Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామరావణ యుద్ధం : భర్తను కోల్పోయిన స్త్రీ ఎక్కితే పుష్పక విమానము ఎగరదా?

Webdunia
శనివారం, 14 మే 2016 (17:49 IST)
రాముడు హనుమంతుని కౌగిలించుకున్న తర్వాత లంకాపట్టణపు విశేషాలను అడిగి తెలుసుకొనెను. హనుమంతుడు లంకా పట్టణం గురించి, సీతజాడ, ఆమెవున్న పరిస్థితులను వివరిస్తూ ఉండగా, రాముడు శోకసముద్రంలో మునిగిపోయెను. సీతను తలచుకొని ఎంతో దుఃఖపూరితుడవుతాడు. రాముడికి సుగ్రీవుడు తన మాటలతో ధైర్యం చెప్పెను. సీత ఎక్కడ వున్నా, ఎట్టి పరిస్థితులలో వున్నా తీసుకునివచ్చి అప్పగిస్తానని, తన వానర సైన్యం అంతా రావణుడితో యుద్ధం చేయటానికి బయలుదేరుతుందని వాగ్దానం చేసెను. ఆ మాటలకు రాముడు కొంత ఉపశమనము పొంది హనుమంతుడు చెప్పినట్లు సముద్రపు ఒడ్డుకు చేరుకుని అక్కడ బస చేసెను.
 
రాముడు వానరసైన్యంతో సముద్రపు ఒడ్డుచేరుకున్నాడు అన్న విషయం రావణుడికి తెలిసి తనతో వున్న రాక్షసులతో రాముణ్మి ఎలాగైనా చంపాలని ఆలోచన చేసెను. రాక్షసులందరూ కలిసి రావణుడికి విపరీతమైన ఆశతలు కల్పించి విజయం మనదే నీవు ఏమాత్రము దిగులు చెందవలసిన అవసరం లేదని చెప్పారు. తర్వాత నల్లని మేఘముతో సమానుడు, శూరుడు, సేనాపతి అయిన ప్రహస్తుడు కూడా రాక్షసులతో కలిసి ''రావణా! సీతాపహరణవలన నీకు ఎటువంటి ఆపద రాకుండా చూసుకునే బాధ్యత నాది నీకు ఎటువంటి దుఃఖము కలుగదు''అని చెప్పెను. దుర్ముఖుడు, వజ్రదంష్ట్రుడు, నికుంభడు, వజ్రహనువు మరియు ఎంతోమంది రాక్షసులు కోపంతో రామలక్ష్మణులను, సుగ్రీవ హనుమంతులను వానరసైన్యమంతటిని హతమార్చేస్తామని రావణుకుని చెప్పారు.
 
విభీషణుడు వారినందరిని నివారించి రావణునకు నీతిబోధించెను. ఆ నీతి వాక్యములను వినక రావణుడు తన గృహములోనికి వెళ్ళిపోయెను. మరల విభీషణుడు రావణాసురుని ఇంటికి వెళ్ళి చెడు శకునములను గురించి, అలాగే రాముడి బలం గురించి, సీత పాతివ్రత్యాన్ని గురించి వివరించి సీతను రామునకు అప్పగించమని రావణునికి హితబోధ చేసెను. అప్పుడు ఇంద్రజిత్తు విభీషణుని అధిక్షేపించి అతనిని నిందించెను. విభీషణునిపై కోపంతో రావణుడు విభీషణుని తిరస్కరించి వేచెను. ధర్మాన్ని తెలుసుకొనలేనివాడు ధర్మాన్ని పాటించనివాడు అయిన రాజు వద్ద ఉండకూడదు అని నిర్ణయించుకుని లంకను వదిలి వెళ్లిపోవుటకు బయలుదేరెను. 
 
లంకను వదిలి రాముని వద్దకు వెళ్లి ఆశ్రయాన్ని కోరుతాడు విభీషణుడు. రాముడు మంత్రులతో విచారించి, ధర్మము ఎరిగినవాడు, నీతిమంతుడు తెలివైన వాడు అయిన విభీషణుని స్నేహమును అంగీకరించెను. రావణాసురుని గూఢచారి కంగారుపడుచు శుకుడను రాక్షసుని, సుగ్రీవుని వద్దకు దూతగా పంపెను. శుకుడు ఆకాశంలో పక్షిరూపంలో ఎగురుతూ సుగ్రీవుని వద్దకు వెళ్ళి రావణుడు చెప్పినట్లుగా ఇలా చెప్పెను. 
 
