వార్త : అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా అన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సవాలుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రజారాజ్యం పార్టీ నేత, మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి అన్నారు.
చెవాకు : గతంలో ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు చూసిన వారికి ఈ సవాళ్లలో పస ఏమీ ఉందనే విషయం బాగానే తెలిసుంటుంది. బహిరంగ చర్చలోనూ ఎవరి వాదనను వారు చెప్పడం మినహా ప్రజలకు ఒరిగేదేముంటుంది.
అదేదో ఎవరికి వారుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని, తమ వాదనలను చెబుతూ ఉంటే తుది తీర్పును ప్రజలే చెప్పగలరు. అందుకు బదులు ఈ చర్చలు, బహిరంగ సవాళ్ల వంటి గొడవలు ఎందుకు? ఎన్నికలు దగ్గరికొచ్చే కొద్దీ ఇలాంటి సవాళ్లు వస్తుంటాయి.
ప్రత్యర్థుల వ్యూహంలో ఇదీ భాగమేనని గ్రహిస్తే మంచిది. ప్రతి విషయానికి స్పందిస్తూ పోతూ ఉంటే లక్ష్యం దారి తప్పిపోతుందని తెలుసుకోండి. ఈ విషయాన్ని రాజకీయ అనుభవం లేదని చెబుతున్న చిరంజీవి గ్రహించినా మీరెందుకు గ్రహించలేకపోయారో అర్థం కావడం లేదు.