టాలీవుడ్ సోగ్గాడు, నటభూషణ శోభన్ బాబు 13వ వర్థంతి నేడు. సినిమాలకూ ఫ్యామిలీకి స్పష్టమైన గీత గీసిన నటుడు శోభన్ బాబు. నటనకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో నేర్పిన అందగాడు. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనాచలపతి రావు. 1937, జనవరి 14న కృష్ణా జిల్లా నందిగామలో జన్మించారు. కాలేజ్ డేస్‌లో ఏర్పడ్డ సినిమాలపై ప్రేమ ఆయన్ను మద్రాస్ రైలెక్కించింది.
'మల్లీశ్వరి' సినిమాను 20 సార్లు పైగా చూసి సినిమా యాక్టర్ కావాలనుకున్నారు. నటుడిగా ఆయన మొదటి సినిమా ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దైవబలం'. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలను అవకాశాలను అందిపుచ్చుకొని తెలుగులో అగ్ర హీరోగా ఎదిగారు. 'సీతారామకళ్యాణం', 'లవకుశ', 'నర్తనశాల' వంటి సినిమాల్లో సైడ్ కేరెక్టర్లు వేశారు శోభన్ బాబు. టైటిల్ కేరెక్టర్ పోషించిన 'వీరాభిమన్యు'తో నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది.
శోభన్ బాబు సోలో హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా 'లోగుట్టు పెరుమాళ్లకెరుక'.. తర్వాత వచ్చిన 'బంగారు పంజరం'కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. నేషనల్ లెవల్ క్లాసికల్ నటుడి అవార్డొచ్చింది. 'మనుషులు మారాలి'తో సరైన బ్రేక్ లభించింది. ఈ సినిమా తర్వాత శోభన్ బాబు వెనుదిరిగి చూసుకోలేదు.
శోభన్ బాబు- శారదలది.. క్రేజీ కాంబినేషన్.. 'శారద' నుంచి 'ఏవండీ ఆవిడొచ్చింది' వరకూ వీరి జోడీ జేజేలు కొట్టించుకుంది. ఆ తర్వాత శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, సుహాసినీ వంటి హీరోయిన్లతో కలసి ఎన్నో సూపర్ హిట్లిచ్చారు శోభన్ బాబు. 'కార్తీక దీపం' వంటి సినిమాలు మహిళా ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటాయి.
ఇటు క్లాస్ అటు మాస్.. చిత్రాల్లో నటించి అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు శోభన్ బాబు. 'మానవుడు- దానవుడు'తో మాస్ ఫాలోయింగ్ స్టార్టయింది. ఆ తర్వాత 'జగజ్జెట్టీలు', 'అడవిరాజు', 'కాళిదాసు', 'ప్రతీకారం' సినిమాలతో మాస్‌లోనూ మంచి ఇమేజ్ సాధించారు.
రాముడి పాత్రంటే ఎన్టీఆరే. కానీ బాపు డైరెక్షన్లో వచ్చిన 'సంపూర్ణ రామాయణం'తో శోభన్ బాబు కూడా ఆ పాత్రకు న్యాయం చేసారు. ఈ సినిమాకు ముందొచ్చిన 'బుద్ధిమంతుడు' ఆ తర్వాత తెరకెక్కిన 'కురుక్షేత్రం'లో కృష్ణుడి పాత్ర పోషించి మెప్పించారు కూడా. ఇక రామాయణంలో రాముడి పాత్రతో పాటు 'సీతారామ కళ్యాణం'లో లక్ష్మణుడిగా, 'లవకుశ'లో శతృఘ్నుడిగా ఇలా రామాయణంలో ముఖ్యమైన మూడు పాత్రలు పోషించిన నటుడిగా శోభన్ బాబు రికార్డులకు ఎక్కాడు.
Shoban Babu
ఆ తర్వాత సామాజిక నేపథ్యంలో తెరకెక్కిన 'ధర్మపీఠం దద్దరిల్లింది', 'దేవాలయం' సినిమాలు నటుడిగా శోభన్ బాబుకు మంచి పేరు తీసుకొచ్చాయి.తన యాక్టింగ్ స్కిల్స్‌తో అనేక అవార్డులూ రివార్డులూ అందుకున్నారు శోభన్ బాబు.ఐదుసార్లు నంది అవార్డులు, వరుసగా మూడు ఫిలింఫేర్లు అందుకుని రికార్డు క్రియేట్ చేశారు. దిలీప్ కుమార్ తర్వాత ఫిలింఫేర్ హాట్రిక్ సాధించింది శోభన్ బాబే.
శోభన్ బాబు తన ముప్పైఏళ్ల కెరీర్ లో మొత్తం 228 సినిమాల్లో నటించారు. 96లో రిలీజైన 'హలోగురు'తో నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. అప్పటి వరకూ ఏ నటుడూ పాటించన విధంగా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. శోభన్ బాబులో నటుడే కాదు.. చక్కటి మార్గదర్శి కూడా ఉన్నారు. భూముల డిమాండ్ పెరగడం గ్యారంటీ అని ఆయన ఇచ్చిన సలహా పాటించి కోటీశ్వరులైన వారున్నారు. తన ఫ్యామిలీ నుంచి ఎవరినీ సినిమా ఫీల్డ్ కు రానివ్వలేదాయన.
అంతటి ప్రొఫెషనల్ నటుడు శోభన్ బాబు. 2008 మార్చి 20న చెన్నైలో కన్నుమూశారు శోభన్ బాబు. ఆయన లేకున్నా ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శోభన్ బాబు.. మరలా 'జయలలిత' బయోపిక్ మూలంగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో శోభన్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు.
అలాగే సినిమాల్లో నటిస్తూ కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత షూటింగ్ స్పాట్‌లో వుండరు. ''ఆదివారాలు పని చేయను. మీకు ఇది ఇష్టమైతే నన్ను హీరోగా పెట్టుకోండి. లేకపోతే మరో హీరో దగ్గరకు వెళ్లండి" అంటూ నిక్కచ్చిగా చెప్పేవారు. ఆయన కండీషన్స్ ముందే ఒప్పుకొని సినిమా తీయడానికి నిర్మాతలు సిద్ధపడేవారు.
శోభన్‌బాబు దృష్టిలో స్టూడియో అనేది ఆఫీసు. షూటింగ్ ఉద్యోగం. సాయంత్రం ఆరు గంటలకు ఆఫీసు నుంచి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో గడిపేవారు. తాము రాణించిన రంగంలోనే వారసులు ఉండాలని ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రయత్నిస్తుంటారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా తన సంతానంలో ఎవరికీ సినిమా వాసన సోకకుండా దూరంగా పెంచారు శోభన్‌బాబు. హీరోగా తను అగ్రస్థానంలో ఉన్నా సినిమా వాతావరణాన్ని డ్రాయింగ్ రూమ్ దాటి ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదు.
shoban babu - jayalalithaa
హీరోగా శోభన్‌బాబు ఎంత గొప్పవారో ఇప్పుడు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందాల నటుడిగా, సోగ్గాడిగా, ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడుగా తనదైన అభినయాన్ని ఎన్నో చిత్రాల్లో ఆయన ప్రదర్శించారు.
ఆరోగ్య క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కావడంతో తనూ 90 ఏళ్లు బతుకుతానని శోభన్‌బాబు అంటుండేవారు. కానీ ఆయన ఆ మాట నిలబెట్టుకోకుండా, తన 71వ ఏట ఆకస్మికంగా వెళ్లిపోయి, అభిమానులకు వేదన మిగిల్చారు.