Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ కాశీ "ద్రాక్షారామం" మహిమాన్వితం...!

Webdunia
FILE
నిత్యం "ఓం నమ: శివాయ" అంటూ శివ నామస్మరణతో ప్రతిధ్వనించే పవిత్ర ధామం "ద్రాక్షారామం". "కాశీకి సమానమైన క్షేత్రమే ద్రాక్షారామమని" సాక్షాత్తూ అన్నపూర్ణాదేవి వ్యాస మహర్షితో అన్నట్లు పురాణేతిహాసాల్లో చెప్పబడింది. అందుకే దక్షిణ కాశీగా.. అఖిలాండకోటి భక్తుల కల్పతరువుగా... అలరారుతోంది ద్రాక్షారామ భీమేశ్వరాలయం.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన శైవ క్షేత్రాలలో ఒకటిగా భక్తుల నీరాజనాలను అందుకుంటున్న ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలోని భీమేశ్వరుడు స్వయంభువు. ఈ ఆలయాన్ని 1100 సంవత్సరాల క్రితం నిర్మించినా.. అంతకుముందే భీమేశ్వరుడు ఇక్కడ వెలశారనీ ప్రతీతి. ఆ రోజుల్లో సుప్రసిద్ధ ఆలయంగా ప్రసిద్ధి చెందటంతోపాటు.. చాళుక్యుల శిల్పకళా రీతికి అద్దంపట్టే అద్భుత చారిత్రక కట్టడంగా పేరుగాంచింది.

ఆలయ చరిత్ర విషయానికి వస్తే... వ్యాస మహర్షిని పరీక్షించేందుకు కాశీ విశ్వేశ్వరుడు.. వ్యాసుడికి, ఆయన శిష్యులకి కాశీలో భిక్షం దొరకకుండా చేశాడు. దాంతో వ్యాసుడు ఆగ్రహించి కాశీని శపించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ముత్తయిదువులాగా వచ్చి.. వ్యాసుడికి, ఆయన శిష్యబృందానికి బిక్షం పెట్టింది. కాశీని శపించేందుకు సిద్ధమైన వ్యాసుడిపై కోపగించుకున్న విశ్వేశ్వరుడు.. కాశీలో భోగులకు స్థానం లేదనీ, పట్టణాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించాడు.
సూర్యుడిచే అభిషేకం...!
స్వయంభువుగా వెలసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేశాడట. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్య కిరణాలు భీమైశ్వరుడిపై ప్రసరిస్తుంటాయి...


దీంతో విశ్వేశ్వరుడి ఆగ్రహానికి గురైన వ్యాసుడు విపరీతంగా రోదిస్తుండగా.. "ద్రాక్షారామం వెళ్ళి అక్కడ భీమేశ్వరుడిని సేవిస్తే.. నీకు ఇహములో భోగము, పరములో మోక్షం కలుగుతుందని" ఓదార్చింది అన్నపూర్ణాదేవి. ఆమె ఆజ్ఞతో వ్యాసుడు ద్రాక్షారామం వెళ్లి భీమేశ్వర స్వామిని, మాణిక్యాంబను దర్శించుకుని.. "దక్షిణ కాశీ"గా నామకరణం చేశాడని ప్రతీతి.

ఈ ఆలయంలో భీమేశ్వరుడు స్ఫటిక లింగాకారుడై 15 అడుగులు ఎత్తుతో ఉండటం విశేషంగా చెప్పవచ్చు. స్వయంభువుగా వెలసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేశాడట. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్య కిరణాలు భీమైశ్వరుడిపై ప్రసరిస్తుంటాయి. ప్రధానాలయం రెండు అంతస్థులుగా ఉంటుంది. చీకటిగా ఉండే మొదటి అంతస్తులో భక్తులు ప్రదక్షిణలు చేస్తూ, రెండో అంతస్థులో భీమేశ్వరుడిని దర్శించి పూజలు నిర్వహిస్తుంటారు. మహా శివరాత్రి పర్వదినం ఇక్కడ కన్నుల పండువగా జరుగుతుంది.

FILE
పంచారామాల్లో ఒకటిగానూ, జ్యోతిర్లింగాలలో ఆఖరిదిగానూ చెప్పబడే ద్రాక్షారామం భీమేశ్వరాలయం... చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. అష్టాదశ పీఠాల్లో ఎక్కడా జరగని విధంగా ఏకకాలంలో అమ్మవారికి శ్రీచక్రార్చన జరగటం ఈ క్షేత్రం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 9వ శతాబ్దంలో.. తూర్పు చాళుక్య రాజయిన చాళుక్య భీముడు 892-922 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించాడు. ద్రవిడ శిల్పకళా వైభవానికి అద్దంపట్టే నిర్మాణాలు ఈ ఆలయంలో కనువిందు చేస్తుంటాయి.

ఆలయం లోపల కాలభైరవాలయం, త్రికూటాలయం అనే మండపాలు ఉన్నాయి. రాతి స్తంభాలతో నిర్మించిన రెండంతస్తుల మేడ మండపం ఇక్కడి ప్రత్యేకత. ప్రధానాలయం వాయువ్య దిశగా ఊయల మండపం, ఆగ్నేయ భాగంలో వసంత మండపం ఉన్నాయి. ఆలయ ముఖ మండపంలో కొలువుదీరిన నందీశ్వరుడి భారీ విగ్రహం చాళుక్య శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

అలాగే భీమేశ్వరాలయం తూర్పు భాగంలో ఉన్న సప్త గోదావరి నదికి విశిష్ట ప్రాచుర్యం ఉంది. ఆలయ ప్రాంతంలోనే సప్త మహర్షులు తపస్సు చేశారనీ.. అందుకే ఇక్కడి నుంచి గోదావరీ నదీమతల్లి ఏడుపాయలుగా చీలిందని స్థానికుల కథనం. సప్తర్షులైన భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని పేర్లతో ఉపనదులు అంతర్వాహినులుగా ప్రవహించి సప్త గోదావరి పుష్కరిణిగా వెలసిందట. అందుకే ఈ సప్త గోదావరీ పుష్కరిణిలో స్నానమాచరించి భీమేశ్వరుడిని దర్శిస్తే.. సర్వ పాపాలు తొలగిపోయి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 52, కాకినాడకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్షారామం భీమేశ్వర ఆలయానికి.. కాకినాడ, రాజమండ్రి, సామర్ల కోటల నుంచి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. రామచంద్రాపురం పట్టణానికి ఈ క్షేత్రం కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడి నుంచి బస్సుల్లోనూ, ఆటోలు, ప్రైవేటు వాహనాల్లోనూ వెళ్లి ఆలయాన్ని సందర్శించవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

Show comments