ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ సాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, ఆదివారం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. ఇది నరాలు తెగే ఉత్కంఠతను రేకేతెత్తించింది. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ చూస్తుండగానే ఓ క్రికెట్ వీరాభిమాని గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన అస్సాం రాష్ట్రంలోని శివ్ సాగర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అస్సాంలోని శివ్ సాగర్‌లోని ఓ థియేటర్‌లో ఇండో పాక్ క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. బిగ్ స్క్రీన్‌పై మ్యాచ్‌ను చూడాలని భావించిన క్రికెట్ అభిమానులు థియేటర్‌కు వెళ్ళారు. అలాంటి వారిలో బిటు గగోయ్ ఒకరు. తన స్నేహితులతో కలిసి మ్యాచ్ చూస్తుండగా స్పృహ కోల్పోయిన బిటును గుర్తించిన స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
బిటును పరీక్షించిన వైద్యులు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు. కార్డియాక్ అరెస్టు కారణంగా బిటు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ను చూస్తున్న సమయంలో ఈ కార్డియాక్ అరెస్టు వచ్చివుంటుందని వైద్యులు చెప్పారు.