మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 2024లో విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ఒకటి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందునుంచి సన్నాహాలు చేశారు మేకర్స్.
అయితే ఐదు చిత్రాలు పండగకు రావడంతో థియేటర్స్ రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమ సంక్షేమాన్ని ద్రుష్టిలో పెట్టుకొని ఈగల్ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ఈ నేపధ్యంలో కొత్త రిలీజ్ డేట్ వెల్లడించారు. ఫిబ్రవరి 9న ఈగల్ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.
'మన తెలుగు సినిమా సంక్షేమం కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నాం. రావడంలో కొద్ది మార్పు, షాట్ & టార్గెట్ లో కాదు#ఈగల్ ఫిబ్రవరి 9, 2024 నుంచి'' అని మాస్ మహారాజా రవితేజ ట్వీట్ చేశారు
'ఈగల్ కొత్త రిలీజ్ డేట్‌ను తెలియజేస్తూ..'బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. మొండోడి మనసు పుట్ట తేనె. సంక్రాంతి బరి నుంచి ఈగల్‌ను ఫిబ్రవరికి తీసుకొచ్చాం. అందరూ చూడాల్సిన జనరంజక చిత్రం ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది. దర్శకుడు, టీమ్ పనిని ప్రేక్షకులు చూసి మెచ్చుకోవడానికి ఇరుకులేని వేదిక, సమయం కావాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నారు. మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్ కాదు అని ఓ పోస్ట్ లో తెలియజేశారు మేకర్స్.
ఈగల్ లో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ మరో కథానాయికగా నటిస్తుండగా.. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.
కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ & దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు. దావ్‌జాంద్ సంగీత సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.