వేసవి సెలవులను ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉబలాటపడితే... ఎప్పుడూ బిజీగా పనిచేయటమేనా, శెలవుల్లోనయినా కాస్తంత విశ్రాంతిగా గడుపుదామని మరికొంత మంది ఆలోచిస్తారు. ఇలా ఆలోచించేవారికి సరైన హాలిడే స్పాట్ "వర్కల" సముద్ర తీరప్రాంతం.
కేరళ రాష్ట్రంలోని కోవలంకు వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో.. కొత్తగా ఈ వర్కల బీచ్‌ను కనుగొన్నారు. ఆరు సంవత్సరాల నుంచి మాత్రమే ఇక్కడికి పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
ఈ వర్కల సముద్ర తీరంలో "ల్యాండ్‌స్కేప్" పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సముద్ర తీరాన వరుసగా బారులు తీరిన కొండలు, వాటి శిఖరాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పైన స్పష్టమైన నీలాకాశం, కింద తెల్లటి ఇసుక తిన్నెలు, కొండలమీది ఎర్రటిమట్టి.. పసుపు, ఆకుపచ్చ రంగుల్లో వరిపొలాలు, పొడవాటి కొబ్బరిచెట్లతో... ప్రకృతి అందాలకు ప్రతీకల్లా అలసి సొలసిన మనసులను సేదదీరుస్తాయి.
" ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు" అంటూ ప్రబోధించిన కేరళ సమాజ సేవకుడు, ఆధ్యాత్మిక గురువు శ్రీ నారాయణ గురు సమాధి అయిన "శివగిరి మఠ్" వర్కల వద్దే కలదు. వర్కల పట్టణానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం, షోర్నూర్ నదీ తీరంలో ఈ మఠాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం శివగిరి మఠ్‌ను వేలాదిమంది హిందువులు దర్శిస్తుంటారు.
అలాగే... శివగిరి మఠానికి వచ్చిన ఎవరయినా సరే.. వర్కల సముద్ర తీరంలో ఉండే జనార్ధన స్వామి ఆలయాన్ని దర్శించకుండా తిరిగివెళ్లరు. అంతర్జాతీయంగా వర్కల సముద్ర తీరానికి గుర్తింపు రాకముందే ఇక్కడి బీచ్ పాపనాశం పేరుతో స్థానిక ప్రజానీకం బాగానే తెలుసు. వీరు "కరిక్కిడకవవు" పేరుతో మరణించినవారికి చేసే పూజలు ఈ పవిత్ర సముద్రంలోనే చేసేవారు.
ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొంది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న వర్కల సముద్ర తీరానికి ఎలా వెళ్లాలంటే... కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి రోడ్డు మార్గం ద్వారా గంట సేపట్లో చేరుకోవచ్చు. అయితే... ఫోర్ స్టార్ హోటల్, కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న టూరిస్ట్ బంగ్లా మినహాయిస్తే ఇక్కడ పర్యాటకులకు వసతి సౌకర్యాలు మాత్రం తక్కువగానే ఉంటాయి.