Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకే ఓ చానెల్ ప్రతినిధి.. చేసేది కర్పూరం వ్యాపారం.. నెల ఆదాయం రూ.12 లక్షలు.. తిరుమలలో జర్నలిస్టుల దందా!

వెంకన్న కొలువైన కొండమీద చిన్న వ్యాపారం చేసుకునే అవకాశం దొరికినా లైఫ్‌ సెటిల్‌ అయిపోయినట్లే. అందుకే తిరుమలలో దుకాణాలకు, హాకర్‌ లైసెన్సులకు యమా డిమాండ్‌. ఇక్కడ రాజకీయ అండదండలతో ఎందరో తట్టలూ, దుకాణాలకు అ

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (13:37 IST)
వెంకన్న కొలువైన కొండమీద చిన్న వ్యాపారం చేసుకునే అవకాశం దొరికినా లైఫ్‌ సెటిల్‌ అయిపోయినట్లే. అందుకే తిరుమలలో దుకాణాలకు, హాకర్‌ లైసెన్సులకు యమా డిమాండ్‌. ఇక్కడ రాజకీయ అండదండలతో ఎందరో తట్టలూ, దుకాణాలకు అనుమతులు పొంది వ్యాపారాలు చేస్తుండగా ఇంకొందరు ఏ అనుమతులూ లేకుండానే చక్రం తిప్పుతారు. కొందరు సొంతంగా వ్యాపారాలు చేస్తే ఇంకొందరు తమ తరపున వేరొకరికి అద్దెకు ఇచ్చి లక్షలు గడిస్తుంటారు. ఈ దబాయింపు సెక్షన్‌లో మీడియా ప్రతినిధుల పాత్ర చాలా పెద్దది. తిరుమలలో ఇళ్లూ, దుకాణాలూ కోల్పోయిన వారికి మానవతా దృక్పథంతో హాకర్‌ లైసెన్సులు ఇచ్చారు. ఇలా అనుమతులు పొందిన వారిలో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. వీరికి న్యాయంగా వచ్చిన వాటా ఇది.
 
అయితే తిరుమలలోనో, తిరుపతిలోనో జర్నలిస్టుగా గుర్తింపు కార్డులు పొంది, ఆ దబాయింపుతో తట్ట లైసెన్సులు, వీలైతే దుకాణాలు పొందిన వారి సంఖ్య అసలు వారి కంటే ఎక్కువ. అసలు ఏ లైసెన్సులూ లేకుండానే దుకాణాలూ నడిపేవారు ఉన్నారు. ఎన్ని పత్రికలైనా జనానికి కనిపించని ఛానెళ్ళయినా ఫర్లేదు. ఇక ఐడి కార్డు, ఒక లోగో ఉంటే చాలు. అధికారులను నయానో భయానో మెప్పించి, ఒప్పించి దుకాణాలు సంపాందించుకోవచ్చు. అధికారులకు, రాజకీయ నాయకులకు మీడియా అంటే ఎందుకంత భయం అనుకుంటున్నారా. ఇక్కడ అక్రమ వ్యాపారాలకు మూలమే ఉన్నత స్థాయి వర్గాల్లో పనిచేసే కొందరు వ్యక్తులు. తిరుమల వ్యాపారాన్ని అడ్డాగా చేసుకొని కొంతమంది ఉద్యోగులు రోజువారి మామూళ్లు వసూలు చేస్తున్నారు. 
 
