Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరి ఆటకు వారసులున్నారు... ఇక ఆట ఆపితే బావుంటుందంటున్నారు..

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2013 (20:18 IST)
WD

క్రీడల్లో ఆటలాడడానికి వారసత్వం ఉన్నా.. అందులో రాణించాలంటే చాలా ప్రావీణ్యం కావాల్సి ఉంటుంది. అదే ఏదైనా వ్యాపారంలో తమ వారసులను పెట్టినా దానికి ఇంతో అంతో బిజనెస్‌ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యాపారం మీద ఆసక్తి కూడా ఉండాలి. మూడో రంగమైన కళారంగంలో.. అందులోనూ గ్లామర్‌ లాంటి సినిమా రంగంలో... ఎటువంటి వారైనా ఇట్టే ఎట్రాక్ట్‌ అవడానికి అవకాశముంది. అలా ఎట్రాక్ట్‌ అయి... తమ పెద్దల నుంచి వచ్చిన నటనా వారసత్వాన్ని వంశపారంపర్యంగా సాగిస్తున్న కుటుంబాలు బాలీవుడ్‌లో ఉన్నాయి. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో లేకపోలేదు.

గతంలో అగ్రనటులుగా పేరుపొందినవారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌. వీరు ఆ నలుగురు హీరోలుగా పేరుపొందారు. వీరందరికీ ఒక్కటే ఫార్ములా... ఒక్క చిరంజీవి తప్ప నటనను వారసత్వంగానూ పుణికి పుచ్చుకున్నవారే. ఇప్పుడు వారి కుమారులు వారి వేలు పట్టుకుని నడుస్తున్నారు. అయితే మరి ఇంకా వాళ్ళు నటించడంలో అర్థం ఉందా? లేదా? అనేది ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. హీరోలుగా తమ సత్తాను ఒకప్పుడు చూపించి.. ఇండస్ట్రీని శాసించిన వీరు వయస్సురీత్యా... ఆరు పదులకు దగ్గరల్లో ఉన్నవాళ్ళే. అయితే వీరు చేస్తున్న పాత్రలు హీరోలుగా చేయడంతో... ప్రేక్షకులు ఆదరిస్తున్నారో లేదో అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

చిరంజీవి గురించి చెప్పాలంటే.. వారసత్వం లేకపోయినా... ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్‌గా ఉండేవారు. ఆయనకు నాటకాలంటే ఇష్టం. తన హోదాలో ఉన్నప్పుడు తెలిసినవారు మదరాసులో ఉండగానే సినిమాల్లో చిన్నపాటి వేషాలు కూడా వేశారు. కెఎస్‌ఆర్‌దాస్‌ చిత్రంలో నటించారాయన. నెల్లూరులో ఉండటంతో చెన్నైకు దగ్గరగా ఉండటంతో సినిమా ప్రభావం పెద్దకొడుకు చిరంజీవిపై పడింది. క్రమేణా స్వయంకృషితో ఆయన పైకివచ్చి మెగాస్టార్‌గా ఎదిగాడు.

ఆ తర్వాత క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చి... పెద్ద పోస్టును కొట్టేశారనుకోండి. ఇప్పుడు సినిమాల్లో తన వంశాన్ని దించారు. చిరు తర్వాత ఆయన స్థానాన్ని పొందడానికి సోదరుడు పవన్‌ కళ్యాన్‌, కొడుకు రామ్‌ చరణ్ భుజాలపై వేసుకున్నారు. ఆటోమేటిక్‌గా... తన అభిమానులు.. తన వారసుల అభిమానులుగా మార్చేశారు.

