తాము నటించిన చిత్రాలను ప్రమోట్ చేసుకునే విషయంలో కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, విశ్వక్ సేన్‌లు ఎంతగానే శ్రమిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ యంగ్ హీరోలు తమ సినిమాలకు బజ్‌ను తీసుకువచ్చే ప్రయత్నంలో ఒకే ఫార్మాట్‌ను ఫాలో అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది.
ముందుగా 'క ' సినిమా విడుదల సందర్భంగా కిరణ్ అబ్బవరం ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డారు. గత సినిమాలు ఫ్లాప్ అవడంతో కొందరు తనను టార్గెట్ చేస్తున్నారని, తన లుక్‌పై, సినిమాలపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తనతో సమస్య ఏంటని, తాను సినిమాలు చేయకూడదా అంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ట్రోలింగ్ ఎంతో బాధ కలిగించిందని, హిట్స్ ప్లాప్స్ అందరి లైఫ్‌లో కామన్ అని, తనలాంటి వాడు సినిమాలు తీసి, దాన్ని థియేటర్ వరకు తీసుకురావటమే సక్సెస్ అంటూ పేర్కొన్నారు. 'క' సినిమాకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఇచ్చిన స్పీచ్ కిరణ్‌పై ఆడియన్స్‌లో కొంత సింపతీని క్రియేట్ చేసింది.
ఆ తర్వాత 'మట్కా' చిత్రం విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వరుణ్ తేజ్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబాయ్, పెదనాన్న తన గుండెల్లో ఉంటారని అందరూ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడతావు అని అడుగుతారని, కానీ వారి గురించి మాట్లాడటం తనకెంతో ఇష్టమని వరుణ్ తెలిపారు. లైఫ్‌లో నువ్వు పెద్దోడివి అవ్వొచ్చు అవ్వకపోవచ్చు.. కానీ నువ్వు ఎక్కడ మొదలుపెట్టావు.. నీ వెనుక సపోర్ట్ ఎవరు ఇచ్చారు అని నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదంటూ వరుణ్ చెప్పిన మాటలు బన్నీని ఉద్దేశించేనా అని చర్చ ఇండస్ట్రీలో సాగింది.
ఇక తాజాగా 'మెకానిక్ రాకీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ కూడా రివ్యూ రైటర్స్, ట్రోలర్స్‌ను టార్గెట్ చెస్తూ హాట్ కామెంట్స్ చేశారు. మీకే చెప్తున్నా.. మీరు నన్ను ఏమి పీకలేరు. నేను ఇలాగే మాట్లాడతా. ఇలాగే నా సినిమాని ప్రమోట్ చేసుకుంటా. నేనేమి తప్పు చెయ్యట్లేదు. సినిమాలు చేస్తున్నాము. నేను ట్రోల్ చేసిన వాళ్ళను, నా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను నేనేమి అనను. ఈ సినిమా తర్వాత క్రిటిక్స్, రివ్యూయర్స్, ట్రోలర్స్ గురించి మాట్లాడను. క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసినా ఏం కామెంట్ చేసినా ఫర్వాలేదు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దని కోరుతున్నా.
క్రిటిక్స్ రివ్యూస్ మాకు మంచి సినిమా చేయడానికి ఒక మోటివేషన్. పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ పర్సనల్ ఒపీనియన్‌పై మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఉంది. ఈ సినిమా తర్వాత రివ్యూస్ గురించి క్రిటిక్స్ గురించి నేను మాట్లాడను. మీరు స్వేచ్ఛగా రాసుకోవచ్చు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం మా పని. మీరు కూడా ఒక సినిమా గురించి రాస్తున్నప్పుడు బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. విశ్వక్ సేన్ వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.
ఇలా తమ సినిమాల విడుదలకు ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, సింపతీని గెయిన్ చేయటం ద్వారా సినిమాలకు బజ్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు యంగ్ హీరోలు చెస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. కానీ కుర్ర హీరోలు ఎంత హంగామా హడావుడి చేసినా.. సినిమాలో అంతో ఇంతో విషయం ఉంటూనే బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతాయనే విషయాన్ని ఎవరూ విస్మరించరాదు. ఈ విషయాన్ని అటు 'క', ఇటు 'మట్కా' సినిమాలు నిరూపించాయి. మరీ విశ్వక్ వివాదాస్పద వ్యాఖ్యలు అతని సినిమాకు ఏ మేరకు ఉపయోగపడాతాయనేది చూడాలి..!!