Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవంతునికి భక్తునికి అనుసంధానంగా పాట

Raju
గురువారం, 26 జూన్ 2008 (13:15 IST)
' నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చెనో..' దాదాపు తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరి నోటా ఈ పాట బహుశా నానుతూనే ఉంటుంది. దేవదేవుడిని సైతం వశపర్చుకోవాలంటే, ఆ దేవదేవికి మొరపెట్టుకోవడం కంటే మించిన సులభమైన మార్గం మరొకటి లేదని ఈ పాత సినిమా గీతం చెబుతోంది. ఈ పాట రంగులరాట్నం సినిమాలోది. అమ్మగారికి మొరపెట్టుకోవడం ద్వారా సాక్షాత్తూ కోరిన వరాలిచ్చే శ్రీనివాసుడ్ని సైతం వశపర్చుకోవచ్చు అనే మేటి సందేశాన్ని దాదాపు 40 ఏళ్ల క్రితం ఓ తెలుగు సినిమా పాట చిరస్మరణీయ రీతిలో వెలువరించింది. సగటు మనిషి గుణాలను దేవుడికే ఆపాదించి అలరించిన ఈ గీతం తెలుగు సినీ గీత సాహిత్యంలో వెల్లివిరిసిన ఓ అనర్ఘరత్నం.

తెలుగు నుడికారానికి, తెలుగు పదాల తియ్యందనాలకు సాక్షీభూతంలా నిలిచిన ఈ పాట ఎలా మొదలవుతుందో చూడండి. భక్తుల సేవలో తరించిన తిరుమల శ్రీనివాసుడు ఇక విశ్రాంతి తీసుకోవడానికి ఏడుకొండలూ దిగి అలివేలి మంగ చెంత చేరడానికి సిద్ధమయ్యే సమయాన్ని భక్తుడు వడిసిపట్టుకున్న తీరును ఈ పాట పల్లవి అద్భుతంగా చిత్రించింది. "నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో."

ఈ చరణం తర్వాత పాటలో మొదలయ్యే ఒక్కో వాక్యం, పదం తెలుగు సాహిత్యంలో కరుణరసానికి తలమానికాలుగా కలకాలం వెలుగొందుతాయంటే ఆశ్చర్యపడనవసరం లేదు.

సగటు అధికారి సతీమణికి తృణమో, ఫలమో, ధాన్యమో, వస్త్రమో ఏదో ఒకటి అర్పిస్తే ఆమె మొహమాటానికైనా వాటిని తీసుకుని ఆ వ్యక్తిపై ప్రసన్న కరుణా కటాక్ష వీక్షణాలను కురిపించవచ్చు గాక, భర్తకు ఆ పని చేసిపెట్టమని ప్రతిపాదించవచ్చు గాక. కాని ఇక్కడ సాక్షాత్తూ దేవదేవితో వ్యవహారం కావటంతో ఇక్కడ లంచం గించం పనికిరాదు. ఈ నిరుపేద భక్తుడు ఎంత ఒద్దికతో, ఎంత వినయపూర్వకంగా ఆమెను వేడుకుంటున్నాడో చూడండి...

' మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ' - అమ్మలగన్నయమ్మ కాదు మా భక్తులందరి అమ్మవు... నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకోగలం మేము.... ఇంతకు మించిన నమస్కార బాణం ఎవరైనా ఎక్కడైనా సంధించి ఉండగా చూశామా మనం.. హృదయాన్ని ఇంత గాఢంగా కొడితే మనమే కాదు ఆ అలివేలమ్మ సైతం కరిగిపోదా మరి..

' పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ'... మనస్తత్వ పరిశీలనా శక్తి తారాస్థాయికి చేరితే తప్ప ఇంత గొప్ప వాక్యం కవి మనసులోంచి రాదు. సుదీర్ఘ విరామానంతరం దంపతులు కలుసుకోవడం... తమకే సొంతమైన ఏకాంతంలో ఒకరి ఒడిలో ఒకరు అలసి సొలసి సేదతీరడం, సతీ సంపర్కగత హృదయాంతరంగుడై భర్త సంతోష సముద్రంలో తేలియాడుతుండడం.. సమయం, సందర్భాన్ని చూసి మరీ కొట్టడం అంటే ఇదే కదా...

