కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అభ్యంతరకర ఫోటోను పోస్ట్ చేయడంతో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో విషాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదంలో 33 ఏళ్ళ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. విజయనగర్ ఫ్రెండ్స్ పేరిట రాజ్ తమ ప్రాంతంలోని వారితో కలిసేందుకు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు.
అయితే ప్రశాంత్ నాయక్ అనే వ్యక్తి ఆ గ్రూప్‌లో సోనియా గాంధీ పాత్రలు తోముతున్నట్టుగా ఉన్న ఓ వ్యంగ్య చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ప్రధాని మోడీయే సోనియాకు ఆ పరిస్థితి రావడానికి కారణమనే రీతిలో కామెంట్ చేయడంతో అసలు వివాదం చెలరేగింది. దీనిపై ఇరు వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కి రమ్మని పిలిచారు.
పోలీస్ స్టేషన్లోనూ వారు పరస్పర దాడులకు దిగడం కారణంగా 33 ఏళ్ల వ్యక్తి కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమేష్ వర్మకూ తీవ్రగాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు.