టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్. ఈమె బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అవేం ఫలించలేదు. దీంతో ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీకి స్వస్తి చెప్పి దక్షిణాది భాషలపైనే దృష్టి కేంద్రీకరించాలని భావించింది.
నిజానికి ఈ భామ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయింది. అయినప్పటికీ ఒక్క హిందీ చిత్రంలో కూడా నటించలేక పోయింది. దక్షిణాదిలో పలు బాషలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
ఈ నేపథ్యంలో 'ప్రాణ' అనే బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దీంతో ఈ చిత్రంలో నటించాలని ఆమె నిర్ణయం తీసుకుంది. ఏకకాలంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. కేవలం ఒకే ఒక్క పాత్రతో వీకే ప్రకాశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సామాజిక సమస్యలపై పోరాడే రచయిత్రిగా నిత్య కనిపించనున్నారు. 'ప్రాణ' చిత్రం హిందీలో కూడా రిలీజ్ అవ్వబోతోంది. హిందీలో ఇదే నా ఫస్ట్ సినిమా అవ్వనుంది అంటూ ప్రాణ మూవీ హిందీ పోస్టర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందం తెలియజేసింది.
థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇండియా టాప్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. లూయిజ్ బ్యాంక్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ యేడాది చివర్లో 'ప్రాణ' చిత్రం రిలీజ్ కానుంది.