దేశంలోని ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొంది, ప్రయాణికుల విశేష ఆదరణ పొందిన ఇండిగో సంస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుంది. దీంతో ఆ సంస్థకు చెందిన విమానాలు రద్దు చేస్తున్నారు. ఈ విమానాల రద్దు దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అనేక విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు రద్దు అవుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో చిక్కున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.
సికింద్రాబాద్ - చెన్నై, చర్లపల్లి - కోల్‌కతా, హైదరాబాద్ - ముంబైకి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వీటిలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు 37 రైళ్లకు 116 కోచ్‌లు అదనంగా జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు అదనపు బోగీలతో నడుస్తున్నాయి.
మరోవైపు, ఇండిగో విమానాల రద్దుపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారని.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. విమానాల రద్దు కారణాలపై దర్యాప్తు చేస్తామన్నారు. బాధిత ప్రయాణికులకు రిఫండ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.