తమిళనాడు సీఎం జయలలిత మృతితో తమిళనాట రాజకీయాలు శూన్యంలోకి వెళ్ళిపోయానని అన్నాడీఎంకే నుంచి ఉద్వాసన గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్ప అన్నారు. అమ్మ మృతిపై నెలకొన్న అనుమానాలు త్వరలో నివృత్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఆమె మెరీనా బీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయలలిత ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి ఆమె మరణం వరకు అంతా గోప్యంగా ఉండడం బాధాకరమైన విషయమని తెలిపారు. జయలలిత అందించిన చికిత్సపై ఇప్పటి వరకు సరైన వివరాలు వెల్లడి కాకపోవడం శోచనీయమన్నారు.
ఇదిలా ఉంటే.. జయలలిత మృతి నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరపైకి కొత్తగా 'అమ్మ' పార్టీ వచ్చింది. 2015లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు ఆమె కేసు నుంచి బయటపడాలని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ శిలువ వేసుకున్న షిహాన్ హుస్సైనీ ఈ పార్టీని స్థాపిస్తున్నాడు.