WD

నందమూరి బాలకృష్ణ.... నటవారసత్వంగా పుణికిపుచ్చుకున్నవాడు ఈయన. తన తండ్రి ఎస్‌టిఆర్‌... హయాంలోనే బాలపాత్రలు వేసి.. యువకుడిగా హీరోగా నటించి తన సినీప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. మంగమ్మగారి మనవడు, ఆదిత్య 369, పాండురంగ మహాత్మ్యం వంటి భిన్నమైన చిత్రాల్లో నటించాడు. కానీ క్రమేణా ఆయన చిత్రాలకు అపజయాలు తప్పలేదు. వయస్సురీత్యా ఇంకా హీరోగా నటిస్తున్నా ఆ ఛాయలు ఫేస్‌లో కన్పించడంతో గ్లామర్‌లో ఉండాల్సిన గ్లో లేకపోవడంతో ఇక బాలకృష్ణ హీరోగా పనికిరాడేమోనని అభిమానుల్లో నెలకొంది.

ఎన్నో సంవత్సరాలుగా ఆయనకు హిట్‌ లేకపోవడంతో బోయపాటి శీను 'సింహా'తో ఒక్క హిట్‌ ఇచ్చాడు. మళ్ళీ చాలాకాలం లేదు. దాంతో ఆయనే మళ్ళీ హిట్‌ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. వీరిద్దరు కాంబినేషన్‌లో 'లెజెండ్‌' (ఇంకా పేరు పెట్టలేదు) చిత్రం రాబోతుంది. అయితే ఇందులో యువకుడిగానూ, పెద్దతరంగానూ నటిస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్ళడానికి బాట వేసుకున్నాడు. వియ్యంకుడు చంద్రబాబు పార్టీలో తనో కీలక పాత్ర పోషించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

WD
వెంకటేష్... ఇక వెంకటేష్‌ విషయానికి వస్తే నాన్న రామానాయుడు నుంచి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఆయన నిర్మాత అయినా... ఏదో పాత్రలో నటుడిగా ఆయన ప్రత్యక్షమయ్యేవాడు. ఎర్రగా బుర్రగా ఉండటంతో అప్పట్లోనే హీరోయిన్లు.. రామానాయుడుని హీరోగా నటించమని కోరుకునేవారు.

కానీ తను నిర్మాతగానే కొనసాగేవారు. కానీ ఏదో లోటు ఉందని గ్రహించి... అప్పటి హీరోలతో పడలేక కోట్లు పెట్టి వారిని ప్రమోట్‌ చేయడం ఇష్టంలేక.. తన వారసుడ్నే తీసుకుంటే బాగుంటుందని గ్రహించి.. ఎక్కడో అమెరికాలో బిజినెస్‌ కోర్సు చేస్తున్న వెంకటేష్‌ను పిలిపించి సినిమాలు తీయడం హిట్‌ కావడంతో.. విక్టరీ వెంకటేష్‌గా మారిపోయాడు.

అలా పలు చిత్రాల్లో నటిస్తూనే... చంటి... వంటి భిన్నమైన చిత్రాల్లోనూ రాణించాడు. ఇలా చేస్తూచేస్తూ.. కాలంతోపాటు మారిపోవడంతో.. హీరోగా చేయడం కుదరదని తెలిసి... పెళ్లికాని ప్రసాద్‌లాంటి పాత్రతో 'మల్లీశ్వరి'లో అలరించాడు. అప్పటి నుంచి సోలో హీరోగా చేయడం కష్టమేనంటూ చాలాసార్లు చెప్పినా.. మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చాడు. అదే మహేష్ బాబుతో కలిసి నటిస్తూ 'సీతమ్మ వాకిట్లో...' రాణించాడు. ఇప్పుడూ అదే బాటలో రామ్‌తో 'మసాలా' చేశాడు. త్వరలో విడుదల కానుంది. భవిష్యత్‌లోనూ మరో హీరోతో నటించనున్నాడు.

