తెలంగాణాలో నిరుద్యోగులకు మద్దతుగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షకు వై.ఎస్.ఆర్. టీపీ అధినేత షర్మిలా ఉపక్రమించారు. హైదరాబాదులో ఆమె చేస్తున్న నిరాహారదీక్షకు సంఘీభావంగా కొందరు మహిళలు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పార్లమెంటరీ కన్వీనర్ బొరుగు సంజీవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఏడేండ్లుగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని దౌర్భాగ్యమైన ప్రభుత్వమిదని టిఆర్ ఎస్ ను విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ప్రైవేటు రంగంలోనూ ఉపాధి కల్పించలేదని, మహిళలకు వడ్డీలేని రుణాల జాడలేదని విమర్శించారు.
నిరుద్యోగ భృతి పేరుతో యువతను దగా చేశారని, మ్యానుఫెస్టోలో పేర్కొన్న ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. నిరుద్యోగి మహేందర్ మృతికి వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జోహార్లు అర్పిస్తుందని చెప్పారు. అధికారం ఉందనే అహంకారంతో వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ ఫ్లెక్సీలను చింపేస్తున్నారని, చిన్న టెంట్లు వేసుకుని దీక్ష చేస్తుంటే, లా అండ్ ఆర్డర్ పేరుతో గొడవలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. దమ్ముంటే వైయఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారో, కేసీఆర్ ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారో చర్చకు రావాలన్నారు.