లెక్కిస్తే ఇవి నెలకు రూ.కోట్లలో ఉంటాయి. వారి తప్పులను సాకుగా చూపి రాజకీయ నాయకులు తమ అనుచరులకు దొడ్డిదారిన షాపులు ఇప్పిస్తున్నారు. ఈ రెండు వర్గాల తప్పులను చూపించి కొంతమంది మీడియా ప్రతినిధులు అనధికారిక దుకాణాలతో లక్షలు సంపాదిస్తున్నారు. అధికార, రాజకీయ, పాత్రికేయ రంగానికి చెందిన కొంతమంది ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకొంటూ రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. మీడియా తట్టలకి తిరుమలలో గిరాకీ ఎక్కువ. అనుమతితో సంబంధం లేదు. ఎక్కడైనా ఏదైనా అమ్మవచ్చు. అడిగే వారు ఉండరు. అందుకే మీడియా తట్టలకు అద్దెలు ఎక్కువ. మీడియా వాళ్ళలో ఎక్కువమంది అద్దెలకు ఇచ్చి నెలకు లక్షలు గడిస్తుంటారు. 
 
కోట్లకు ఎదిగిన వారు ఉన్నారు... 
తిరుమలకు రెండు కాలి బాటులున్నాయి. వీటి చివరి మెట్ల వద్ద ఒక ఛానెల్‌ ప్రతినిధి అనధికారికంగా కర్పూరం వ్యాపారం చేస్తున్నారు. ఇతని ఆదాయం నెలకు రూ.12 లక్షలు. వైకుంఠంలోపల నిబంధనలకు విరుద్థంగా బిస్కెట్‌ పాకెట్లు, చాక్లెట్లు అమ్మడానికి ఒక ముఠా ఉంది. దీనిని పత్రికా రంగం పేరు చెప్పుకొని చలామణి అయ్యే కొంత మంది నిర్వహిస్తున్నారు. ఈ ముఠా ఆదాయం నెలకు రూ.6 లక్షల పైమాటే. ఆలయం చుట్టూ కూడా మీడియా ప్రతినిధులకు పెద్ద ఎత్తున అక్రమ తట్టులున్నాయి. అఖిలాండం, పాత అన్నదానం, డిఎంబీ రోడ్డు, పిఏసీ-2 వద్ద మీడియా ప్రతినిధులకు అనధికారిక తట్టలు 50కిపైగా ఉన్నాయి. తిరుమల ముఖ్య కూడళ్ళలో సైతం మీడియా పేరుతో కొంత మంది అనధికారిక తట్టలు నడుపుతున్నారు.
 
ఒక హాకర్‌ లైసెన్సుతో పది తట్టలు నడుపుకొంటున్నవారు ఉన్నారు. మాఢా వీధులు, అఖిలాండం, అన్నదానం, కళ్యాణకట్ట, ఇలా భక్తుల సంచారం అధికారంగా ఉండే ప్రదేశాలు మినహా ఇతర ప్రదేశాల్లో ఫోటోగ్రాఫర్లు వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. తిరుమలతో పాటు పాపవినాశనం, ఆకాశగంగ, శిలాతోరణం వంటి ప్రాంతాల్లో 34 మంది ఫోటోగ్రాఫర్లకు లైసెన్సులు మంజూరు చేశారు. కానీ ఇక్కడ అనధికారిక ఫోటోగ్రాఫర్లే ఎక్కువగా ఉంటారు. వీరి వెనుక కొంతమంది మీడియా ప్రతినిధులు ఉన్నారు.
 
మీడియా పవర్‌తోనే మారే దుకాణం
తిరుమలలో ఒకచోట నుంచి మరోచోటకు దుకాణం మార్చాలంటే సాధ్యంకాదు. అయితే ఈ విషయంలో కొంతమంది మీడియా ప్రతినిధులకు మాత్రం మినహాయింపు ఉంది. తిరుమల విస్తరణలో భాగంగా మేదరమిట్ట ప్రాంతంలో ఒక ఇల్లును కూల్చేశారు. ఆ ఇంటి యజమానికి ఇప్పటివరకు తితిదే పరిహారం ఇవ్వలేదు. కానీ ఆ ఇంటి ముందు బంకు పెట్టుకుని జీవిస్తున్నట్లు బోగస్‌ రికార్డులు చూపిన ఒక వ్యక్తికి మాత్రం దుకాణం కేటాయించారు.
 
