Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్కటి మినహా "బాహుబలి 2" అత్యద్భుతం... విజువల్ వండర్... రేటింగ్ 5/5... సాహోరే రాజమౌళి.. (రివ్యూ)

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి... 'బాహుబలి'. ఈ రెండు పేర్లు గత ఐదేళ్ళుగా సినీ జనాల నోళ్ళలో నానుతున్న పేర్లు. ఈ ఐదేళ్ళ జర్నీకి శుక్రవారంతో తెరపడింది. బాహుబలి ది బిగినింగ్‌ సినిమా 2015లో విడుదల కాగా, ఈ చిత

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (06:18 IST)
చిత్రం : బాహుబలి - 2 ది కంక్లూజన్
నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌
సమర్పణ: కె.రాఘవేంద్రరావు
తారాగణం: ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్‌, నాజర్‌, రమ్యకృష్ణ , సుబ్బరాజు తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్‌
కథ: వి.విజయేంద్రప్రసాద్‌
వి.ఎఫ్‌.ఎక్స్‌: కమల్‌ కణ్ణన్‌
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని
దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి
 
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి... 'బాహుబలి'. ఈ రెండు పేర్లు గత ఐదేళ్ళుగా సినీ జనాల నోళ్ళలో నానుతున్న పేర్లు. ఈ ఐదేళ్ళ జర్నీకి శుక్రవారంతో తెరపడింది. బాహుబలి ది బిగినింగ్‌ సినిమా 2015లో విడుదల కాగా, ఈ చిత్రం కంక్లూజన్ (రెండో భాగం) నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్రం తొలి భాగం విడుదలైనప్పటి నుంచి ప్రతి సినీ అభిమాని మరచిపోలేని హైప్‌ను ఈ చిత్రం క్రియేట్ చేసింది. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇపుడు మరో అద్భుత దృశ్యకావ్యంగా నిలిచింది. 
 
ఈ చిత్రం తొలి భాగం విడుదలైనప్పటి మొదలు ఈ చిత్రం రెండో భాగం మొదటి పూర్తయ్యేంత వరకు అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న ప్రతి ఒక్కరి మెదళ్ళలో నానుతూ వచ్చింది. ఫలితంగా ఈ రెండేళ్లు అందరిలో క్యూరియాసిటినీ మరింత పెంచింది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాహుబలి 2' ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది.. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
 
కథ:
రెండేళ్ల క్రితం 'బాహుబలి' సాదాసీదా తెలుగు సినిమాగా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసింది. భారతదేశం గర్వించదగ్గ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 'బాహుబలి ది బిగినింగ్‌'కు కొనసాగింపుగా 'బాహుబలి 2' కథ ప్రారంభమవుతుంది. కాళకేయులపై గెలిచిన తర్వాత అమరేంద్ర బాహుబలిని మహారాజుగానూ, భళ్లాలదేవుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా  రాజమాత శివగామి ప్రకటిస్తుంది. 
 
కానీ, ఈ నిర్ణయం భళ్ళాళదేవుడుకి, బిజ్జలదేవుడుకి ఏమాత్రం రుచించదు. దీంతో మహిష్మతి సింహాసనాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. మరోవైపు మహారాజుగా పట్టాభిషేకం చేసేలోపు ప్రజల బాగోగులతో పాటు కష్టనష్టాలు తెలుసుకోవాలన్న భావించిన బాహుబలి, మామ కట్టప్పతో కలిసి దేశాటనకు బయలుదేరుతాడు. ఈ పర్యటనలో భాగంగా చిన్నరాజ్యమైన కుంతల దేశానికి తొలుత చేరుకుంటారు. అక్కడ దేవసేనను చూడగానే బాహుబలి ప్రేమలో పడిపోతాడు. 
 
ఆమె ప్రేమను దక్కించుకునేందుకు కుంతల దేశంలోనే మకాం వేస్తాడు. అదేసమయంలో దేవసేన అందం తెలివి తేటలు తెలుసుకున్న భళ్ళాలదేవుడు, దేవసేనను తనకు భార్యగా చేయమని శివగామిని కోరుతాడు. దీంతో శివగామి మాట ఇవ్వడమే కాకుండా, దేవసేనకు కానుకలు పంపుతుంది. అయితే బాహుబలిని ప్రేమిస్తున్న దేవసేన ఆమె కోరికను తిరస్కరించి ఆమె కోపానికి గురవుతుంది. 
 
ఈ క్రమంలో తన ప్రేమకు దేవసేన సమ్మతం తెలపడంతో ఆమెను బాహుబలి తన వెంట తీసుకుని మహిష్మతి రాజ్యానికి తిరిగొస్తాడు. అప్పటికే ఆగ్రహానికి గురైవున్న దేవసేనను చూడగానే రాజమాత మరింత ఆగ్రహం చెందుతుంది. ఆమెను మహిష్మతి రాజ్యంలోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు... రాజ్యం కావాలా? దేవసేన కావాలా? అని బాహుబలిని నిలదీస్తుంది. 
 
ఈ సంకట స్థితిలో దేవసేనకు ఇచ్చిన మాట ప్రకారం బాహుబలి ఆమెనే పెళ్లాడుతాడు. మహారాజు పదవిని వదులుకుని సర్వసైన్యాధ్యక్షుడుగా పదవిని అలంకరిస్తాడు. కానీ, ప్రజల్లో బాహుబలికి అపార గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు మాత్రం పెరిగిపోతుంటాయి. వీటిని జీర్ణించుకోలేని బిజ్జలదేవుడు, భళ్ళాలదేవుడు.. బాహుబలి గౌరవాన్ని తగ్గించాలనే ఆలోచనతో కుట్రలు చేసి సర్వసైన్యాధ్యక్ష పదవి నుండి తొలిగిస్తారు. 
 
