దేశంలోని ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో అహ్మదాబాద్‌లోని జగన్నాథ ఆలయం ఒకటి. ఇది పేరు ప్రఖ్యాతలకే కాకుండా.. సంపన్నతకు, అలంకారానికి, ఆధునికతకు ప్రత్యేక స్థానం ఉంది. అహ్మదాబాద్ నగరంలోని జమల్‌పూర్ అనే ప్రాంతంలో వెలసి వున్న ఈ ఆలయం ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇలా.. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఆలయాన్ని ఈ వారం తీర్థయాత్రలో మీకు పరిచయం చేస్తున్నాం.
సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. నర్సింగ దాస్‌జీ అనే సాధువుకు జగన్నాథుడు కలలో కనిపించి, తనకు, తన సోదరుడు బల్దేవ్, సోదరి సుభద్రలకు కలిసి ఒక ఆలయాన్ని నిర్మించాల్సిందిగా చెప్పాడట. ఈ విషయాన్ని సాధవు ఆ గ్రామ ప్రజలకు వివరించాడు. దీంతో గ్రామ ప్రజలు అత్యంత ఉత్సాహంతో, ఆనందోత్సవాల మధ్య ఆలయ నిర్మాణ పనుల్లో పాలుపంచుకోవడంతో జగన్నాథ ఆలయం నిర్మితమైంది.
ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత జగన్నాథుడు కొలువు దీరాడు. అప్పటి నుంచి ఆ గ్రామ ప్రాంత ప్రజల్లో సుఖ శాంతులు వెల్లివిరిశాయి. ఇక్కడకు వచ్చే భక్తులను అమితంగా ఆకర్షిస్తూ.. మంత్రముగ్ధులను చేసే విధంగా ఆలయంలో జగన్నాథుడు, బల్దేవుడు, సుభద్ర విగ్రహాలను ప్రతిష్టించారు. 1878 సంవత్సరంలో నిర్మితమైనది మొదలుకుని.. ఆలయంలో భక్తిభావం ఉట్టిపడుతోంది.
File
FILE
ఇలా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని ఎంతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆలయానికి వచ్చి పూజలు, ప్రార్థనలు చేయడం ఇక్కడ గమనిస్తాం. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడకు వస్తుంటారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటం వల్ల ఆలయానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు దైవ దర్శనం చేసుకుని, తమ కష్టాలను చెప్పుకున్నట్టయితే అవి తీరుతాయనే భావన భక్తుల్లో ఉంది.
ఈ ప్రఖ్యాత పుణ్యస్థలానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయానికి చెందిన 'సదావార్త' అనే ఛారిటబుల్ సంస్థ జగన్నాథుని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులకు అన్నదానం చేస్తోంది. సాధువు నర్సింగ దాస్ ఆజ్ఞ మేరకు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఇక్కడకు ప్రతినిత్యం వచ్చే వందలాది మంది భక్తులకు అన్నదానం పథకం కింద పుష్టిగా ఆరగిస్తున్నారు.
ఎలా వెళ్లాలి విమాన మార్గం.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి పలు వాహనాలు ఆలయం వరకు అద్దెకు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం... అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని కలుపూర్ రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. అంతేకాకుండా మణినగర్, శబర్మతీ రైల్వే స్టేషన్‌ల నుంచి కూడా ఆలయానికి వెళ్ళవచ్చు. రోడ్డు మార్గం.. అహ్మదాబాద్‌తో పాటు ప్రధాన నగరాల నుంచి జగన్నాథ్ ఆలయానికి బస్సు, టాక్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.