"మహారాజా! నీవు ఉత్తమకులంలో పుట్టినావు. బలవంతుడు. నీకు ఈ యుద్ధమువలన ఏ లాభమూ లేదు. నష్టమూ లేదు. నీవు నోకు సోదరునివంటి వాడవు. నేను రాముని భార్యను హరించనచో దానితో నీకేమి సంబంధము. నీవు తిరిగి కిష్కింధకు వెళ్ళిపొమ్ము'' శుకుడు అలా చెబుతుండగానే వానరులు గాలిలోకి ఎగరి అతని రెక్కలు పట్టుకుని నేలమీదకు దింపారు. అప్పుడు రాముడు వానరులను పిలిచి అటువంటి పనులు చేయరాదని నివారించెను. ''దూత యజమాని చెప్పినట్లుగా చెప్పి సంధికి వచ్చినప్పుడు అతనిని హింసించుట చంపుట ధర్మము కాదు. కాని యజమాని చెప్పినట్లుగాక, దూత తను కల్పించుకొని వున్నవి లేనివి కలిపి వార్తలను, విషయములను చెప్పినప్పుడు మాత్రమే అతనిని శిక్షించవచ్చును'' అని రాముడు దూత ధర్మమును చెప్పెను. 
 
రాముడు మూడు రోజులు సముద్రపు ఒడ్డున పూజలు చేసి, సహాయము కోరుతూ సముద్రమునకు నమస్కరించెను. కాని సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. రామునకు కోపం వచ్చి సముద్రునిపైకి బాణము వదిలెను. దానికి గజగజ వణికిపోతూ సముద్రుడు రామునకు ప్రత్యక్షమై, లంకకు పోవుటకు వారధి నిర్మించుటకు సహాయపడెను. వెయ్యికోట్ల మంది వానరులతో కలిసి నీలుడు సముద్రముపైన వంతెన నిర్మించి దానిమీదుగా లంకకు చేరెను. రావణుడు శుకసారణులను గూఢచారులుగా వానరసేనలోకి పంపగా విభీషణుడు వాళ్లను గుర్తించి రాముని వద్దకు తీసుకుని పోయెను. రాముడు వాళ్ళిద్దరిని విడిపించి తిరిగి లంకకు పోయి రావణునికి తన బలపరాక్రమములు తెలుపమని పంపెను. 
 
అప్పటికే భయంతో వణికిపోతున్న శుకసారణులు ధర్మమునందు ప్రేమగల రాముణ్ణి జయ విజయీభవ అని అరుచుకుంటూ లంకకి చేరి రావణునికి జరిగిన దంతయు వివరించారు. ఆ తర్వాత సీతను రామునకు ఇచ్చి వేయుడు. రాముడు చాలా బలపరాక్రమములు కలిగినవాడు అని రాముని గురించి, అతని సైన్యం గురించి రావణునికి వివరించారు. చారుల మాటలు విన్న రావణుడు తనకోటపైకి ఎక్కి వానరసైన్యమును చూసెను. సారుణుని ద్వారా వానరసైన్యంలోని ముఖ్యులైన నీలుడు, అంగదుడు, శ్వేతుడు, రంభుడు, పనసుడు, వినతుడు, గవయడు మరియు ఇతర వానరులను గురించి 
రావణుడు తెలిసి కొనెను. మరియు సముద్రము వలె వున్న వానరసైన్యం చూసి రావణుడు వారి సంఖ్యను అడుగగా సారణుడు వానరబలగం గురించి చెబుతూ కొన్ని కోట్ల కోట్లమంది వానరులు ఉన్నారని చెప్పెను. రాముని సైన్యం గురించి తెలుసుకున్న రావణుడు దిగులు చెంది మాయలు తెలిసి విద్యుజ్జిహ్వుని పిలిపించి రాముని మాయ శిరస్సుని చేయించ సీతకు చూపెను. రాముడు యుద్ధంలో చనిపోయెను. ఇంక రాముని గురించి నీవు వేచి వుండుట అనవసరము. అని సీతను భయపెట్టెను. ఆ మాయా శిరస్సును చూసి చింతించుచుండగా సరయ అనే రాక్షసి, అది రావణుడు మాయచేత కల్పించినది. రాముడు సముద్రుడు దాటి వచ్చినాడు అని చెప్పెను. రాక్షసులలో కూడా మంచి మనసున్న వారు వుంటారు అనడానికి నిదర్శనమే ఈ సరయ. 
 
లంకలో రామలక్ష్మణులు వానరముఖ్యులతో కలిసి సువేల పర్వతమును ఎక్కారు. అక్కడ నుంచి చూస్తే లంకానగరము అంతయు స్పష్టముగా కనబడును. మొదట సుగ్రీవునికి రావణునికి మల్లయుద్ధము జరిగెను. అది సరియైనది కాదని రాముడు అంగదుని రావణుని వద్దకు రాయబారమును దూతగా పంపెను. 
 
