Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అఖిల్‌' తీసిన నితిన్... ఆ జువా ఏమిటో...? ఆ లవ్వేమిటో...? రివ్యూ రిపోర్ట్...

Webdunia
బుధవారం, 11 నవంబరు 2015 (20:47 IST)
అఖిల్ సినిమా నటీనటులు : అఖిల్‌, సయేషా సైగల్‌, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌, సప్తగిరి, జయప్రకాష్‌రెడ్డి, మహేష్‌ మంజ్రేకర్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు. టెక్నికల్‌: సంగీతం : అనూప్‌ రూబెన్స్‌, ఎస్‌ఎస్‌ తమన్‌, నిర్మాత : నితిన్‌, దర్శకత్వం : వివి వినాయక్‌
 
హీరోలుగా తెరగేంట్రం చేయడానికి తెలుగు ఫీల్డులో అందరూ వినాయక్‌నే ఆశ్రయిస్తారు. అంతగా ఆయన తమ వారసుడ్ని నిలబెడతాడని భావిస్తారు. అలాంటి ఆలోచనతోనే అక్కినేని మూడోతరం అఖిల్‌ను వినాయక్‌ చేతిలో పెట్టాడు అక్కినేని నాగార్జున. అప్పటికే ప్లాప్‌లో ఉన్న వినాయక్‌.. 'అల్లుడుశీను'తో ఏవరేజ్‌ లోకి తీర్చిదిద్దాడు. బాంబ్‌బ్లాస్ట్‌లు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అదిరిపాటుగా ఉండే దర్శకుడుగా పేరుపొందిన ఆయన లవర్‌బాయ్‌ ఇమేజ్‌ ఉన్న వాడిని మాస్‌ హీరో చేసే ప్రయత్నం చేశాడు. ఆ అంచనా కరెక్టా? కాదా? అనేది చూడాలంటే సినిమాలోకి వెళ్ళాల్సిందే.
 
కథ :
విశ్వంలో సూర్యుడు.. ఆయన వేడిని తట్టుకోవాలంటే అప్పటి రుషులు 'జువా' అనే పదార్థాన్ని తయారుచేస్తారు. అది బంతి ఆకారంలో వుంటుంది. దాన్ని భూమధ్యరేఖ మధ్య ప్రాంతమైన ఆఫ్రికాలో ఓజా అనే తెగ నివశించే ప్రాంతంలో ప్రతిష్టిస్తారు. అది ప్రతి సూర్యగ్రహణం రోజు తొలికిరణాలు దానిపై పడాలి. లేదంటే భూతాపం వేడెక్కి జీవం నశిస్తుంది. (ఇదంతా వాయిస్‌ ఓవర్‌ వస్తుంది). ఆ తర్వాత ఈ రహస్యాన్ని తెలుసుకుని... రష్యన్‌ సైంటిస్ట్‌ అయిన ఖత్రోచి ఆ జువాని దక్కించుకోవాలని చూస్తాడు. కానీ బోడో అనే అతను దానిని తీసుకెళ్ళి సీక్రెట్‌ ప్లేస్‌‌లో దాచి పెట్టేస్తాడు. వాడ్ని వెంటాడుతూ.. ఖత్రోచి గ్యాంగ్‌ ఖండఖండాలు తిరుగుతుంది.

ఇది ఒక కథయితే మరో కథ...  అఖిల్‌(అఖిల్‌) అనాధ. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో వీధి ఫైటింగ్‌లు చేస్తూ.. బెట్టింగ్‌లతో డబ్బు సంపాదిస్తుంటాడు. చదువు లేదు. తన స్నేహితుడి ప్రేమను తిరస్కరించిన దివ్య(సయేషా సైగల్‌)కు బుద్ధి చెప్పడానికి వచ్చి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. కానీ దివ్యకి అప్పటికే పెళ్లి సెటిల్‌ అయ్యి ఉంటుంది, కానీ దానిని అఖిల్‌ సీక్రెట్‌గా చెడగొట్టడంతో దివ్య కలత చెంది హైదరాబాద్‌ వదిలి స్పెయిన్‌ వెళ్ళిపోతుంది. దివ్యని వెతుక్కుంటూ స్పెయిన్‌ వెళ్ళిన అఖిల్‌ ఫైనల్‌గా దివ్యని ప్రేమలో పడేస్తాడు. ఆ తర్వాత అసలు విషయం అఖిల్‌ ఆమెకు చెప్పగానే రియాక్ట్‌ అయి.. చీదరించుకుంటుంది. ఇదే సమయంలో ఖత్రోచి గ్యాంగ్‌ వచ్చి దివ్యను కిడ్నాప్‌ చేస్తారు. ఇక హీరో.. తన హీరోయిజం చూపించి ఆమెను కాపాడతాడు. అసలు దివ్యను వారెందకు కిడ్నాప్‌ చేశారు? జువా అనే పదార్థానికి హీరోకు సంబంధం ఏమిటి? చివరికి హీరో ఎలాంటి ముగింపు ఇచ్చాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
పెర్‌ఫార్మెన్స్‌:
అఖిల్‌ మాటతీరు, మేనరిజం అంతా.. నాగార్జునను గుర్తుచేస్తుంది. చిన్నకుర్రాడు అయినా ఆ ఎనర్జీతో డాన్స్‌ బాగా చేశాడు. ఫైట్స్‌ చేశాడు. కానీ అదే సినిమాను కాపాడలేదు. సయేషా సైగల్‌ కూడా తొలి సినిమా గనుక ఆమెలో పెద్దగా నటన కన్పించదు. సయేషా డాన్సుల్లో చూపించిన ఈజ్‌ కొన్నిచోట్ల అఖిల్‌‌ని డామినేట్‌ చేస్తుంది. అఖిల్‌ ఫాదర్‌ పాత్రలో రాజేంద్రప్రసాద్‌ ఫర్వాలేదు. ఇక కమెడియన్స్‌‌గా కనిపించిన బ్రహ్మానందం, జయప్రకాశ్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, సప్తగిరిలు ఓకే ఓకే అనిపించేలా నవ్వించారు. మహేష్‌ మంజ్రేకర్‌ పాత్ర.. అంజి సినిమాలోని విలన్‌లా తలపిస్తుంది. ఇక మిగిలిన పాత్రలు.. ఆఫ్రికాలోని నటీనటులు నటించేశారు. 
 
సాంకేతిక విభాగం :
ఏవో చిన్న చిత్రాలు చేసుకునే వెలిగొండ శ్రీనివాస్‌ ఈ కథను ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ఎంచుకున్న జువా బ్యాక్‌‌డ్రాప్‌ స్టొరీ లైన్‌ కామన్‌మేన్‌కు కనెక్ట్‌ కాదు. కథ రొటీన్‌ అయినా కథనం బాగుంటే సరిపోయేది కానీ వినాయక్‌ రాసుకున్న కథనంలో ఆడియన్స్‌‌ని కథకి హుక్‌ చేసే సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ ఏమీ లేకపోవడం, ఉన్న జువా పాయింట్‌‌ని సినిమా మొదట్లోనే చెప్పేయడం సినిమాకి మరో పెద్ద మైనస్‌ అయ్యింది. వినాయక్‌ ఒక కమర్షియల్‌ డైరెక్టర్‌‌గా కొన్ని కమర్షియల్‌ అంశాలను మాత్రం పర్ఫెక్ట్‌‌గా చూపించాడని చెప్పాలి. అమోల్‌ రాథోడ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. స్పెయిన్‌‌లో, బ్యాంకాక్‌‌లో షూట్‌ చేసిన ప్రతి ఎపిసోడ్‌‌ని చాలా గ్రాండ్‌గా ఉండేలా చూపించాడు. ఇద్దరు సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్స్‌, తమన్‌ అందించిన పాటలు పర్వాలేదు. కానీ ఆ పాటలకి మంచి లొకేషన్స్‌, పిక్చరైజేషన్‌, అఖిల్‌ డాన్సులు తోడవడంతో సినిమాలో చూడటానికి చాలా చాలా బాగున్నాయి. ఇకపోతే మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని చాలా సీన్స్‌ ఆడియన్స్‌‌కి కనెక్ట్‌ అవ్వడానికి హెల్ప్‌ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌‌లో మ్యూజిక్‌ ఆడియన్స్‌‌ని పీక్స్‌‌కి తీసుకెళ్తుంది. గౌతంరాజు చాలావరకూ ఎడిట్‌ చేసి మనకు ట్రిమ్‌ వెర్షన్‌ అందించారు. ఎస్‌ఎస్‌ ప్రకాష్‌ ఆర్ట్‌ వర్క్‌ బాగుంది. కోన వెంకట్‌ డైలాగ్స్‌ ప్రాస కోసం పాకులాడాయి. ఇక చాలా ఖర్చు పెట్టి చేసిన సిజి వర్క్‌ అయితే ఆకట్టుకునేలా లేదు. ఫైనల్‌‌గా నితిన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ నిర్మాణ విలువలు కథాపరంగా బాగా రిచ్‌‌గా కనిపిస్తాయి.  
 
