తెలంగాణ జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఇంత భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న జనం.. వరుణుడు ఇకనైనా శాంతిస్తే బాగుండునని వాపోతున్నారు.
కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు తగ్గుముఖం పట్టేలా కనిపించట్లేదు. రాష్ట్రంలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మరో 8 జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కరీంనగర్ జిల్లా రామడుగులోని గుంది ప్రాంతంలో అత్యధికంగా 20.8 సెం.మీ, చొప్పదండిలోని ఆర్నకొండ ప్రాంతంలో 20.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లా బోధన్ చిన్న మవందిలో 11.4 సెం.మీ వర్షపాతం నమోదైంది.