ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్‍తో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్‌కు నివేదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశం తర్వాత నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఈరోజు మా అందరికీ సంతోషకరమైన రోజు. కులాసాగా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరాం. చంద్రబాబు, పవన్‌లకు సన్మానం చెయ్యడానికి సమయం అడిగాం. మనస్పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడాం. త్వరలో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వినతిపత్రం సమర్పిస్తాం అని చెప్పారు.