ఎమ్మెల్యేలతో కవాతుకు చిన్నమ్మ ప్లాన్.. శశికళకు అపాయింట్‌మెంట్ ఇవ్వని గవర్నర్
తమిళనాట రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్ర సీఎం పదవి కోసం శశికళ, పన్నీర్ సెల్వంల మధ్య హోరాహోరీగా పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాట ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి ఇప్పటికిప్పుడు తెరపడేలా లేదు
తమిళనాట రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్ర సీఎం పదవి కోసం శశికళ, పన్నీర్ సెల్వంల మధ్య హోరాహోరీగా పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాట ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి ఇప్పటికిప్పుడు తెరపడేలా లేదు. ఎడతెరిపిలేకుండా సాగుతున్న తమిళనాట రాజకీయాలను చూసి ప్రజలు విసుగుచెందుతున్న తరుణంలో.. గవర్నర్ విద్యాసాగర్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే గోల్డెన్ బే రిసార్ట్‌లో క్యాంపుగా ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కలిసిన అనంతరం గవర్నర్‌ను కలువాలని శశికళ భావించారు. ఇందుకోసం అపాయింట్‌మెంట్ కూడా కోరారు. రిసార్ట్‌లో తన వర్గం ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం ఆమె నేరుగా రాజ్‌భవన్‌కే వెళ్లాలని భావించారు. కానీ అపాయింట్‌మెంట్ అడిగినా.. గవర్నర్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని సమాచారం. తన ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్ రానున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో భారీస్థాయిలో పోలీసులను మోహరించారు.
గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకొని.. రాజ్‌భవన్ ముందు తన వర్గం ఎమ్మెల్యేలతో కవాతు నిర్వహించాలనేది శశికళ వర్గం వ్యూహంగా చెప్తున్నారు. కానీ, గవర్నర్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో శశికళ వర్గానికి షాక్ తప్పలేదు.