Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతంలో హంస-కాకి... కర్ణుడికి శల్యుడు చెప్పిన కథ

పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడు వుండేవాడు. చాలా మంచివాడు. గొప్ప భాగ్యవంతుడు. ఓ రోజు ఒక కాకి అతడి పంచన చేరింది. అతని కొడుకులు దానికి మెతుకులు పెట్టి పెంచారు. అది బాగా బలిసి కొవ్వెక్కి ఏ పక్షులూ

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (16:57 IST)
పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడు వుండేవాడు. చాలా మంచివాడు. గొప్ప భాగ్యవంతుడు. ఓ రోజు ఒక కాకి అతడి పంచన చేరింది. అతని కొడుకులు దానికి మెతుకులు పెట్టి పెంచారు. అది బాగా బలిసి కొవ్వెక్కి ఏ పక్షులూ తనకు సరిరావని విర్రవీగుతూ వుండేది.
 
ఒకనాడు సముద్ర తీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి... అన్ని పక్షుల కంటే బలమైనదానవి నువ్వు. ఆ హంసలకంటే ఎత్తు ఎగరాలి. సరేనా అన్నారు వర్తకుని పిల్లలు. మెతుకులు తిని బలిసిన ఆ వాయసం తారతమ్య జ్ఞానం లేకుండా హంసల దగ్గరకు వెళ్లి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి. 
 
మానస సరోవరంలో వుంటాం. మహా బలవంతులం. హంసలతో సరియైన కాకులు లోకంలో వున్నట్లు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నావా అన్నాయి. నూటొక్క గతులలో పరుగెత్తడం చేతనౌను నాకు. ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనాలు వెళ్తాను. మీరెలా కావాలంటే అలా ఎగురుతాను... పందెం అంది కాకి. 
 
ఆ గతులూ గమనాలూ మాకు తెలీదు. మామూలుగా సముద్రం మీద నిటారుగా ఎగురుదాం. మేమంతా రావడం వృధా. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది... అన్నాయి హంసలు.
 
అనడమే తడవు ఒక హంస గుంపులో నుంచి బయటకు వచ్చింది. కాకి కూడా దాని వెనకాలే వెళ్లింది. రెండూ సముద్రం మీదుగా ఎగరడం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళ్తుంటే కాకి దానికి తన విన్యాసాలు చూపిస్తోంది. హంసను దాటిపోయి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి ఎగతాళిగా హంసను పిలువడం, ముక్కు ముక్కు మీద మోపడం, జుట్టు రేపుకుని తిరగడం, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులన్నీ చేసింది. హంస చిరునవ్వు నవ్వి ఊరుకుంది. కాసేపటికి కాకి అలసిపోయింది. అప్పుడు పొడుగ్గా ఎగసి పడమరకు పరుగెత్తింది హంస. కాకి మరి ఎగరలేక రొప్పుతూ బిక్కముహం వేసింది. 
 
హంసను మించలేకపోగా ప్రాణ భీతితో తల్లడిల్లింది. అయ్యో నా అవయవాలన్నీ వికలమైపోయాయి. కాసేపు ఎక్కడైనా ఆగుదామంటే పర్వతాలూ, చెట్లూ లేవాయే. ఈ సముద్రంలో పడితే మరణమే శరణ్యం అనకుంటూ కిందికీ పైకీ లేస్తూ గుడ్లు తేలేస్తోంది. అది చూసిన హంస నీకు చాలా గమనాలు వచ్చాన్నావు కదా. గొప్పగొప్ప విన్యాసాలు చేస్తానన్నావు. ఒక్కటీ చూపవేమిటి అని అడిగింది. 
 
కాకి సిగ్గుపడింది. 
 
అప్పటికే అది సముద్రంలో దిగబడి పోవడానికి సిద్ధంగా వుంది. హంసతో... నా సామర్థ్యం ఏమిటో నాకు తెలిసి వచ్చింది. నన్ను రక్షించు అంటూ ఆర్తనాదాలు చేసింది. అలా చేస్తూనే సముద్రంలో పడిపోయింది. ఇది చూసిన హంస వెంటనే జాలిపడి తన కాళ్లతో కాకిని సముద్రం నుంచి పైకి లేపి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఇంకెప్పుడూ ఇలా అహంకారానికి పోకు అని చెప్పి వెళ్లిపోయింది హంస. కాకి లెంపలేసుకుంది అంటూ యుద్ధభూమిలో కర్ణుడికి హితవు పలికాడు శల్యుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

తర్వాతి కథనం
Show comments