13:29 IST)
వివాదాస్పద అంశాలను తీసుకుని సినిమాలుగా తీయడం రామ్‌గోపాల్‌వర్మకే చెల్లు. అలాంటి ప్రయోగాలు పలు చేసిన ఆయన.. తాజాగా.. 'వంగవీటి' అనే పేరుతో రంగా జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ క్రేజ్‌ ఏర్పడింది. మరోవైపు ఇదే చిత్రాన్ని దర్శకుడు ధవళ సత్యం తీస్తానని కూడా ప్రకటించారు. ఇందుకు రంగా అనుచరుల నుంచి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్లు సత్యం చెప్పారు. కానీ వర్మ తీస్తున్నాడనగానే ప్రజల్లోనే ఏదో ఆసక్తి.. రంగా అనుచరుల్లోనూ మరింత ఆసక్తి నెలకొనడంతో చిత్ర నిర్మాత కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన దాసరి కిరణ్‌ కుమార్‌ కావడంతో ప్రాజెక్ట్‌ ఊపందుకుంది. తనకిష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తానని చెప్పే వర్మ 'వంగవీటి' సినిమాను విజయవాడ ప్రజలు మెచ్చుకుంటారని స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. మరి ఆ సినిమా ఎలా వుందో చూద్దాం.

 
బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కథ:
విజయవాడలో వెంకటరత్నం అనే వామపక్ష భావాలున్న రౌడీ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. బస్టాండ్‌ సెంటర్లలో దందాలు చేస్తున్న వంగవీటి రాధా గురించి తెలుసుకుని అతన్ని తన అనుచరుడిగా తీసుకుంటాడు. క్రమేణా.. రాధా ప్రాబల్యం పెరుగుతుంది. వెంకటరత్నం సహించలేక రాధాకు వార్నింగ్‌ ఇస్తాడు. ఫలితం కాపు కాచి వెంకటరత్నాన్ని రాధా తన అనచరులతో చంపేస్తాడు. దాంతో విజవాడలో రాధా పేరు మారుమోగుతోంది. అలాంటి టైంలోనే ఆయన సోదరుడు రంగా కాలేజీ చదువుతూ ధైర్యవంతురాలైన రత్నకుమారిని ప్రేమిస్తాడు. అలాంటి సమయంలోనే గాంధీ, నెహ్రూ అనే సోదరులు ప్రజల కోసం పోరాడే రంగాకు సపోర్ట్‌గా నిలుస్తారు. క్రమేణా కొన్ని విషయాల్లో స్వంత నిర్ణయాలు తీసుకుని కాలేజీలో యుఎస్‌ఓ అనే ఆర్గనైజేషన్‌ స్థాపిస్తారు. మరోవైపు బస్సుల ప్రైవేటీకరణ పేరుతో ఉద్యమం లేపి నెహ్రూ, గాంధీలు పేరు కొట్టేస్తారు. ఇది రంగా వర్గానికి సహించదు. 
 
మనస్పర్థలు, అనుమానాలతో విడిపోవడంతోపాటు ఓ సందర్భంలో శ్రుతిమించుతున్నాడని గాంధీని రంగా వర్గం దారుణంగా చంపేస్తుంది. కాస్త ఆలోచించే మనస్తత్వం ఉన్న నెహ్రూ ఓ లాయర్‌ ద్వారా రాయబారానికి సమ్మతిస్తాడు. కానీ నెహ్రూ మరో తమ్ముడు మురళీ పగతో రగిలిపోతాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతనికి సిరీస్‌ రాజు అనే వ్యాపారవేత్త అండగా ఉండటంతో తన అన్న గాంధీ హత్యలో పాల్గొన్నవారిని చంపేస్తాడు. చివరిగా రంగాను చంపేస్తానని రత్నకుమారికి ఫోన్‌ చేసి బెదిరించడంతో రంగా ఆలోచించి మురళీ కదలికపై కన్నేసి అతన్ని మట్టుపెడతాడు. ఆ సమయంలోనే ప్రాంతీయ పార్టీ పేరుతో కాషాయ వస్త్రాలు ధరించే ఓ నాయకుడు రావడం.. అందులో నెహ్రూ చేరి పదవి దక్కించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.
 
విశ్లేషణ:
రక్తపాతాలు, హింస.. వంటి కథల్లో ఆయా పాత్రలు ఎలా చేశారు. ఎలా జీవించారు. నటించారు అనేది చెప్పుకోవడం అనవసరం. ఎమోషనల్‌తో కూడిన సన్నివేశాలు, ఆవేశం ఉట్టిపడే తత్త్వంలో ఎవరికివారు బాగా చేశారు. రాధా, రంగా పాత్ర ఇద్దరివీ షాండీ అనే నటుడు పోషించాడు. రంగా పాత్రలో అతను ఇమిడిపోయాడు. అలాగే సిరీస్‌ రాజు పాత్ర, నెహ్రూ పాత్రలు వంటివి వర్మ నటుల్ని ఏరికోరి దించేశాడు.
 