విశ్లేషణ: 
సినిమాకు కథ ముఖ్యం. ఆ తర్వాతే హీరో చేసే విన్యాసాలు. కానీ అఖిల్‌ సినిమాలో కథంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. ఎవ్వరికీ అర్థంకాని కాన్సెప్ట్‌లు.. ఎన్‌టిఆర్‌ శక్తి, అల్లు అర్జున్‌ బద్రినాథ్‌ చిత్రాలు కన్పిస్తాయి. అలాంటి కథనే వినాయక్‌ తీసుకుని దర్శకత్వం వహించడం ప్రధాన లోపం. ఏవో చిన్నాచితకా చిత్రాలు చేసుకుంటే పోయే వెలిగొండ కథను తీసుకుని అర్థంకాకుండా కేవలం దర్శకత్వం వహించడం వినాయక్‌ చేసిన తప్పిదం. దీనికోసం ఆఫ్రియా, ఇతర దేశాలన్నీ తిరిగి గ్రాండియర్‌గా తీసిన నిర్మాత నితిన్‌ను అభినందించాలి. నితిన్‌ హీరోగా చేసిన సినిమాల్లో అంతే గ్రాండియర్‌గా ఉన్నా కథతో పాటు కథనం.. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటల్తో మెప్పించేవాడు. కానీ ఇందులో అవేవీలేవు. కేవలం నాగార్జున తన కొడుకును గ్రాండ్‌గా లాంచ్‌ చేయాలనే ఆరాటం. కొడుకు డాన్స్‌లు, ఫైట్లు చూసి.. మరెవరైనా అతన్ని తీర్చిదిద్దుతాడనే సినిమా తీసినట్లుంది. 
 
