టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై గత కొన్ని రోజలుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అస్వస్ధకు గురవ్వడం... హాస్పటల్లో జాయిన్ అయి చికిత్స తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న ఆయన యధావిధిగా తన కార్యక్రమాలు చేసుకుంటున్నారు.
అయినప్పటికీ తన ఆరోగ్యంపై వార్తలు వస్తుండడంతో హైదరాబాద్‌లో పోసాని మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. తన ఆరోగ్యం గురించి, ట్రీట్మెంట్ గురించి నిశితంగా వివరించారు. అంతేకాదు తనపై వస్తున్న వదంతులపై కూడా రియాక్ట్ అయ్యారు.
తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను పోసాని తీవ్రంగా ఖండించారు. "నేను పరిశ్రమలోకి అడుగుపెట్టి 33 సంవత్సరాలైంది. మే 13 నుంచి నా ఆరోగ్యం బాగులేదు. హెర్నియాతో బాధపడుతుంటే యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నాను. శస్త్ర చికిత్సలో ఇన్ఫెక్షన్ వల్ల రెండు నెలలు బాధపడ్డాను. నేను చనిపోతానేమోనని చాలా భయపడ్డాను. లండన్ నుంచి సకాలంలో వైద్యులు రావడం వల్ల బతికిపోయాను.
ఈ క్రమంలో నా ఆరోగ్యంపై సామాజిక మాద్యమాల్లో వదంతులు వ్యాపించాయి. పోసాని బతకడం కష్టమని వైరల్ చేశారు. నా ఆరోగ్యం బాగులేదంటే నాకు వేషాలు రావు. నేను ఇప్పటికి చాలా ఆరోగ్యంగా ఉన్నాను. డాక్టర్ ఎంవీరావు వల్లే నేను ఇప్పటికి బతికే ఉన్నాను. నేను ఇక చచ్చిపోను. రెండు నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను" అని పోసాని చెప్పుకొచ్చారు.