నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓప్రభంజనం. 'అఖండ' విజయాలకు చిరునామా నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్. రికార్డులు సృష్టించాలన్నా .. రికార్డులని తిరగరాయాలన్నా ఈ కాంబినేషన్ కే చెల్లింది. నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు సరికొత్త చరిత్రని సృష్టించాయి. ఒకటికిమించి మరొకటి అద్భుత విజయాన్ని సాధించాయి. సింహా, లెజెండ్, అఖండ.. ఈ మూడు చిత్రాలు బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్. అలాగే బాలకృష్ణ కెరీర్ హయ్యస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసిన చిత్రాలుగా నిలిచాయి. హ్యాట్రిక్ విజయంగా వచ్చిన 'అఖండ' తాజాగా 175రోజులు పూర్తి చేసుకొని బాలయ్య-బోయపాటి బ్లాక్ బస్టర్స్ ట్రిపుల్ సిల్వర్ జూబ్లీ కాంబినేషన్ గా చరిత్ర సృష్టించారు.
'సింహా'తో బాక్సాఫీసు వేట:
2010 ఏప్రిల్30 .. తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని రోజు.
'సింహాగా వెండితెరపై నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం చూపిన రోజు.
సింహా విడుదలై కనీవినీ ఎరుగని రికార్డులు సృష్టించిన రోజు.
బాలకృష్ణని ఎలా చూపించాలో, ఆయన పవర్ ఏంటో బోయపాటి శ్రీనుకి బాగా తెలుసు అని అందరితోనూ అనిపించేలా చేసి, సరికొత్త చరిత్ర సృష్టించి ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేసింది సింహ. ఈ చిత్రంలో శ్రీమన్నారాయణగా, డా. నరసింహగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం అద్వితీయం. బాలయ్య పలికిన పవర్ డైలాగ్స్ ఇప్పటికీ రింగ్ టోన్స్ గా మారుమ్రోగుతున్నాయి. ''చూడు ఒకవైపే చూడు .. రెండోవైపు చూడాలనుకోకు తట్టుకోలేవు.. మాడిపోతావ్''. చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్నామేమే'' లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ తో థియేటర్లు దద్దరిల్లాయి. ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు వైద్యం, ప్రజా ఆరోగ్యం గురించి అద్భుతమైన సందేశం 'సింహా' చిత్రం ద్వారా ఇచ్చారు బోయపాటి. సింహా ఆల్బమ్ మ్యూజికల్ హిట్ కూడా విశేష ఆదరణ పొందింది. ఈ చిత్రం 338 కేంద్రాల్లో 50 రోజులు, 92 కేంద్రాల్లో 100 రోజులు పండగని జరుపుకొని రికార్డ్ నెలకొల్పింది.
లెజండరీ విజయం:
సింహా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ -బోయపాటి కలయికలో వచ్చిన రెండో సినిమా లెజెండ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆ అంచనాల్ని మించి లెజండరీ విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలకృష్ణ -బోయపాటి. 2014 మార్చి 28న విడుదలైన లెజెండ్‌గా మరోసారి ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేసింది. సింహాలో బాలయ్య చెప్పిన "చరిత్ర సృష్టించాలన్నా.. దాన్ని తిరగరాయాలన్నామేమే'' అనే మాటని లెజండ్ తో నిరూపించింది. ఈ చిత్రంలో జయదేవ్ (లెజెండ్), కృష్ణ పాత్రల్లో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. బాలయ్య కెరీర్ లో అత్యధిక షేర్లు వసూళు చేసిన చిత్రంతో పాటు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది లెజండ్. సింహాకి మించి లెజెండ్ ని పవర్ ప్యాక్డ్ గా రూపొందించారు బోయపాటి. ''రాజకీయం నీవు తినే ఫుడ్ లో వుందేమో,.., నాకు బ్లడ్ లో వుందిరా బ్లడీ ఫూల్ ' ''.. నీవు భయపడితే భయపడటానికి ఓటర్ ని అనుకున్నావా.. షూటర్ ని.. కాల్చిపారేస్తా'' '' నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది''. ''సీటుకాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను'' 'వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్'' లెజెండ్ గా బాలయ్య పలికిన ఈ డైలాగ్స్ ప్రేక్షకులని, అభిమానులని ఉర్రూతలూగించాయి. అలాగే స్త్రీ ఔనత్యం, స్త్రీ సాధికారత గురించి 'లెజండ్' లో ఇచ్చిన సందేశం కూడా గొప్ప జనాధరణ పొందింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లెజెండ్ ని చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. నేపధ్య సంగీతం విశేషంగా ఆకట్టుకుంది. లెజండ్ 31 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 175 రోజులు పండగ జరుపుకుంది. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూర్ అర్చన థియేటర్ లో ఏకంగా 1000 రోజులు ప్రదర్శితమైన సరికొత్త చరిత్ర నెలకొల్పింది
'అఖండ' విజయం :
తెలుగు చిత్ర చరిత్రలో 'అఖండ' చిత్రానిది ఒక ప్రత్యేక ప్రభంజనం. కరోనాతో ఇండస్ట్రీకి కష్టం వచ్చింది. ప్రేక్షకులు మునపటిలా థియేటర్ కి రావడం తగ్గింది. ఇలాంటి పరిస్థితిలో ప్రేక్షకులని ఒక ఉప్పెనలా థియేటర్ రప్పించారు నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను. వీరి కలయికలో హ్యాట్రిక్ చిత్రంగా 2021 డిసెంబరు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ.. థియేటర్లు పూర్వ వైభవం తీసుకొచ్చింది. భం భం అఖండ.. అంటూ బాక్సాఫీసు వద్ద గర్జించారు బాలయ్య. ఏ, బీ, సీ..ఇలా సెంటర్ ఏదైనా, ఆంధ్రా, సీడెడ్, నైజాం. ఓవర్సీస్ .. ఏరియా ఏదైనా 'అఖండ' ప్రభంజనం సృష్టించింది. థియేటర్లకు కొత్త వెలుగును తీసుకొచ్చింది.
అఖండలో కూడా మురళీకృష్ణగా, శివుడుగా ద్విపాత్రాభినయం చేసి మరోసారి అభిమానులకు నటవిశ్వరూపం చూపించారు బాలకృష్ణ. ముఖ్యంగా అఘోర పాత్రలో నట తాండవం చేశారు బాలకృష్ణ.
''మీకు సమస్య వస్తే దణ్ణం పెడతారు. మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బొత్ ఆర్ నాట్ సేమ్'', ''గుంపులుగా వుండేవి మేకలు.. సింగల్ గా వచ్చేది పులి'' ''మేము ఎక్కడికైనా వస్తే తల దించుకోం.. తల తెంచుకొని వెళ్ళిపోతాం. ఒక మాట నువ్వంటే అది శబ్దం.. అదే మాట నేనంటే శాసనం.. దైవశాసనం'' శివుడిగా బాలయ్య పలికిన ఒక్కోడైలాగ్ శాసనంలా నిలిచిపోయింది. యాక్షన్స్ సీక్వెన్స్ లు గూస్ బంప్స్ తీసుకొచ్చాయి. అఖండలో దేవాలయాల సంరక్షణ, ప్రకృతి, ధర్మ పరిరక్షణ కోసం బోయపాటి ఇచ్చిన సందేశం అందరినీ ఆకట్టుకుంది. తమన్ నేపధ్య సంగీతంతో థియేటర్లు దద్దరిల్లాయి. బాలయ్య స్టామినా ఏమిటో తెలిసిన దర్శకుడిగా మరోసారి ప్రేక్షకులు, అభిమానులు, సెలబ్రిటీల మన్ననలు అందుకున్నారు బోయపాటి. ఒకటికి మించి మరొకటి అనే రీతిలో అఖండ తో సరికొత్త ఇండస్ట్రీ రికార్డులని నెలకొల్పారు బాలకృష్ణ-బోయపాటి. ఇప్పుడు అఖండ 175రోజుల పండగతో తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ట్రిపుల్ సిల్వర్ జూబ్లీ కాంబినేషన్ గా చరిత్ర సృష్టించారు.
కథని, పాత్రలని అద్భుతంగా మలిచి, పవర్ ఫుల్ కమర్శియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన సందేశాన్ని అందించే బాలకృష్ణ- బోయపాటి తిరుగులేని బ్లాక్ బస్టర్స్ కాంబినేషన్ కోసం మరోసారి ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బాలయ్య- బోయపాటి కలయికలో నాలుగువ విజయం అతి త్వరలోనే రావాలని ప్రేక్షకులు, అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.