మహారాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై ఎన్సీపీ నేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో కుప్పకూలిపోతుందని, ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు.
శివసేనకు చెందిన తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే సారథ్యంలోని తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఆరునెలల్లో కొత్త ప్రభుత్వం కూలిపోవచ్చని, మధ్యంతర ఎన్నికలు రావొచ్చంటూ వ్యాఖ్యానించారు. ముంబైలో తన పార్టీ నేతలతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాలను అంచనా వేశారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో కూలిపోవచ్చు. అందుకే అందరు మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వంతో షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. ఒకసారి మంత్రిత్వ శాఖలు కేటాయించిన తర్వాత.. వారి అసంతృప్తి బయటపడుతుంది. అది చివరకు ప్రభుత్వం కూలే దశకు చేరుకుంటుంది.
ఈ వైఫల్యంతో అసమ్మతి ఎమ్మెల్యేలు తమ అసలు పార్టీ (ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఉద్దేశించి) వైపు వస్తారు. మన చేతిలో కనీసం ఆరు నెలల సమయం ఉందనుకుందాం. అందుకే ఎన్‌సీపీ నేతలంతా వారివారి నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గరగా ఉండండి అని పవార్ చెప్పినట్లు సమావేశానికి హాజరైన నేత ఒకరు మీడియాకు వెల్లడించారు.