దర్శకత్వం పరంగా వినాయక్‌ అప్‌డేట్‌ కాలేదనడానికి ఈ చిత్రం పెద్ద ఉదాహరణ. రొటీన్‌ తెలుగు సినిమా ఫార్మెట్‌లా హీరో కన్పిస్తే పాట, ఫైట్‌, సీరియస్‌ సీన్‌ తర్వాత మళ్ళీ పాట. కేవలం చిత్రమంతా హీరోనే కన్పించాలనే ఆతృత తప్పితే మిగిలిన పాత్రలకు సరైన న్యాయం లేకుండా పోయింది. హీరోయిన్‌ను పడేయాలంటే.. ఏవో అబద్ధాలు చెప్పడం మామూలే. జంతు ప్రేమికురాలిగా వున్న(అఖిల్‌ తల్లి గుర్తుకువస్తుంది) హీరోయిన్‌ పెంచుకున్న కుందేలు గుండె ఆపరేషన్‌ కోసం హీరో... రాజేంద్రప్రసాద్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసి చేయించడం వండర్‌ అన్నమాట. హీరోయిన్‌ ఛీ.. పో.. అన్నా... ఆమె కోసం.. స్పెయిన్‌ 2 లక్షల రూపాయలతో వచ్చేసి గ్రాండ్‌గా బతికేస్తుంటాడు. ఎక్కడా లాజిక్కు కన్పించదు. కోట్లతో ఇల్లీగల్‌ వ్యాపారాలు చేసే మహేష్‌ మంజేక్రర్‌, తన కూతురును వెన్నెల కిశోర్‌కు ఇచ్చి పెండ్లి చేయాలనుకోవడం దాన్ని హీరో గండి కొట్టడం కామెడీగా వుంటుంది. అసలు పవర్‌ ఆఫ్‌ జువా అనేది ఆఫ్రికాలోనే చాలామందికి తెలీదు. ఎక్కడ నుంచి రచయిత రాసుకున్నాడోకానీ అది ఇక్కడివారికి కనెక్ట్‌ కావడం చాలా కష్టం. ఇక కోన వెంకట్‌ ప్రాస కోసం పాకులాడి....ఏవేవో రాసేశాడు. వినడానికి బాగున్నా సినిమాకు ఉపయోగపడవు. అయితే ప్రతి నటుడు మొదటి సినిమాకే న్యాయం చేయలేడనే లాజిక్కుతో... తను డాన్స్‌, ఫైట్స్‌ బాగా చేశాడని తెలియచెప్పడానికి ఈ సినిమా చేశాడనేది కళ్ళకు కన్పిస్తున్న నిజం.
 
ఇక హీరోకు ఈ జువా గొడవేంటో తెలీదు. అనుకోకుండా అందులో ఇన్‌వాల్వ్‌ అవుతాడు. కిల్లర్‌ ఫిష్‌ నుంచి తప్పించుకునే ఎపిసోడ్‌, చివరిలో విమానంలో ఫైట్‌... బలవంతంగా పెట్టినట్లుంది. ఏవో సాహసాలు చేశాడనిపించాడు. ఇంటర్‌వెల్‌ వరకు కథ సాగదీశాడు. సెకండాఫ్‌లో అంతే సాగదీతతో శక్తి, బద్రినాథ్ చిత్రాల్లాగా ముగింపు ఇస్తాడు. సినిమా ఆలస్యానికి కారణమైన గ్రాఫిక్స్‌ కూడా చెప్పుకునే స్థాయిలో లేకపోవడం మరో మైనస్‌. సినిమాకి కీలకం అయిన మెయిన్‌ పాయింట్‌‌ని క్లైమాక్స్‌‌లో చాలా ఫాస్ట్‌‌గా హడావిడిగా ముగించడం అంతగా ఆకట్టుకోలేదు. వినాయక్‌ సినిమాల్లో నెగటివ్‌ రోల్‌ అనేది స్ట్రాంగ్‌‌గా ఉంటుంది. కానీ ఇందులో మాత్రం విలన్‌ రోల్‌ అనేదాన్ని పవర్ఫుల్‌‌గా చూపే ప్రయత్నమే చేయలేదు.
 
పైగా అక్కినేని... వంశం గురించి వచ్చే పాటలో నాగార్జున తళుక్కుమని మెరుస్తాడు. ఇదంతా అభిమానుల కోసం వారిని అలరించడానికి అర్థంపర్థంలేని సన్నివేశాలు, కథతో ముందుకు వచ్చిన అఖిల్‌ను ఆ అభిమానులే కాపాడాలి. 
 
రేటింగ్‌: 2/5
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

Mangalsutra for Love: 93 ఏళ్ల వయస్సులో భార్య కోసం మంగళసూత్రం వీడియో వైరల్

తిరుమ‌ల‌ భ‌క్తులకు గుడ్ న్యూస్: భక్తుల సౌక‌ర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

Show comments