తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆశలు అడియాశలయ్యాయి. ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు ఆమె వదిన ఇళవరసి, జయలలిత దత్తపుత్రుడు
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆశలు అడియాశలయ్యాయి. ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు ఆమె వదిన ఇళవరసి, జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్‌లను దోషిగా తేల్చిన విషయం తెల్సిందే. పైగా, ఈ కేసు నుంచి జయలలితను విముక్తి కల్పించారు. ఆమె జీవించి లేకపోవడంతో జయలలిత మినహా, మిగిలిన ముగ్గురు దోషులుగా నిర్ధారించి నాలుగేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో శశికళతో పాటు.. ఆమె వర్గీయులు బసచేసివున్న గోల్డెన్ బే రిసార్ట్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు భారీగా మోహరించారు. ఈ పోలీసు బలగాలు శశికళను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు... అక్రమాస్తుల కేసులో దోషులుగా తేలిన శశికళతో పాటు.. మిగిలిన ముగ్గురు దోషులు సోమవారం సాయంత్రం లోపు బెంగుళూరు కోర్టులో లొంగిపోవాల్సిందిగా సుప్రీంకోర్టు ద్విసభ ధర్మాసనం ఆదేశించింది. లేని పక్షంలో కర్ణాటక హోం శాఖ స్పెషల్ టీంను తమిళనాడుకు పంపనుంది. మరి శశికళ లొంగిపోతారా? లేదా పోలీసులే ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగుతారా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
అదేసమయంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఇంతకాలం శశికళ వెంట నడిచిన ఎమ్మెల్యేలు డైలమాలో పడ్డారు. ఇక పన్నీరు సెల్వం నివాసానికి ఆ ఎమ్మెల్యేలంతా క్యూ కట్టే అవకాశం ఉంది. గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ఎమ్మెల్యేలకు విముక్తి కల్పించిన వెంటనే వారంతా నేరుగా పన్నీర్ సెల్వం గూటికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో డీఎంకే అండ లేకుండానే పన్నీరు సెల్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.