పవన్ కళ్యాణ్ యువ దర్శకులలో ఒకరైన సుజీత్ తో ఒక భారీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. సుజీత్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 2022 లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొంది, ప్రతిష్టాత్మక ఆస్కార్స్ కి సైతం నామినేట్ అయిన 'ఆర్ఆర్ఆర్' వంటి సంచలన విజయం తర్వాత డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం (30-1-2023) జరిగింది.
పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ తో పాటు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏఎం రత్నం, దిల్ రాజు, డా. కె యల్. నారాయణ,కెఎల్ దామోదర ప్రసాద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, జెమిని కిరణ్, కృష్ణ, పీడీవీ ప్రసాద్, నిర్మాత కార్తికేయ, దర్శకులు హరీష్ శంకర్, శ్రీవాస్, వివేక్ ఆత్రేయ, కోనవెంకట్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, నర్రా శ్రీనివాస్ తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఉదయం 10:19 గంటలకు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అల్లు అరవింద్, దిల్ రాజు చేతుల మీదుగా చిత్ర దర్శక,నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు.
'రన్ రాజా రన్', 'సాహో' చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా సుజీత్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాను అందించడానికి సిద్ధమవుతున్నారు. భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ కెమెరా బాధ్యతలు చూడనుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ గా వ్యవహరించనున్నారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'భీమ్లా నాయక్'కి మ్యూజిక్ అందించిన ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోయే కథతో యాక్షన్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం మరియు అద్భుతమైన ఇతర సాంకేతిక వర్గం ప్రతిభ తోడై అటు యాక్షన్ ప్రియులకు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగలా ఉంటుందని డీవీవీ దానయ్య తెలిపారు. చిత్రానికి సంభందించి ఇతర తారాగణం, సాంకేతిక వర్గo ఇతర వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.