WD
నాగార్జున.... నటనను తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నుంచి తెచ్చుకున్నవాడే. తండ్రి ఎంతో కష్టపడి పైకి వచ్చినా నటుడిగా తెరంగేట్రం చేయడం వంశాలకు ఈజీ అయింది. అయినా... మొదట్లో.. ఇతనేంటి హీరో? అని పెదవి విరవిచనవారూ ఉన్నారు. విక్రమ్‌లో ఆయన్ను చూసి అంతా నవ్వుకున్నారు. ఎట్టకేలకు రామ్‌గోపాల్‌ వర్మ చేసిన ట్విస్ట్‌....'శివ'తో మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ... గీతాంజలి, మజ్ను, మాస్‌, బాస్‌, డాన్‌ అంటూ భాయ్ వరకూ పలు చిత్రాలు తీశాడు. యూత్‌ హీరోగా ఇప్పటికీ స్టెప్‌లేసి సినిమాలు తీయడంతో ఫ్యాన్స్‌ కూడా పెదవి విరుస్తున్నారు. ఆ విషయం తాజా చిత్రం 'భాయ్‌'లో కన్పించింది. వయస్సు మీదపడుతున్న ఛాయలు కన్పించడంతో స్టెప్‌లు వేగంగా వేయలేకపోవడం కన్పించింది.

వీరంతా... ప్రస్తుతం ఫేడవుట్‌ అవుతున్నారు. అందుకే వారంతా తమ వారసుల్ని ముందుకు తెస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి... పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌ను తెచ్చేశారు. వారితోపాటు అల్లు ఫ్యామిలీనే కాకుండా... చిరు మేనల్లుళ్లు ఇద్దరూ రంగంలోకి దిగారు. ఇక తమ్ముడు నాగబాబు వారసులు కూడా వస్తున్నారు. ఇక వెంకటేష్‌ వారసుడిగా రానా ఇప్పటికే తెరంగేట్రం చేసేశాడు.

మరో వారసుడు... అజయ్‌ అంటే డి.సురేష్‌బాబు రెండో కుమారుడుగా రాబోతున్నాడు. నాగార్జున పరిస్థితి కూడా అంతే. నాగచైతన్యను రంగంలోకి దింపాడు. అప్పటికే సుమంత్‌, సుశాంత్‌ వంటివారు కూడా వచ్చేశారు. త్వరలో అఖిల్‌ కూడా రంగప్రవేశం చేయనున్నాడు. ఇందుకు తగిన శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఇక బాలకృష్ణ వంశం నుంచి చాలామంది నటులు వచ్చినా జూ.ఎన్‌.టి.ఆర్‌.లా ఎవ్వరూ నిలవలేకపోతున్నారు. తారకరత్న, కళ్యాణ్‌రామ్‌లున్నా వారు అంతగా రాణించలేకపోతున్నారు.

WD
ఇండస్ట్రీలో ఉన్న అగ్రహీరోలు భవిష్యత్‌లో ఆచితూచి అడుగువేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇకపై హీరోలుగా నటించకుండానే.. మరో హీరోతో కలిసి నటించేలా హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇంకా ఎంతకాలం... ఇలాంటి మొహాలు చూడాలని ప్రజలు అనుకునే లోపలే వారు సన్నద్ధం కావాలని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే వారు అన్నలుగా, నాన్నలుగా నటించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

అదే హీరోయిన్‌ అయితే... పది చిత్రాలు చేయగానే ఆమెను చూడ్డానికి ఇష్టపడరు. కానీ హీరోలను బలవంతంగా ప్రేక్షకులపై రుద్దుతున్నారు. ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రముఖ నిర్మాత అన్నట్లు... క్రీడల్లో 400 మారథాన్‌ క్రీడ గురించి చెప్పుకోవాలి.. అక్కడ అందరూ పరుగెడుతూ అలసిపోయే తరుణంలో తన చేతిలోని స్టిక్‌ను మరో క్రీడాకారుడికి ఇచ్చి తను పక్కకు తప్పుకుంటాడు. ఇప్పుడు సినీ హీరోలు వారసత్వ స్టిక్‌ను తమ వారసులకు అందిస్తున్నారు. లక్కీగా వారికి తమ అభిమానులు ఎలాగూ ఉన్నారు. ఇదే వారి ఇమేజ్‌ను పెంచేలా చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments