ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల తర్వాత బెంగాల్‌లో హింస చెలరేగింది. పలు ప్రాంతాల్లో అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు.
ఈ హింస దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ హింసాత్మక ఘటనలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది.
అదనపు కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ బెంగాల్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించనున్నది. ఈ ప్రత్యేక బృందం గురువారం నాడే బెంగాల్‌లో పర్యటించనున్నదని కేంద్ర హోంశాఖ తెలిపింది.