విజయవాడ హత్యా నేపథ్యం కథ కనుక.. ఎవరు ఎవర్ని చంపారు? ఎలా చంపారు? వారి వెనుక ఎవరు ఉన్నారనేవి? జరిగింది జరిగినట్లు చెప్పడం చాలా కష్టం. ఆ రోజుల్లో వార్తా పత్రికల్లోనూ అప్పటి జనరేషన్‌కు చెందిన వారో, ఆయా వర్గాలకు చెందిన అనుచరులు చెప్పింది విని వాటి ఆధారంగా కథను తయారుచేసుకోవడం మినహా మరో మార్గం లేదు. కల్పిత కథ అయితే ఏదైనా ఊహించి దాన్ని అందంగా చెక్కవచ్చు. జరిగిన కథ జరిగినట్లు చెప్పకూడదు. శాంతిభద్రతల సమస్య. రాజకీయ సమస్య. వ్యక్తుల సమస్య.. అందుకే.. తనకు తోచినట్లుగా వర్మ తీసేశాడు. 
 
మూడు జనరేషన్‌ల గురించి చెప్పాలి కాబట్టి.. రాస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. సినిమా కాబట్టి రెండున్నర గంటల్లో తేల్చేయాలి. అందుకే బ్యాక్‌గ్రౌండ్‌లో రామ్‌గోపాల్‌ వర్మ.. వాయిస్‌తో కథ పరిస్థితుల్ని చదువుతూ చెబుతాడు. పనిలోపనిగా వంగవీటి.. వంగవీటి.. అనే పాటను కూడా పాడేశాడు.
 
వర్మ చెప్పనివి:
1. రాధాను చంపింది.. ఆయన్ను నమ్మిన వ్యాపారవేత్త శివరామ్‌ప్రసాద్‌. అప్పట్లో పేపర్లో ఆయన పేరు మారుమోగింది. అందుకు ప్రముఖ లాయర్‌తో కొన్ని ఏళ్ళపాటు ఆయనపై కేసు నడిచింది. అవేవీ వర్మ చెప్పలేదు. 
 
2. నెహ్రూ తమ్ముడు మురళీ.. నెల్లూరులో లా పరీక్షరాసి తిరిగి వస్తుండగా చంపాడని అప్పట్లో వార్తాపత్రికల్లో రాశారు. వర్మ కథలో.. ఏదో పనిమీద వెళ్లాడని చెబుతాడు.
 
3. అసలు రంగ హత్యలో.. అప్పటి ముఖ్యమంత్రి ప్రమేయం ఉందనీ.. రకరకాలుగా వార్తలు వచ్చాయి. నిరాహారదీక్ష చేస్తున్న రంగాను.. తెల్లవారుజామున.. అయ్యప్ప భక్తుల వస్త్రధారణతో వచ్చిన ప్రత్యర్థులు చంపారు. అది చూపించాడు. కానీ.. దుండగులను పసిగట్టి.. రంగా.. పారిపోవడం.. పక్కనే ఉన్న గోడ దూకుతుండగా.. లాగి చంపారని... అప్పట్లో చర్చ జరిగింది. వర్మ కథలో.. అవేవీ లేవు.
 
ఇలా కొన్నింటిని.. ఆయన లైట్‌గా తీసుకుని.. కథనాన్ని నడిపాడు. ఇక నెహ్రూ.. స్వతహాగా మంచివాడుగా.. చూపించే ప్రయత్నం వంగవీటి కథలో వర్మ చేశాడు. విజయవాడలో అప్పట్లో ఏం జరిగింది? అనేది అప్పటి తరానికి తెలియాలి. ఇప్పటి తరానికి పెద్దగా తెలీదు. అప్పటి వ్యక్తులు ఇంకా ఉన్నారు.. అవన్నీ యాజ్‌టీజ్‌గా రాస్తే.. సినిమా పెద్ద రాద్దాంతమే జరుగుతుంది. అవేవీలేకుండా.. సినిమాటిక్‌గా వర్మ తీశాడు. 
 
బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 
కొసమెరుపు:
రంగ హత్య వెనుక. ఎవరున్నారు? అనేది ఎవ్వరికీ తెలీదు. కేవలం అమ్మలు గన్న అమ్మకే తెలియాలి. ఆమె ఎలాగూ చెప్పలేదు. కళ్లు మూసుకునే వుంటుంది. నోరు లేనిదంటూ... ముగింపులో.. రంగా నిరాహార దీక్ష శిబిరానికి ఎదురుగా ఉన్న కనకదుర్గమ్మ గుడిని చూపిస్తూ ముగిస్తాడు. రహస్యం రహస్యమే.. దాన్ని శోధించే ప్రయత్నం చేసే బిల్డప్‌ను ఇచ్చిన వర్మ ధైర్యానికి మెచ్చుకుని.. మరోసారి ప్రేక్షకుల మైండ్‌తో ఆడుకునే వర్మ ఇందులో కన్పిస్తాడు. 
 
రేటింగ్‌.. 2.5/5

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments