శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో చిత్ర విశేషాలను దర్శకుడు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి మీడియాతో పంచుకున్నారు.
కరోనా వల్ల ఈ సినిమా ఆలస్యం అయింది. మత్తు వదలరా సినిమాను చూసిన తరువాత ఈ కథకు ఆయనే సెట్ అవుతాడని అనిపించింది. ఇదొక కల్పిత కథ. నిజాంకి ఉంగరాల పిచ్చి ఉందని అంటారు. అందుకే హైద్రాబాద్ బ్యాక్ గ్రౌండ్‌ని ఎంచుకున్నాను. పూర్తిగా క్రైమ్ కామెడీ జానర్‌లోనే ఉంటుంది. స్ట్రెస్ బస్టర్ అయ్యేలా ఉంటుంది. కామెడీ చాలా బాగా వచ్చింది. అన్ని పాత్రలు నవ్విస్తాయి.
వర్షిణి ఓ ఫ్రస్టేటెడ్ అమ్మాయిలా కనిపిస్తుంది. ఆమెకంటూ ప్రత్యేకమైన కారెక్టరైజేషన్ ఉంటుంది. నేహా సోలంకి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ పాత్రలో నటించింది. శ్రీసింహాది అయితే దొంగనా కొడుకు లాంటి పాత్ర.
ఈ సినిమాలో అంతా పరిగెత్తడమే ఉంటుంది. అందుకే ఇలా టైటిల్ పెట్టాం. పరుగు, ధౌడ్ ఇలా చాలా టైటిల్స్ అనుకున్నాం. కానీ భాగ్ సాలే అనే టైటిల్ సౌండింగ్ బాగుందని పెట్టాం. అయితే సినిమాలో ఎక్కడా కూడా సాలే అనే పదాన్ని వాడలేదు. ఈ సినిమాలో అన్ని ప్రాంతాల యాసలుంటాయి. నందినీ రాయ్ పూర్తిగా తెలంగాణ స్లాంగ్‌లో ఉంటుంది.
కార్తికేయ 2 క్లైమాక్స్‌ను కాళ భైరవ చేస్తుంటే విన్నాను. అద్భుతంగా అనిపించింది. అందుకే ఈ సినిమాకు భైరవను పెట్టుకున్నాను. ఈ చిత్రానికి కనిపించని హీరో అతనే.
కరోనా నాకు ఎంతో సాయపడింది. ప్రపంచంలో ఎన్ని క్రైమ్ కామెడీలున్నాయో అన్నీ చూశాను. వాటి ప్రభావం నాపై పడింది. ఈ సినిమాను ఎక్కువగా లోకల్‌గానే షూట్ చేశాం. అలా లైవ్ లొకేషన్‌లో షూట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి.
రామకృష్ణ మాస్టర్ ఈ సినిమాకు యాక్షన్ సీన్లు కంపోజ్ చేశారు. ఇందులో నాలుగైదు ఫైటింగ్ సీక్వెన్స్‌లు ఉంటాయి.
సూర్యకాంతం సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లో కూడా బాగానే కలెక్షన్లను రాబట్టింది. ముద్ద పప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అయింది. సీక్వెల్ చేయమని ఆఫర్లు కూడా వచ్చాయి. ఎవ్వరూ చేయని టైంలో వెబ్ సిరీస్ చేసి హిట్ కొట్టాను.
ఒకే తరహా, జానర్ సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. నెక్ట్స్ స్పోర్ట్స్ జానర్‌లో సినిమా చేస్తాను. కథ పూర్తయింది. మిగతా వివరాలు త్వరలోనే చెబుతాను.
మాస్ డైరెక్టర్లు అందరికీ నచ్చుతారు. అందుకే నేను ఈ జానర్‌లో ఈ సినిమాను తీశాను. నెక్ట్స్ సినిమాలకు కూడా ఇది కాస్త హెల్ప్ అవుతుంది.
హీరోకు చెక్ ఇచ్చే సమయంలోనే కీరవాణి గారిని కలిశాను (నవ్వుతూ). కీరవాణి గారికి కథ కూడా తెలియదు. రాజమౌళి గారికి ఈ సినిమాను చూపించాలని అనుకున్నాం. ట్రైలర్ చూసిన తరువాత శ్రీసింహాకి రాజమౌళి గారు ఫోన్ చేసి.. హిట్ అయ్యేలా ఉంది కాస్త పుష్ చేయండి అని అన్నారట. అదే మాకు పెద్ద కాంప్లిమెంట్.
మా నిర్మాత అర్జున్ గారు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడలేదు. సినిమా బాగుంటే జనాలు చూస్తున్నారు. చిన్నదా పెద్దదా? అని ఆడియెన్స్ పట్టించుకోవడం లేదు. అదే మా నమ్మకం.