రాయబారములో రావణుడు సీతను విడిపించుటకు అంగీకరించకపోవడంతో వానరులు యుద్ధము మొదలుపెట్టారు. ఆ రాత్రి యుద్ధములో ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రమువల్ల రామలక్ష్మణులు మూర్ఛపోయారు. ఆ విషయం తెలిసిన రావణుడు, సీతను యుద్ధభూమికి తీసుకొని పోయి మూర్ఛపోయిన రామలక్ష్మణులను చూపించమని రాక్షసస్త్రీలకు ఆజ్ఞాపించెను. రావణుని ఆజ్ఞ ప్రకారం రాక్షసస్త్రీలు, త్రిజట కలిసి సీతను పుష్పక విమానంపై ఎక్కించుకుని రామలక్ష్మణులు మూర్ఛపోయి పడివున్న ప్రదేశానికి తీసుకునిపోయి ఆకాశం పైనుండే ఆ దృశ్యం చూపుతారు. అది చూసి సీత విలవిలా ఏడ్చెను. తన భర్త మరణించాడని తలంచి ఎంతో దుఃఖించెను. 
 
అప్పుడు త్రిజట సీతకు ధైర్యము చెప్పెను. రామలక్ష్మణులు మరణించలేదని, ఎందుకంటే అక్కడున్న వానరులలో దుఃఖములేదనీ, అంతేగాక భర్తను కోల్పోయిన స్త్రీ గనుక ఈ పుష్పకవిమానం ఎక్కినచో పైకి ఎగురదని, కనుక వీటినన్నింటిని బట్టి రామలక్ష్మణులు బ్రతికే ఉన్నారని సీతను ఓదార్చి లంకకు తిరిగి తీసుకెళ్ళింది. 
 
రాముడు స్పృహ నుండి బయటికి వచ్చిన పిదప లక్ష్మణుణ్ణి చూసి విలపించెను. అప్పుడు గరుత్మంతుడు వచ్చి రామలక్ష్మణులను నాగపాశము నుండి విముక్తులను చేసి వెళ్లెను. తర్వాత రాముని సైన్యానికి రావణుని సైన్యానికి యుద్ధము జరిగెను. రావణుని కుటుంబంలో ఒక్కొక్కరుగా మరణించుచూ వచ్చారు. 
 
యుద్ధకాండము అంతయు వివరించవలెనని ఆశ వున్నను ఇది ప్రత్యేకముగా సీత గురించి వ్రాస్తున్న జానకీ రామాయణము కాబట్టి క్లుప్తముగా వ్రాయడమైనది. చివరికి రామునికి రావణునికి మధ్య ఘోరయుద్ధము జరిగెను. రామరావణ యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. చివరికి రావణవధ జరిగింది. రాముడు విభీషణునికి పట్టాభిషేకం చేసి, హనుమంతుని సీతవద్దకు వెళ్ళి తమ విజయాన్ని చెప్పి రమ్మని పంపెను. 
 
జరిగిన యుద్ధం గురించి సీతకు హనుమంతుడు చెప్పి ఇక మీద ఇక్కడ ఎటువంటి భయము కలుగదు. ఎందుకంటే విభీషణుడు రాజ్య పాలనా బాధ్యతలు స్వీకరించాడు అని చెప్పగా, 
 
'' ఇతరులు చెప్పుదానిని వినవలెనని కోరిక, వినుట, గ్రహించుట, జ్ఞాపకము ఉంచుకొనుట, చెప్పని దానిని ఊహించుకొనుట, అనవసరమైన దానిని త్యజించుట, అర్థమును తెలిసికొనుట, యదార్థమును నిర్ణయించుట అనే ఎనిమిది అంగములు గల బుద్ధితో యుక్తమగునట్లుగా పలుకుటకు నీవే తగినవాడివి'' అని హనుమంతునితో ఎంతో సంతోషముతో సీత శుభ వాక్యములు పలికినది (VI. 113, 26-27). - ఇంకా వుంది. (దీవి రామాచార్యులు)

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

13-06-24 గురువారం దినఫలాలు - ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు...

దేవతా వృక్షం రావిచెట్టుకు ప్రదక్షిణ చేసేవారికి ఇది తెలుసా?

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

11-06-2024 - మంగళవారం- పంచమి రోజున వారాహిని పూజిస్తే శుభం

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

తర్వాతి కథనం
Show comments