పైగా, తనపై తనే హత్యాయత్నం చేసుకుని బాహుబలిపై శివగామికి అనుమానం వచ్చేలా చేసి ఆమె నోటితో బాహుబలిని చంపమని కట్టప్పకు ఆదేశం ఇచ్చేలా ప్రణాళిక చేస్తాడు. ఇంతకు బాహుబలిని కట్టప్ప చంపుతాడా? శివగామికి చివరకు నిజం ఎలా తెలుస్తుంది? తన తండ్రి గతం, గొప్పతనం గురించి తెలుసుకున్న శివుడు.. భళ్ళాలదేవుడుని ఎలా ఎదుర్కొంటాడు? తన తల్లి దేవసేనకు విముక్తి ఎలా కలిగిస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
 
నటీనటుల పాత్రలు... విశ్లేషణ:
ఈ చిత్రంలో నటించిన నటీనటుల విషయానికి వస్తే అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్‌ అద్భుతమైన నటనను కనపరిచాడు. భళ్ళాలదేవుడుగా రానా చూపిన పక్కా విలనిజం సినిమాకు పెద్ద హైలైట్‌ నిలిచింది. శివగామిగా రమ్యకృష్ణ పూర్తి పాత్ర మెప్పిస్తుంది. కట్టప్పగా సత్యరాజ్‌ తనదైన నటనతో మెప్పించాడు. ఈ చిత్రం మొదటి భాగంలో కొంత కామెడీకి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ... ఎమోషన్‌ సన్నివేశాల్లో, శివగామికి నిజాన్ని చెప్పే సందర్భంలో, బాహుబలిని చంపే సీన్‌లో నటీనటుల ప్రతిభ అద్భుతం. 
 
ఇక దేవసేనగా అనుష్క చాలా అందంగా కనిపించింది. నటనపరంగా కూడా మెప్పించింది. తమన్నా పాత్ర ఇందులో చాలా చిన్నది. భళ్ళాలదేవుడి తండ్రిగా బిజ్జలదేవుడు నాజర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సన్నివేశాలపరంగా చూస్తే ప్రతి సీన్‌ అద్భుతం. ప్రతి సీన్‌ను ఎమోషనల్‌గా డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కించిన విధానం చూసి ఆశ్చర్య పోవాల్సిందే. ముఖ్యంగా ప్రభాస్‌, అనుష్క మధ్య వచ్చే డ్యూయెట్‌ పాట, కుంతల దేశాన్ని పిండారిల భారీ నుంచి బాహుబలి కాపాడే సందర్భంలో ప్రతి సన్నివేశం ఎంతో గ్రాండియర్‌గా తెరకెక్కించారు. 
 
ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే తల్లి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎమోషనల్‌ సన్నివేశాలు, బాహుబలి చనిపోయే సీన్‌ ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి. రాజమౌళి ప్రతి సీన్‌ని హృద్యంగా తెరకెక్కించాడు. ఒకవిధంగా చెప్పాలంటే... తెలుగు సినిమాను తన విజన్‌తో ప్రపంచ స్థాయికి దర్శకుడు రాజమౌళి తీసుకెళ్ళాడు. కీరవాణి సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్. 'భళి భళిరా సాంగ్‌, దండాలయ్యా సాంగ్స్‌'తో పాటు మిగిలిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. 
 
ఇకపోతే... సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ ది బెస్ట్‌. ఇక కమల్‌ కణ్ణన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌లో నిలిపింది. ‘నువ్వు నా పక్కనుండేంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామ... సహా డైలాగ్స్‌ అన్నీ సందర్భానుసారం ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యుద్ధ సన్నివేశాలు.. ఆ సీన్స్‌ చూస్తుంటే తెలుగు సినిమా స్టాండర్డ్‌ను హాలీవుడ్‌ రేంజ్‌లో చేసినందుకు అభినందిచాల్సినిపించింది. సాబుశిరిల్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ ఇలా అన్నీ సినిమాను మరో రేంజ్‌లోనిలిపాయి. సినిమా లెంగ్త్‌ ఎక్కువ కావడం మినహా ఆకట్టుకునే విజువల్‌ వండర్‌.
 
చిత్ర బలాలు:
- బలమైన కథనం
- ప్రభాస్, రానా, అనుష్క, కట్టప్పల నటన
- ఎమోషనల్‌ డ్రామా
- సంగీతం
- బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
- సినిమాటోగ్రఫీ
- విఎఫెక్స్‌
బలహీనతలు:
- నిడివి ఎక్కువగా ఉండటం
 
రేటింగ్‌: 5/5
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌ను తాలిబన్ ఫైటర్లు ఆక్రమిస్తారా?

ఆ విమాన ప్రమాదానికి పక్షుల గుంపు ఢీకొనడం కారణం కాదా?

దేశగతిని మార్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ బడ్జెట్!!

Annamalai : కొరడాతో ఆరు సార్లు కొట్టుకున్న అన్నామలై.. చెప్పులు వేసుకోను.. ఎందుకు? (video)

హిట్, ఫ్లాప్స్‌తో పాటు వివాదాలకు తెరలేపిన 2024 తెలుగు సినిమా రంగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

తర్వాతి కథనం
Show comments