మహిళలే కాకుండా టీనేజ్ అమ్మాయిలు.. చివరికి ముక్కుపచ్చలారని చిన్నారులపై కూడా అత్యాచారాల్లాంటి దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఒకవైపు ప్రేమించమని వేధించి.. అంగీకరించకపోతే.. దాడులకు పాల్పడే ఘటనలు జరుగుతుంటే.. మరోవైపు ప్రేమ వేధింపులకు తాళలేక యువతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని లక్ష్మీగూడ హౌజింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది.
ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. వేధించాడు. తరచూ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాడు. తల్లిదండ్రులకు చెప్పి మందలించినా ఫలితం లేదు. వీడొక్కడే కాదు.. ఆకతాయిలంతా ఆ యువతి వెంటపడ్డారు. దీంతో వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపం చెందిన బాలిక బలవన్మరణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. లక్ష్మీగూడ హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన షేర్‌సింగ్ యాదవ్ దంపతులు పువ్వుల వ్యాపారం చేస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. పెద్ద కుమార్తె గాయత్రి(16) శాంతినగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదేకాలనీకి చెందిన ఇద్దరు అబ్బాయిలు ఎనిమిది నెలల నుంచి తమను ప్రేమించాలంటూ గాయత్రి వెంటపడ్డారు. ఆమె కుదరదని చెప్పడంతో వేధింపులకు గురి చేశారు.
ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో రెండు నెలల క్రితం ఆ ఆకతాయిలను మందలించారు. అయినా వారి తీరు మారలేదు. మంగళవారం కూడా ఇదే తరహాలో ఆమెను వేధించడంతో మనస్తాపానికి గురైన గాయత్రి బుధవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం గణేశ్ నిమజ్జన సమయంలో గాయత్రిని వారిద్దరు వేధించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కాగా గాయత్రి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.