సరిహద్దుల వద్ద భారత్-పాకిస్థాన్ సైన్యం నువ్వా నేనా అని పోటీ పడుతోంది. కాల్పుల ఉల్లంఘన కారణంగా పాకిస్థాన్ ఆర్మీ చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి ఆరుగురు భారత జవాన్లను హతమార్చామని పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించింది. అయితే పాకిస్థాన్ ఆర్మీ చేసిన ప్రకటనను భారత్ తిప్పికొడుతూ స్పందించింది.
పాకిస్థాన్ కాల్పుల్లో ఒకరు మాత్రమే మరణించారని, ఆరుగురు కానేకాదని స్పష్టం చేసింది. నలుగురు మాత్రం గాయాలతో తప్పించుకున్నారని తెలిపింది. ఆరుగురు భారత జవాన్లను హతమార్చామన్న పాక్ ప్రకటనలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది.
ప్రచార ఆర్భాటం కోసం పాకిస్థాన్ పాకులాడుతోందని.. భారత సైనికులను చంపేశామని పాకిస్థాన్ చేసిన ప్రకటన కేవలం డ్రామా మాత్రమేనని పేర్కొంది. తాము పాక్ ఆర్మీలా మృతుల సంఖ్యను దాచుకోబోమని, ఉన్నది ఉన్నట్టు చెబుతామని భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది.
అంతకుముందు, పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ ఒక ట్వీట్‌లో, సరిహద్దు కాల్పుల సమయంలో ఒక అధికారి సహా ఆరుగురు భారతీయ సైనికులు మరణించారని పేర్కొన్నారు. ఎల్ఓసి వెంట తట్టా పానీ సెక్టార్లో భారత సిఎఫ్వి (కాల్పుల విరమణ ఉల్లంఘన) కు పాకిస్తాన్ సైన్యం ధీటుగా స్పందించింది. ఆరుగురు సైనికులను హతమార్చినట్లు తెలిపారు.
కానీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటం, భారత సైనికుల ప్రాణనష్టం జరిగిందని తప్పుడు సంఖ్యను చెప్పడమంతా పాకిస్థాన్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకేనని భారత ఆర్మీ తేల్చి చెప్పేసింది.