ఎంత దేవదేవులైతే మాత్రం భార్యా భర్త సంబంధంలోకి వచ్చాక గొడవలంటూ రాకపోవు గదా. మరి విన్నపాలు తీరవలెనంటే ఈ గొడవల కాపురం ఉండకూడదు. అందుకే పతిదేవుడి ఒడిలో అమ్మగారు మురిసిపోతున్నప్పుడు, ఆమె మురిపాలు చూసి శ్రీనివాసుడు మందహాసపు వెన్నెలలు కురిపిస్తున్నప్పుడు.. అప్పుడు, ఆ సమయంలో మాత్రమే స్వామికి మాగురించి చెప్పు తల్లీ అని మొరపెట్టుకోవడం.

ఏమి స్పాట్ ఇది... ఏమి తెలివి ఇది. దాంపత్యం జీవితం చల్లగా సాగుతున్న క్షణాల్లోనే ఎవరి కోరికలయినా తీరే అవకాశం ఉంటుంది. అందుకే చిరునవ్వును వెన్నెలతో పోల్చడం. సంసార నౌక సరిగా లేకపోతే భగవంతుడయినా భక్తుల మొర ఆలకించగలడా మరి....పసిడి ముద్దలలాంటి ఈ వాక్యాలు రాయాలంటేనే కవికి సైతం ఎంత జీవితానుభవం ఉండాలి?

' విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభునికి మా మనవి వినిపించవమ్మా' విభుడు, ప్రభువు అనే పదాలు తమ స్థానాల్లో చేరినప్పుడు మాట, మనవి కూడా వాటి స్థానాల్లో చక్కగా చేరిపోయాయి చూడండి. విభుడు అంటే అలివేలమ్మ నాధుడు.. ఇక్కడ అమ్మద్వారా తన మాటను స్వామికి వినిపించాలనే భక్తుడి చమత్కారం... ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా అనే చోట జగన్నాధుడికి తప్పనిసరి గౌరవం ఇస్తూ చూపిన చమత్కారం ఎంత చక్కగా కుదిరిపోయాయి మరి.

' ఏడేడు శిఖరాలు నే నడువలేను.. ఏపాటి కానుక అందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను.. వివరించి నా బాధ వినిపించలేను'

నేరుగా సమస్యను పరిష్కార కర్త వద్దకు తీసుకుపోలేక అమ్మగారి నోటిమాట ద్వారా పరిష్కారానికి ప్రయత్నించడానికి కారణముంది మరి. రాజమార్గంలో పోలేనప్పుడే కదా అమ్మగారి మార్గం తెరుచుకుంటుంది ఎవరికైనా. లంచంతో పని అంటేనే అడ్డమార్గంలో పోవడం. అయితే ఇది భక్తుడికి భగవంతునికి మధ్య అనుసంధాన మార్గం కాబట్టి దేవుడితో నేరుగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నాడో నిజమైన కారణాలను భక్తుడు వివరించాలి.

అందుకే ఆ కారణాలను అత్యంత నిజాయితీతో అతి గొప్ప గీతపాదంలో చెప్పడం. తిరుమల కొండలు ఎక్కలేని బలహీనత, ఎక్కినా హుండీలో కానుకలు సమర్పించలేని దౌర్భాగ్యం, ఈ రెండూ కలిసి కొండపై వెంకన్న పాదదర్శనాన్ని భక్తుడికి లేకుండా చేస్తున్నాయట. ఇలా రాజమార్గంలో తన బాధ వినిపించుకోలేని నిస్సహాయ పరిస్థితుల్లోనే భక్తుడు పాహిమాం అంటూ దేవికి మొక్కుతున్నాడు. నీవే తప్ప ఇతఃపరంబెరుగను అనే రీతిలో సాక్షాత్తూ అలివేలిమంగే దైవ,భక్తుల అనుసంధాన మార్గమయింది.

ఇంతవరకూ పాట నడిచిన తీరు ఒక ఎత్తు అయితే కింది ముగింపు పాదాలు నడిచిన తీరు ఒక ఎత్తు.. భక్తుడి బాధ ఆక్రందన నిష్టూరంగా, ధర్మాగ్రహంగా మారితే ఆ దేవదేవుడి గొప్పదనం సైతం గడ్డిపోచలా విలువ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అక్షరాలను మంత్రసమన్విత శక్తులుగా చేసుకుని కవి అల్లిన మాటల తూటాలను కింది వాక్యాలలో చూద్దాం మరి..

' కలవారినేకాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనివాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా'

ఉన్నవాళ్లకు సులభ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు, ఆర్బాటపు దర్శనాలు జరగడం ఇప్పుడూ అప్పుడూ కూడా ఆనవాయితీగా నడుస్తున్నట్లుంది. దైవదర్శనకు కూడా ఆస్తి అంతస్తుల తేడా ఉందన్నమాట. ఎంత గొప్ప సామాజిక దర్శనమిది. ఈనాటికీ తిరుమల దేవుడి దర్శనంలో సామాన్యులే అన్ని ఇబ్బందులకు గురవుతుండడం ఓ నగ్నసత్యం మరి.

ఎంత మొరపెట్టుకున్నా దేవుడు వినడా, కనడా, దర్శనమీయడా... అలాగయితే పేదలను కరుణించలేనివాడు, పేదల మొరలాలకించలేనివాడు, కన్నీటి బతుకులను చూడలేనివాడు కరుణామయుడన్న బిరుదుకు అర్హుడేనా... ఇదీ భక్తుడికి భగవంతుడికి మధ్య పరాకాష్టకు చేరుకున్న అనుసంధానం. భక్తుడికి కడుపు కాలితే, ఎంతసేపు ప్రార్థించినా మొరవినకపోతే లోకంలో సమస్త భక్తులు చేపట్టే అంతిమ మార్గమే ఇది.

మా మొరలు వినిపించుకోని నువ్వేం కరుణామయుడివి, నువ్వేం దేవుడివి స్వామీ... ఈ ఆక్రోశం, భక్తుడు మాత్రమే అధికారయుతంగా ప్రయోగించగల ఈ ఆక్రోశం దెబ్బకు సాక్షాత్తూ ఆ శ్రీనివాసుడే ఏడుకొండలూ దిగి భక్తుని వద్దకు పరుగెత్తుకురాడా..

ఆ కరుణామయుడిని కరుణ రసం తోడుతో సుతిమెత్తగా కొట్టిన మహత్తర గీతం కాబట్టే ఇది నాలుగు దశాబ్దాల అనంతరం సైతం తెలుగు భక్తిగీతాల్లో అగ్రగామిగా జనం హృదయాల్లో నిలుస్తోంది. దాశరధి రాయగా, రంగులరాట్నం సినిమాలో ఘంటసాల, జానకి పాడగా రూపొందిన ఈ గీతం కరుణరసానికి జయకేతనంలాగా నిలుస్తూ రస హృదయాలను అలరిస్తోంది.

మానుష లక్షణాలను దేవుడికి ఆపాదించి, దేవదేవితో భక్తుడి విన్నపం, సంవాదం రూపంలో తయారైన ఈ పాట ప్రతి భక్తి పాటల క్యాసెట్‌లో, భక్తిపాటల సిడిలో, డివిడిలో తప్పక చోటుచేసుకుని వస్తోంది. ఎవరయినా తెలుగు వారు ఈ పాట ఇప్పటిదాకా వినకపోతే తప్పకుండా వినడానికి ప్రయత్నించండి.

అచ్చతెలుగు పదాల తియ్యందనాలను ఆస్వాదించడానికైనా ఈ పాటను మళ్లీ ఓ సారి వినండి...

నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో

మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభునికి మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాలు నే నడువలేను
ఏపాటి కానుక అందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
వివరించి నా బాధ వినిపించలేను

అమ్మా .. మముగన్న మాయమ్మ అలిమేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభునికి మా మనవి వినిపించవమ్మా

కలవారినేకాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనివాడు
స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా
అడగవే మా తల్లి అనురాగవల్లి
అడగవే మాయమ్మా అలిమేలుమంగా..
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్శిల్ మృతదేహం మిస్టరీ : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

పాకిస్థాన్‌ను తాలిబన్ ఫైటర్లు ఆక్రమిస్తారా?

ఆ విమాన ప్రమాదానికి పక్షుల గుంపు ఢీకొనడం కారణం కాదా?

దేశగతిని మార్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ బడ్జెట్!!

Annamalai : కొరడాతో ఆరు సార్లు కొట్టుకున్న అన్నామలై.. చెప్పులు వేసుకోను.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Show comments