తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడగించారు. ఈ లాక్డౌన్ ఆదివారం అర్థరాత్రితో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పొడిగించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది. జూన్ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.
ఆదివారం వరకు రోజుకు 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇవ్వగా, ఆ సమయాన్ని మరో మూడు గంటల పాటు పొడిగించారు. ఇక ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఒంటి గంట నుంచి 2 గంటల వరకు ఇండ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్డౌన్‌ను అమలు చేయనున్నారు.
అంతకుముందు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 5 గంటల పాటు కొనసాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 7 గంటల దాకా కొనసాగింది.
ఐదు గంటల పాటు కొనసాగిన సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. లాక్డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది.
ఇక తెలంగాణలో కొత్తగా మరో 7 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు కేబినెట్ అనుమతించింది.
లాక్డౌన్ సడలింపు సమయాల్లో ఈ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగంపై కూడా కేబినెట్ చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.