నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `జెంటిల్‌మన్`. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. 'అష్టా చమ్మా' తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ''మా చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. డబ్బింగ్ పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెల 12న తొలి టీజర్‌ను, 22న పాటలను విడుదల చేస్తున్నాం. మణిశర్మ అద్భుతమైన స్వరాలను అందించారు. ఆయన స్వరపరచిన నాలుగు ప్రధాన పాటలు, టైటిల్ థీమ్ సాంగ్ మెప్పిస్తాయి. అందమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. అన్ని రకాల భావోద్వేగాలున్న చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది. హీరోనా,. విలనా అని టైటిల్ కింద పెట్టిన క్యాప్షన్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది'' అని అన్నారు.