రాహుల్ గాంధీకి సోనియా గాంధీ వ్యాపారం పెట్టిస్తారా? శైలేష్‌ను తప్పిస్తారా?
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేతకాని వాడనే ముద్ర పడిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో యూపీలో రైతు భరోసా యాత్రలో మంచాలిస్తామంటే వచ్చామని.. అవి దొరక్కపోయే సరికి తన్నుకున్నామని రై
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేతకాని వాడనే ముద్ర పడిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో యూపీలో రైతు భరోసా యాత్రలో మంచాలిస్తామంటే వచ్చామని.. అవి దొరక్కపోయే సరికి తన్నుకున్నామని రైతులు చెప్పారు. మంచంలో కూర్చుని సభ పూర్తయ్యాక వాటిని నెత్తిన పెట్టుకెళ్లారు. ఈ ఘటనలో రాహుల్ గాంధీ తలబాదుకుంటే ప్రతిపక్షాలు మంచాలపై సెటైర్లు వేశారు.
ఇక సొంత పార్టీలోనూ రాహుల్ గాంధీ అంటే కొందరు పార్టీ నేతలకు పొసగట్లేదని.. అందుకే 10 జన్ పథ్ వైపు ఏ నేత కూడా వెళ్లడం లేదట. గతంలో ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు సోనియా, రాహుల్ దర్శనం కోసం క్యూ కట్టిన నేతలు కాంగ్రెస్ అధికారంలో లేకపోయే సరికి ముఖం చాటేస్తున్నారట. ఇకపోతే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆరోగ్యం బాగోలేదని తెలిసినా పరామర్శించే వారు కరువయ్యారంటేనే అసలు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితిలో నిప్పులో నూనె పోసినట్లు రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత శైలేష్ చౌబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ రాజకీయాలకు ఎంతమాత్రం పనికిరాడని... ఆయనను వెంటనే పార్టీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఒక వీడియో సందేశాన్ని పంపారు.
పార్టీకి ఉపయోగపడని వారు, నాయకత్వ లక్షణాలు లేనివారు కాంగ్రెస్‌లో ఉండటానికి వీళ్లేదని వీడియోలో తేల్చేశారు. రాహుల్ వల్ల కాంగ్రెస్‌కు నష్టమే కాని, ఏమాత్రం లాభం లేదని శైలేష్ విమర్శించారు. రాజకీయాల నుంచి తప్పించి రాహుల్‌తో ఏదైనా వ్యాపారం పెట్టించాలని సోనియాకు సలహా కూడా ఇచ్చారు శైలేష్. ఆ వీడియో సందేశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. పాకిస్థాన్‌పై భారత సైన్యం చేసిన సర్జికల్ దాడులకు సంబంధించి... రక్తంతో వ్యాపారం చేస్తున్నారంటూ ప్రధాని మోడీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను శైలేష్ తప్పుబట్టారు.
రాహుల్ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు. ఇక శైలేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొందరు నేతలు పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోతో సోనియా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీకి వ్యాపారం పెట్టిస్తారా? శైలేష్‌ను పార్టీ నుంచి తొలగిస్తారా అనేది తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.