ఈ మధ్యే తితిదే ఛైర్మన్‌ ఆ దుకాణాన్ని మూసించి వేశారు. అయితే 20 రోజుల్లోనే మళ్ళీ తెరుచుకుంది. కారణం.. ఆ దుకాణదారుడు పాత్రికేయుడు. గతంలో రాంబగీచ అతిథి గృహం ఎదురుగా ఉన్న హోటల్‌ను కళ్యాణకట్ట సమీపంలోకి మార్చారు. ఈయన పాత్రికేయుడు కావడం గమనార్హం. ఆకాశగంగ ప్రాంతంలో ఉన్న ఒక హాకర్‌ లైసెన్సును రాగిమాను సర్కిల్‌కు మార్చారు. కారణం ఇతను ఒక మీడియా ఫోటోగ్రాఫర్‌. ఒక ఛానల్‌కు సంబంధించిన రిపోర్టర్‌ శ్రీవారిమెట్టు మార్గాన్ని పూర్తిగా కైవసం చేసుకొని కూలికి మనుషులను పెట్టుకొని కర్పూరం పొట్లాలు అమ్మిస్తున్నాడు. ఒకే యాజమాన్యం కింద నడుస్తున్న పత్రిక, ఛానల్‌ కెమెరామెన్లుగా పనిచేస్తున్న ఇద్దరు శ్రీవారి మెట్టు, వరాహస్వామి అతిథి గృహం ప్రాంతంలో అనధికారికంగా దుకాణాలు నడుపుకొంటున్నారు.
 
ఎవరో దొంగలు.. అనధికారిక వ్యాపారులను కొండదించడం తితిదేకి పెద్ద కష్టం కాదు. కొన్ని గంటల్లో ఆ పనిపూర్తి చేయగలిగే సామర్ధ్యం తితిదేకి ఉంది. అయినా అందుకు సాహసించడం లేదు. ఇందుకు కారణం అవినీతే. తితిదే విజిలెన్సు ఎస్‌టీఎఫ్‌, హెల్త్, రెవిన్యూ, ఎస్టేట్‌ ఇలా అన్ని కీలక శాఖల్లో పనిచేసే పలువురు ఉద్యోగులు, అధికారులు మామూళ్ళకు అలవాటుపడ్డారు. అక్రమ వ్యాపారుల నుంచి నెలకు కొన్ని కోట్ల రూపాయలు వసూళ్లు చేసుకొంటున్నారు. తిరుమల ఆలయం కేంద్రంగా పనిచేసే అధికారులేమో దర్శనాల పేరుతో దండుకొంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల దర్శనాలే ఉపాధిగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు.
 
మీడియాను కదిలిస్తే వీరందరి అక్రమ వ్యాపారాలు బంద్‌ అవుతాయి. తిరుమల పాలన గురించి మీడియాలో వ్యతిరేకంగా ప్రసారమైనా, ప్రచురితమైనా ఉన్నతాధికారుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే మీడియాను అక్రమ సంపాదనకు ప్రోత్సహిస్తున్నారు. ఎవరైనా వ్యతిరేక వార్తలు రాయడానికి ప్రయత్నిస్తే ఈ పిచ్చి లెక్కలెందుకు నువ్వూ ఒక అంగడి పెట్టుకోవచ్చు కదా. అని ఒకరిద్దరు అధికారులు సలహాలు ఇస్తుంటారు. విజిలెన్స్, రెవిన్యూ, హెల్త్ అధికారుల దుకాణాలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా స్థలాన్ని ఎంపిక చేసి ఇస్తున్నారు. ఇక ఆ దుకాణం వద్దకు కింది స్థాయి సిబ్బంది వెళ్ళకుండా హుకుం జారీ చేస్తున్నారు. ఇలా అధికార, ఉద్యోగ, రాజకీయ, పాత్రికేయ వర్గాల్లోని కొందరు ఒకరికి ఒకరు దన్నుగా తిరుమలలో ఉమ్మడి అక్రమ వ్యాపారం చేసుకొంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments